2019లో గెలుపెవరిది..?


అందరిలోనూ ఆసక్తి.. 2019 ఎన్నికల కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబా.? జగనా.. తెలంగాణలో కేసీఆర్..? లేక కాంగ్రెస్.? ఢిల్లీ పీఠం బీజేపీకి వస్తుందా.? ఇలా ఎన్నో అనుమానాలు.. ఊహలు, కల్పనలు.. మరి ఎవరిది విజయం అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ.. 2009 వైఎస్సార్ ది, 2014 చంద్రబాబుదీ-కేసీఆర్ ది, మరి. 2019 ఎవ్వరిదంటే..? ఈ ప్రశ్నకు జవాబుల్ని వెతకడం ఏడాది కిందటే మొదలైపోయింది. తూకంరాళ్లు ఎప్పటికప్పుడు అటూఇటూ మారిపోతుండడంతో పొలిటికల్ ఈక్వేషన్లలో ఇప్పుడిప్పుడే చలనం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ మార్పిడి జరుగుతుందా… ప్రభుత్వ వ్యతిరేక ఓటు విషయంలో ఏ రాష్ట్రానికి ఎంత భయం? ఎంత భరోసా? కొద్దికొద్దిగా క్లారిటీలొస్తున్న మాటైతే నిజం.

*ప్రతిపక్షం బలహీనం..
పదవుల కోసమో, పైసల కోసమో జరిగే వలసల్ని-గెంతుళ్లను బట్టి పార్టీ బలాబలాల్ని బేరీజులేసుకునే ఛాన్సులైతే ఎప్పుడూ లేవు. ఆపరేషన్ ఆకర్ష్ లాంటి బిస్కెట్ల పంపిణీకి లొంగి అధికారపార్టీలోకి జంపయ్యే జహాపనుల్ని బట్టి.. ఫలానా పార్టీ బలంగా వుందన్న గ్యారంటీలు ఎవ్వడూ ఇవ్వలేడు. కొద్దోగొప్పో జనం నాడి ఖచ్చితంగా తెలియాలంటే ఉపఎన్నికల కంటే మరో గత్యంతరం ఏముంది? తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన బైపోల్స్ ని.. అక్కడ జనమిచ్చిన తీర్పుల్ని గమనిస్తే.. రూలింగ్ పార్టీల కరిష్మాకు కోత పడ్డ దాఖలా ఐతే ఎక్కడా లేదు. అపోజిషన్ పార్టీల పెర్ఫామెన్స్ కూడా చెప్పుకోదగ్గ రీతిలో లేకపోవడం ఇద్దరు చంద్రుళ్లకూ గొప్ప రిలీఫ్ లాంటిదే.

*హామీలు నీటి మూటలు..
తొలిరోజుల్లో తెగ భయపెట్టి కంటిమీద కునుకుల్లేకుండా చేసిన ‘రుణ మాఫీ’ లాంటి మెగా హామీలు ఆతర్వాత కొద్దికొద్దిగా సద్దుకున్నయ్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటింటికీ నీళ్లంటూ చెప్పిన మాటలు కేసీఆర్‌ని గుచ్చుకుంటుంటే.. కేంద్రంతో కొట్లాడి స్పెషల్ స్టేటస్ తెచ్చుకుందామన్న మాట చంద్రబాబు కింద మంట పెట్టేస్తోంది. ఓట్లడుక్కోవాల్సి వచ్చినప్పుడు.. ఈ రెండుమూడు విషయాల్లో మాత్రమే రెండు తెలుగు ప్రభుత్వాలూ సంజాయిషీ ఇచ్చుకోవాలి. అయినా.. పాత మేనిఫెస్టోలో మిగిలిపోయిన హామీల్ని, పేర్లుమార్చి కొత్త మేనిఫెస్టోలో మళ్లీ రాసుకొచ్చినా అవాక్కయ్యే అవసరాలెక్కడ?

