లొల్లి చేశాక తగ్గిస్తారా మహాప్రభూ..


జీఎస్టీ.. జీఎస్టీ.. ఎక్కడ చూసినా అవే పన్నులు, అవే కథలు.. రాష్ట్రాలు తమతమ రాష్ట్రాల్లో ఎంతో మందికి ఉపాధినిచ్చే, అత్యవసరమయ్యే వాటిపై పన్నులు వేయవద్దని మొత్తుకుంటున్నా కేంద్రం పెడచెవిన పెడుతోంది.. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల బీడీ పరిశ్రమ వల్ల తెలంగాణలో వేలమంది బతుకుతున్నారని.. పొగాకు 28శాతం పన్నువద్దని ఎంత మొత్తుకున్నా వినలేదట.. దీంతో కేంద్రం తీరుపై ఈటెల బహిరంగ విమర్శలు చేశారు.

ఇక మధుమేహ రోగులు నిత్యావసరంగా వాడే ఇన్సులిన్ ఇంజక్షన్లు.. పేదలు పెట్టుకునే ఊరగాయలు, బడిపిల్లలు వాడే స్కూలు బ్యాగులు, షూస్ ఇలా పేదలపై పెనుభారం మోపేలా గతంలో 28శాతం పన్ను విధించారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగడం తో కేంద్రం దిగివచ్చింది. పై వాటన్నింటిపై 18శాతమే పన్ను విధించేలా నిన్న సవరణ చేసింది.

దేశంలోనే హిట్లు లేక.. సినిమాలు ఆడక.. కుదేలైన సినిమా పరిశ్రమపై 28శాతం పన్ను పోటు విధించడంతో అందరూ నిరసన తెలిపారు. చిన్న సినిమాలు నిర్మించడం ఇక కష్టమేనని టాలీవుడ్ ప్రముఖులందరూ కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో కేంద్రం దిగివచ్చి రూ.100 టికెట్ ఉన్న సినిమాలపై 18శాతం పన్ను విధిస్తామని తెలపడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇలా కేంద్రం ప్రజాభిప్రాయాలు తెలుసుకోకుండా ఇష్టానుసారంగా జీఎస్టీ వేసి ఇప్పుడు ప్రజలనుంచి వ్యతిరేకత రావడంతో దిగివస్తోంది. ఈ బుద్ది ఏదో ముందే ఉండాలని జనం మొత్తుకుంటున్నా వినడం లేదు.

To Top

Send this to a friend