సైకిల్ గుర్తు.. ఈ గుర్తున్న పార్టీలంటేనే ఓ సంచలనం..

samajwadi-party-tdp

సైకిల్ గుర్తు.. ఈ గుర్తున్న పార్టీలంటేనే ఓ సంచలనం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి సైకిల్ గుర్తుపైనే కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని కొల్లగొట్టారు. అప్పటివరకు అప్రతిహతంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ ను ఒంటిచేత్తో మట్టికరిపించారు.. తెలుగుదేశం పార్టీకి బాగా కలిసివచ్చిన ఈ సైకిల్ గుర్తు ప్రజలకు ఎంతో చేరువయ్యింది.
అలాగే ఉత్తరభారతంలోని ఉత్తరప్రదేశ్ లో కూడా సైకిల్ గుర్తు హవా నడుస్తోంది. ములాయం సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీకి కూడా ఎన్నికల కమిషన్ ప్రాంతీయ పార్టీ హోదాలో సైకిల్ గుర్తునే కేటాయించింది. ఇప్పటికీ ములాయం చాలాసార్లు యూపీ సీఎంగా ఎన్నికై విధులు నిర్వర్తించారు. గత ఎన్నికల్లో కూడా మాయవతిని ఓడించి ములాయం సైకిల్ గుర్తు(సమాజ్ వాదీ)పై గెలవగా.. వృద్దాప్యంతో తన కొడుకైన అఖిలేష్ యాదవ్ కు సీఎం పోస్టు కట్టబెట్టి ఢిల్లీ రాజకీయాల వైపు ములాయం దృష్టిసారించారు.
అక్కడా ఇక్కడా సవతుల పోరే..
ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని ఎంత కసితో అధికారంలోకి తీసుకొచ్చారో అంతే కసితో చివర్లో మసకబారారు.. 1994లో ఎన్టీఆర్ సీఎం గా ఉన్న సమయంలో లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకున్నాక కీలుబొమ్మగా మారి అధికారాన్ని ఆమె చేతిలో పెట్టినట్టు టీడీపీ శ్రేణులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ పరిణామాలను క్యాష్ చేసుకున్న ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు ఏకంగా మామకే ఎసరు పెట్టి సీఎం పీఠాన్ని అధిష్టించాడు. ఆ పరిణామాలకు కలత చెంది ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించడం.. సైకిల్ గుర్తు ఎన్టీఆర్ చేతుల్లోంచి చంద్రబాబుకు చేరడం జరిగిపోయింది. ఇక ఉత్తర ప్రదేశ్ లో కూడా ములాయంకు ఇద్దరు భార్యలు.. మొదటి భార్య కొడుకైన అఖిలేష్ ను గడిచిన ఎన్నికల్లో ప్రొజెక్ట్ చేసి సీఎం సీటు ఇప్పించారు. అఖిలేష్ తండ్రి బాటలో నడవకుండా స్వతంత్రంగా ముందుకెళ్లి పలు పథకాలతో ప్రజలకు చేరువయ్యాడు. ములాయంకు కొమ్ముకాసే.. పార్టీని భ్రష్టు పట్టిస్తున్న అమర్ సింగ్, జయప్రద, ములాయం తమ్ముడు శివపాల్ యాదవ్ ను పార్టీనుంచి బహిష్కరించారు. వచ్చే ఎన్నికల్లో చురుకైన నాయకులకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఇది నచ్చని అసమ్మతి వాదులు ములాయంను రెచ్చగొట్టి అఖిలేష్ ను సస్పెండ్ చేయించడం జరిగిపోయింది. ములాయం కూడా కొడుకు ఏకపక్ష వైఖరిని నచ్చక రెండో భార్య కుమారులను గద్దెనెక్కించాలని చూడడం కూడా అఖిలేష్ కు మండి ఏకంగా తండ్రినే పార్టీ నుంచి సాగనంపారు.
ఇలా సైకిల్ గుర్తు కలిగియున్న రెండు పార్టీలు టీడీపీ, సమాజ్ వాదీలలో కుటుంబ తగాదాలే వారి పతనానికి కారణమయ్యాయి. అక్కడ ఇక్కడ సవతుల పోరుతోనే పార్టీ నాశనమవుతోంది.. ఇక్కడ ఎన్టీఆర్ అధికారం కోల్పోతే.. యూపీలో ములాయం ఒంటరి అయ్యాడు..

To Top

Send this to a friend