హైదరాబాద్‌లో పాత్రికేయులతో చిరంజీవి ఇంటర్వ్యూ


అదే జోరు.. అదే హుషారు..అదే స్టైల్..పదేళ్లు విరామం వచ్చినా చిరంజీవిలో నటన పట్ల ఉన్న తపన, డ్యాన్సుల్లో వేగం,డైలాగుల్లో వాడి.. ఏదీ తగ్గలేదు. బాస్ ఈజ్ బ్యాక్.తెలుగు సినీ చరిత్రలో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్నిసృష్టించుకున్న చిరంజీవి ఖైదీ నంబర్ 150తో సుదీర్ఘ విరామం తర్వాత పునఃప్రవేశిస్తున్నారు.కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిరంజీవి పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..

ఈ సినిమా మీ పొలిటికల్ లైఫ్‌కు ఎంతవరకూ ఉపయోగపడుతుందనుకుంటున్నారు?
దేశంలో నెలకొన్న సమస్యలకు వాస్తవరూపంగా ఈ సినిమా ఉంటుంది. గత పదేళ్లలో రైతులు ఎంత మంది చనిపోయారు? అందులో తెలుగు వారెందరు ఉన్నారు? అనే లెక్కలను యదార్థంగా ఇందులో ఆవిష్కరించాం. కోట్ల రూపాయల్ని ఎగవేసిన కార్పొరేట్ సంస్థల వ్యాపారులు సంతోషంగా గడుపుతుంటే కొద్దిపాటి అప్పులు కట్టలేని రైతులు పురుగుల మందులు తాగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాటికి గల కారణాల్ని హృద్యంగా సినిమాలో చూపించాం. రైతుల సమస్యలను ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోవడానికి ఈ చిత్రం చక్కటి వారధిగా నిలుస్తుందని అనుకుంటున్నాను.

మీ కుటుంబం నుండే చరణ్‌కు ఎక్కువగా పోటీ ఉందని అనుకుంటున్నారా?
అర్జున్, వరుణ్, సాయి ఇలా కుటుంబంలో ఉన్నా అందరూ హీరోలు సరదాగా ఉంటారు. వారి మధ్య అందమైన పోటీ ఉంటుందే తప్ప అనారోగ్యకరమైన పోటీ కాదు. ఇన్నేళ్లలో ఏం సంపాదించామా అని వెనక్కి తిరిగి చూసుకుంటే పిల్లల రూపంలో మంచి నటులను సినిమా రంగానికి అందించామని సంతోషంగా చెప్పగలను. వారు ఏం చేసినా, ఎక్కడ ఉన్నా నేను వెనకాలే ఉన్నాననే భయం ఎప్పుడు ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తే వెంటనే వారిని హెచ్చరిస్తాను.

ప్రీరిలీజ్‌కు సంబంధించి విజయవాడ వేదిక మారడానికి రాజకీయపరమైన కారణాలేమిటైనా ఉన్నాయని అనుకుంటున్నారా?
న్యాయసంబంధమైన వ్యవహరాల వల్లే వేదిక మారింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు తప్ప ప్రైవేటు వేడుకలకు అనుమతులు ఇవ్వకూడదని కోర్టు నిబంధన ఉంది. అది తెలియకుండా మొదట మాకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాతే యదార్థం తెలిసింది. అంతే తప్ప వేదిక మారడం వెనుక ఎలాంటి రాజకీయ కారణం లేదు. ఎవరి ప్రమేయం లేదు.
పునరాగమనానికి రీమేక్ కథను ఎంచుకోవడానికి కారణమేంటి?
150వ సినిమాకు సంబంధించి ఏడాది పాటు కథల కోసం అన్వేషించాం. కానీ అంచనాలకు తగ్గ మంచి కథ ఒక్కటి ఎదురుకాలేదు. ఏవీ సంతృప్తిని కలిగించలేదు. బాధ్యతయుతమైన స్థానం నుండి సినిమాల్లోకి పునరాగమనం చేస్తున్నప్పుడు కమర్షియల్ సినిమాతో కాకుండా సమాజానికి ఉపయుక్తమైన కథాంశంతో వస్తే బాగుంటుందని అనిపించింది. ఠాగూర్, స్టాలిన్ లాంటి సందేశాత్మక కథలైతే మంచిదనే ఆలోచన వచ్చింది. సమయం గడుస్తున్నా అలాంటి కథ మాత్రం దొరకలేదు. అలాంటి తరుణంలో కత్తి సినిమా చూశాను. కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక ఇతివృత్తంతో కూడిన మంచి సబ్జెక్ట్ కావడంతో రీఎంట్రీకి ఇదే సరైనదని అనిపించింది.

