సీమలో గెలుపెవరిది?

ఏపీలో వివిధ కోటాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ఎత్తు. పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు మరో ఎత్తు. ప్రభుత్వంలో దడ పుట్టిస్తున్నది కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కలుపుకుని ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ ఈజీగా ఐదు ఎమ్మెల్సీ స్థానాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల కోటా విషయానికి వస్తే అక్కడే ఎలాగో పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఓట్లేస్తారు కాబట్టి గెలుపు ప్రభావం చాలా స్వల్పం.

అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం ప్రభుత్వానికి సవాల్‌. ఇంటికో ఉద్యోగం, లేదంటే నిరుద్యోగ భృతి, ప్రత్యేక హోదా ఇలా రకరకాలుగా ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీ ఇచ్చిన చంద్రబాబు … వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దీంతో యువత టీడీపీకి వ్యతిరేకంగా మాటువేశారన్న ఆందోళన టీడీపీ వర్గాల్లో ఉంది. పట్టభద్రుల స్థానాల్లోనూ ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో రాయలసీమ పశ్చిమ నియోజకవర్గానికి బాగా డబ్బున్న కేజేరెడ్డిని టీడీపీ బరిలో దింపింది. వైసీపీ ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు గోపాల్‌ రెడ్డిని రంగంలోకి దింపింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ గేయానంద్‌ మరోసారి పోటీకి దిగారు. అయితే ఎవరికి ఓటేస్తే ఏం జరుగుతుందన్న దానిపై పట్టభద్రులు లెక్కలేసుకుంటున్నారు.

గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ఎన్నికలు చంద్రబాబుపై ప్రతికారం తీర్చుకునే అవకాశంగా పట్టభద్రులు, యువత భావిస్తున్నారు. తమకు రంగుల సినిమా చూపించి మోసగించిన టీడీపీకి ఈ ఎన్నికల ద్వారా త్రీడీ సినిమా చూపించిన్న భావన యూత్‌లో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని గమనించిన టీడీపీ ఒక దశలో తాము ఓడిపోయినా పర్వాలేదు… వైసీపీ అభ్యర్థి మాత్రం గెలవకూడదన్న సూత్రాన్ని ప్రయోగించే ఆలోచన చేసింది. కేజేరెడ్డి చాలా వెనుకబడ్డారని భావించిన టీడీపీ… పరోక్షంగా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ గేయానంద్‌కు మద్దతు ఇవ్వాలని భావించింది.

కానీ అలా చేస్తే కేజే రెడ్డి చిత్తుచిత్తుగా ఓడిపోతారని అప్పుడు టీడీపీ పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆ ఆలోచన విరమించుకుంది అధికార పార్టీ. కేజే రెడ్డి ఇప్పటికే సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను పంచుతూ చదువుకున్న యువతను కొనేందుకూ శతవిధాల ప్రయత్నిస్తున్నారు .రాజధానిలో చక్రం తిప్పిన ధనిక మంత్రి టీడీపీ తరపున కేజేరెడ్డికి భారీగా ముడుపులను పంపుతున్నారు.

అయితే ఎవరికి ఓటేయాలన్న దానిపై పట్టభద్రులు కొన్ని లాజిక్కులు చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి పట్టభద్రుల పవర్‌ ఏంటో తెలియాలంటే కేజేరెడ్డిని ఓడిస్తే సరిపోదని అధికార పార్టీకి మంట పుట్టేలా చేయాలంటూ చంద్రబాబుకు ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థిని గెలిపించడమే సరైన మార్గమంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీ అభ్యర్థితో పాటు వైసీపీ అభ్యర్థి ఓడిపోతే చంద్రబాబుకు పెద్దగా హీట్‌ తగలదంటున్నారు. ఈసారి గేయానందపైనా యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆరేళ్లలో ఆయన సాధించింది ఏముందని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడ్డ ఆరు నెలల ముందు నుంచే గేయానంద్‌ ధర్నాలు, ఆందోళన మొదలుపెట్టడాన్ని చదువుకున్న పట్టభద్రులు ప్రస్తావిస్తున్నారు.

పైగా సమైక్యాంధ్ర ఉద్యమసమయంలో అనంతపురంలో యువత రోడెక్కిపోరాటం చేస్తున్న సమయంలో గేయానంద్‌ కనిపించలేదు. తిరుపతిలో ఒకసారి రాయలసీమ సమస్యలపై సదస్సు నిర్వహిస్తే అక్కడ కూడా గేయానంద్‌ అందరి భావాలకు భిన్నంగా మాట్లాడారు. కొందరు యువత సదస్సులో గేయానంద్‌ను నిలదీయగా ఆయన సమాధానం రాయలసీమవాసులకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఆరేళ్ల పదవీకాలంలో పట్టభద్రుల ప్రయోజనాల కాపాడేలా గేయానంద్ సాధించింది ఏముందని యువత ప్రశ్నిస్తున్నారు.

దీన్ని గమనించే ఎన్నికల సమీపించిన తర్వాత గేయానంద్.. కడప ఉక్కు, గుంతకల్లు రైల్వే జోన్ అంటూ కొన్ని ఆందోళనలు నిర్వహించారు. ఈ ఎత్తులు చూసి గేయానంద్‌ కూడా రాజకీయాలకు బాగా అలవాటుపడ్డారన్న విమర్శ వస్తోంది. మొత్తం మీద చూస్తే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభుత్వం వర్సెస్ పట్టభద్రులు అన్న రీతిలో జరగలేదు. కానీ ఈసారి మాత్రం యువత ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. తమను పిచ్చివాళ్లను చేసి మోసం చేసిన ప్రభుత్వానికి తామంటే ఏంటో చూపిస్తామంటున్నారు.

ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే చంద్రబాబు ప్రభుత్వానికి మంట పుడుతుందో వారికే ఓటేస్తాముంటున్నారు. గేయానంద్‌కు ఓటేస్తే యువత దెబ్బ ఎలా ఉంటుందో చంద్రబాబుకు అర్థం కాదని.. కాబట్టి వైసీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డికి ఓటేస్తేనే చంద్రబాబు సర్కార్‌కు సెగ తగులుతుందంటున్నారు. గేయానంద్‌ పనితీరును ఇప్పటికే ఒకసారి చూశాం కాబట్టి ఈసారి మరొకరికి అవకాశం ఇద్దామన్న ఆలోచన కూడా యూత్‌లో వ్యక్తమవుతోంది. యువతలో వ్యక్తమవుతున్న ఈ ధోరణి సహజంగానే టీడీపీకి బద్ధవ్యతిరేకి అయిన వైసీపీకి అనుకూలిస్తోంది.

To Top

Send this to a friend