*బీజేపీలో జగన్ కలుస్తాడా..?
మనం బలపడకపోయినా.. శత్రువును బలహీనపరిచి యుద్ధం గెలవడమనేది రాజకీయాల్లో ఇంకో బలమైన మూలసూత్రం. మన పనితీరు బ్రహ్మాండంగా లేదంటూ సర్వేల్లో తేలినప్పుడు.. ఏ ప్రభుత్వమైనా ప్రతిపక్షం బలహీనపడేలా ఎత్తుగడ సిద్ధం చేస్తుంది. ఏపీలో జగన్ పార్టీ భవిష్యత్తు మీద ఇప్పుడు కొత్తకొత్త సందేహాలు. తనమీదుండే ఆస్తుల కేసుల్ని మాఫీ చేయించుకోవడం కోసం పార్టీ మొత్తాన్ని బీజేపీలో విలీనం చేస్తారంటూ జగన్ మీద మీడియాలో మళ్ళీ వార్తలొచ్చేశాయి. ఈ పాత వార్తల్లో నిజమెంతో తెలీదు. స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా మొండిచెయ్యి చూపెట్టిన బీజేపీతో అంటకాగేంత తెగింపు వైసీపీ చేస్తుందా..? ఇవి కూడా అంతులేని అర్థం కాని ప్రశ్నలే.

*జోడు గుర్రాలను తలదన్నేదెలా.?
ఢిల్లీ కుర్చీకి మేకుల్ని బిగించుకున్న మోదీ-అమిత్ షా కూటమి.. తమ స్టార్ పెర్ఫామెన్స్ ని రాష్ట్రాల్లో కూడా చూపించడం మొదలైపోయింది. యూపీలో బీజేపీ విక్టరీ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల కింద కూడా నేల కదిలిపోయింది. ఎస్పీ, బీఎస్పీ లాంటి ఏజ్-ఓల్డ్ పార్టీలే నేలకరిచిన నేపథ్యాన్ని తేలిగ్గా తీసుకోలేం. ఇక.. మిగతా ప్రాంతీయ పార్టీలక్కూడా మూడినట్టేనన్నది బీజేపీ నుంచి జారీ అయిన తాజా హెచ్చరిక ! దీని తాలూకు ప్రకంపన తెలుగుదేశం, టీఆర్ఎస్ చెవుల్లో మాత్రం పడకుండా వుంటుందా? ప్రాంతీయతే ప్రాణవాయువుగా బతికే తమిళ పాలిటిక్స్ లోనే బీజేపీ కాళ్లూవేళ్లూ పెట్టేసింది. ఇక.. తెలుగు పార్టీలతో చెడుగుడులాడ్డం ఒక్క లెక్కేమీ కాకపోవచ్చు. తమిళనాడు సీఎం పళనిస్వామి బ్యాక్ గ్రౌండ్ మీద బీజేపీ ఓ కన్నేసిందని, అటు ఒడిషాలో నవీన్ పట్నాయక్ అవినీతి కేసుల్ని కూడా కెలికెయ్యాలంటూ అమిత్‌షా ఆర్డరిచ్చేశారని వార్తలొస్తున్నాయి. అటు.. బెంగాల్ దీదీ మమతా బెనర్జీని కార్నర్ చెయ్యడానికే నారదా స్టింగాపరేషన్ మీద సీబీఐని ప్రయోగించినట్లు ఆరోపణుంది.

*బీజేపీ దండయాత్ర కొనసాగుతుందా.?
అస్మదీయుడు గాలి జనార్ధన్‌రెడ్డికి ఈడీ నుంచి గ్రేట్ రిలీఫ్ నిచ్చిన బీజేపీ సర్కార్ కి.. తస్మదీయులకు ఫ్రీ పాసేజ్ ఇచ్చేంత గొప్ప మనసుంటుందని నమ్మకమెక్కడ..? తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు, జగన్‌ల మీద మోదీ మార్క్ ‘చేతబడి’ జరగదన్న గ్యారంటీలైతే ఎవ్వరైనా ఇవ్వగలరా? రేపటిరోజున.. అమిత్ షా దండయాత్ర దక్షిణం వైపుకు మళ్లితే, రాజకీయ సమీకరణాలు మారిపోవడం ఎంతసేపు? ఇటువంటి గుబులు చంద్రబాబు శిబిరంలో ఇప్పటికే మొదలైపోయిందా..? అటు. మోదీతో ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేస్తున్న కేసీఆర్.. తెలంగాణా బీజీపీతో శత్రుత్వం ఇంతకంటే పెంచుకుంటారా..? లేకపోతే.. అమిత్‌షాతో కలిసి మరేదైనా స్ట్రాటజీ వర్కవుట్ చేస్తారా..?

To Top

Send this to a friend