మీ కెరీర్‌లో చూడని విజయాలు లేవు. సాధించని రికార్డులులేవు. నెంబర్‌వన్ హీరోగా నిలిచిన మీరు సేఫ్‌జోన్ అనే ఆలోచనతోనే ఈ రీమేక్‌ను ఎంచుకున్నారా?
ఠాగూర్ విడుదలైనప్పుడు సరైన సమయంలో వచ్చిన మంచి సినిమా అంటూ అందరూ ప్రశంసించారు. అలాంటి మంచి కథ దొరికితే ఎవరైనా కాదంటారా. సందేశం మిళితమైన అద్భుతమైన కథ కావడంతోనే కత్తి రీమేక్‌లో నటించాలని నిర్ణయించుకున్నాను. అంతా తప్ప తమిళ సినిమానా, రీమేకా అని ఆలోచించలేదు

పదేళ్ల తర్వాత తిరిగి వెండితెరపై కనిపించబోతుండటం ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది?
రజనీకాంత్, అమితాబ్‌బచ్చన్‌తో పాటు అభిమానులు నేను మళ్లీ సినిమాలు చేస్తే బాగుంటుందని చాలా సందర్భాల్లో తమ మనసులోని మాటను చెప్పారు. నాకు నటించాలని అనిపించినా మళ్లీ తెరపై ఎలా కనబడతానో, ఎలా సన్నద్ధమవ్వాలనే అనేక సంశయాలు నాలో మొదలయ్యాయి. కానీ మనసులో ఉన్న జోరు, హూషారు మాత్రం తగ్గలేదు. అవే నన్ను పూర్వ వైభవాన్ని సంతరించుకునేలా చేశాయి. 2007లో శంకర్‌దాదా జిందాబాద్ నుండి 2017లో ఖైదీ నంబర్ 150 వరకూ పదేళ్లను ఎప్పుడూ గ్యాప్‌గా ఫీలవ్వలేదు. మళ్లీ లైట్స్, కెమెరా, యాక్షన్ అనే పదాలను వినగానే నాలో ఉత్సాహం రెట్టింపు అయింది. ఇదే కదా అసలైన జీవితం అనిపించింది.

చాలా రోజుల తర్వాత సినిమా చేస్తున్నారు? ఆ ఒత్తిడి మీపై ఉందా?
కథపై చాలా నమ్మకంతో ఉన్నాం. అందుకే సినిమా విషయంలో ఎలాంటి భయాలు లేవు. అయితే కాంపిటీషన్‌కు వెళ్లే ముందు ఉండే క్యూరియాసిటీ మాత్రం కొంత ఉంది. గతంలో ఎన్ని సినిమాలు చేసినా ఆ టెన్షన్‌ను ఎవరూ దూరం చేయలేరు.

సినిమా కోసం బరువు తగ్గడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు.?
ఈ సినిమాకు నా కోచ్, డైటీషియన్ అన్ని రామ్‌చరణే. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వ్యాయామాలతో పాటు ఫిట్‌గా ఉండటానికి ఏం చేయాలో తనే సలహాలు ఇచ్చాడు. ఈ సినిమాకు చరణ్ ప్రొడ్యూసర్ కావడంతో తన హీరో తెరపై బాగా కనిపించాలనే ఆలోచనతో శ్రద్ధ తీసుకున్నాడు కావచ్చు(నవ్వుతూ). మనసు ప్రశాంతంగా ఉంటే ఆ ప్రభావం ముఖంపై ప్రతిఫలిస్తుంది ఎన్ని టెన్షన్స్ ఉన్నా వాటిని పక్కనపెట్టి నిర్మలమైన మనసుతో స్వచ్ఛంగా ఉండటానికే ప్రయత్నిస్తాను.

ఈ పదేళ్లలో సినిమా రంగంలో మీరు గమనించిన మార్పులేమిటి?
ఈ పదేళ్లలో సినిమా అర్థం పూర్తిగా మారిపోయింది. నిర్మాణం, నటనతో అన్ని విభాగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో క్లాప్ సౌండ్, ప్రొజెక్టర్స్, ఫిలిం చాలా ఉండేవి. అవన్నీ కనుమరుగైపోయాయి. డిజిటలైజేషన్ వల్ల ప్రతీదీ సులభతరమైపోయింది. తెరపై నాయకానాయికలు మరింత గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. ఈ మార్పులు మంచికే అనుకుంటున్నాను.

ప్రీరిలీజ్ వేడుకలో నాగబాబు మాటలు వివాదాస్పదమైయ్యాయి?వాటిపై మీరేమంటారు?
కొందరి చర్యల వల్ల క్షోభను అనుభవించాడు కాబట్టే నాగబాబు ప్రీరిలీజ్ వేడుకలో అలా మాట్లాడాడు. అలాంటి మాటలు ఎవరినైనా బాధిస్తాయి. అది సహజం. వాటిని ఒక్కొక్కరు ఒక్కోలా స్వీకరిస్తారు. నాగబాబు ఆ బాధను అనుభవించాడు. కొలతలు, లెక్కలు ఏవీ లేకుండా తన మనసులో ఉన్నది చెప్పాడు. తన తరఫు నుండి చూస్తే అదేం తప్పు కాదనుకుంటున్నాను. అనాలోచితంగా మాట్లాడి మరొకరిని బాధపెట్టడం ఎంత వరకు సమంజసం అనేది ఎదుటివారే ఆలోచించాలి. పాజిటివ్ ఉండాలన్నదే నా సిద్ధాంతం. విమర్శలు గురించి ఆలోచించడం మొదలుపెడితే దాని విలువ పెరుగుతుంది. అలా కాకుండా పట్టించుకోపోతే అదే సమసిపోతుంది. అందుకే నేను విమర్శల్ని పట్టించుకోను.

రామ్‌గోపాల్‌వర్మతో మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా?
మా మధ్య స్నేహం తప్ప ఎలాంటి విభేదాలు లేవు. మంచి మనిషి. రామ్‌గోపాల్‌వర్మతోనే కాదు మా కుటుంబానికి ఎవరితో ఏ గొడవలు లేవు.

ఖైదీ నంబర్ 150తో పాటు బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలు మీ ఇద్దరి కెరీర్‌లో కీలకంగా నిలవనున్నాయి. మరోసారి బాలయ్యతో పోటీపడబోతుండటం ఎలా ఉంది?
ఖైదీ నంబర్ 150 షడ్రసోపేతమైన భోజనంలా అభిమానుల్ని అలరించే కమర్షియల్ సినిమా. కానీ గౌతమి పుత్ర శాతకర్ణి మాత్రం వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కింది. ఆ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యాను. అలాంటి కథను వందోవ సినిమా కోసం ఎంచుకోవడమే తొలి సక్సెస్ అని బాలకృష్ణకు ఆరోజే చెప్పాను. అలాంటి కథలకు ఆయన మాత్రమే న్యాయం చేయగలడు. ఇప్పటికీ అదే చెబుతున్నాను. ఓ సినిమాపై కొన్ని వందల మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందరి సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాను.

150 వ సినిమా కోసం విన్న కథలను సెట్స్‌పైకి తీసుకొచ్చే ఆలోచన ఉందా?
పరుచూరి బ్రదర్స్ సిద్ధం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరపైకి తీసుకొచ్చే ఆలోచన ఉంది. అలాగే సురేందర్‌రెడ్డి మరో మంచి కథ వినిపించారు. బోయపాటి శ్రీనుతో 152వ సినిమా అనుకుంటున్నాం. గీతా ఆర్ట్స్‌లో మరో సినిమా చేస్తాను.

రాజకీయాలు?సినిమాలు? దేనిలో కొనసాగాలనుకుంటున్నారు?
ప్రస్తుతం రాజకీయపరంగా స్తబ్దత ఏర్పడింది. దాంతో సినిమాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నాను. అలాగే మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి ప్రయోక్తగా వ్యవహరిస్తున్నాను.

పదేళ్లు గ్యాప్ వచ్చినా మీ డ్యాన్సుల్లో జోరు తగ్గలేదు. ఆ సీక్రెట్ ఏమిటి?
నా కూతురు పెళ్లిలో తప్ప ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా డ్యాన్స్ చేయలేదు. కానీ ఎక్కడైనా మ్యూజిక్ వినపడితే మనసు లోపల మాత్రం డ్యాన్స్ చేసేవాణ్ణి. పైకి మాత్రం సాధారణంగా కనిపించేవాణ్ణి. ఆ తపన అలాగే ఉండిపోయింది. అదే నన్ను సినిమాలో డ్యాన్స్ చేయించింది.

పవన్‌కల్యాణ్ పొలిటికల్ జర్నీపై మీ అభిప్రాయమేమిటి?
పవన్‌కల్యాణ్ తనశైలిలోనే రాజకీయాల్లో ముందుకుసాగుతున్నాడు. అతడికి మంచే జరుగుతుందని భావిస్తున్నాను.

రాజకీయాలకు గుడ్‌బై చెప్పే ఆలోచన ఉందా?
దేనికి ముంగింపు పలకను. పరిస్థితులకు అనుగుణంగా సమయానుసారం ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాను. రాజకీయాలకు గాని, కాంగ్రెస్‌కు గాని  దూరం కాలేదు. పార్టీ మారే ఆలోచన లేదు. సినిమాలు, రాజకీయాలు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజల ముందుకు వెళ్లడానికే ప్రయత్నిస్తాను.

ప్రస్తుతం ఓపెనింగ్స్ అనేవి సినిమాకు కీలకంగా మారిపోయాయి? మీ సినిమాపై వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుందని అనుకుంటున్నారు?
ఓ సినిమాను పూర్తిచేయడం వరకే నా బాధ్యత. అది ఎంత వసూళ్లు చేస్తుంది? థియేటర్లు ఎన్ని దొరికాయి? ఎన్ని రోజులు ఆడుతుంది?అనేది లెక్కలను నేను పట్టించుకోను. 100 రోజుల ట్రెండ్ కొనసాగుతున్న సమయంలో సినిమాలు చేశాను. ప్రస్తుతం ఆ ట్రెండ్ మారింది. సినిమాల జీవితం వారాలుగా పడిపోయింది. వంద కోట్లు, రెండు వందల కోట్లు అనే ధోరణి పెరిగింది. ఒకప్పుడు సినిమాల విషయంలో రోజులు మాట్లాడేవి. ఇప్పుడు అంకెలు మాట్లాడుతున్నాయి.

పవన్‌కల్యాణ్‌తో మీకు విభేదాలు ఉన్నాయని, ఆ కారణంగానే ఆయన మీ వేడుకలకు హాజరుకాలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది?
ఏం లేనిదాని గురించే ఎక్కువగా వార్తలు రాస్తారు. అలాంటి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాటికి బదులిస్తూ పోతే మనమే వాళ్లకు టార్గెట్ అవుతాం. ఏ మాత్రం అవకాశం ఉన్నా వేడుకకు రమ్మనమని పవన్‌కల్యాణ్‌ను చరణ్ ఆహ్వానించాడు. అందరూ అన్ని వేడుకలను రావాలని లేదు.

To Top

Send this to a friend