సీఎం కేసీఆర్ సార్.. జర సోచాయించండి.

తెలంగాణలో ఇప్పుడు నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఉద్యమకారుడే సాటి ఉద్యమకారులకు అన్యాయం చేస్తున్నాడని మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన విద్యార్థుల భవిష్యత్ తో ఆటలాడుకుంటన్న సీఎం కేసీఆర్, టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణి వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో గురుకులాల్లో దాదాపు 7వేల పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో నిబంధనలు నిరుద్యోగుల పాలిట శాపంలా మారాయి. టీజీటీ, పీజీటీ పోస్టులకు అర్హత సాధించాలంటే డిగ్రీలో 60శాతం మార్కులు ఉండాలని.. కనీసం మూడేళ్ల బోధనానుభవం ఉండాలన్న నిబంధనతో వేలమంది నిరుద్యోగులు అవకాశం కోల్పోతున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో తెలంగాణలో నిరసన వ్యక్తం అవుతోంది. డిగ్రీ, బీఈడీ, టెట్ కూడా ఎన్ సీఆర్ టీఈ నిబంధనల ప్రకారం 45 శాతం మార్కులు వస్తే అర్హత.. కానీ గురుకుల పోస్టులకు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం 60శాతం పెట్టడంపై నిరుద్యోగలోకం ఆందోళనలకు, హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. సీఎం కేసీఆర్, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వైఖరి మార్చుకోవాలని తెలంగాణ కోసం పోరాడిన నిరుద్యోగులకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి విడుదల చేసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపిస్తోంది.. ఆ లేఖ సారాంశం కింద చూడొచ్చు..

‘‘సీఎం గారు మిమ్నల్ని ఉద్యోగం అడిగితే ఉన్న గోచి ఊడగొడుతున్నారేంటీ సర్… ఐఏఎస్ పరీక్షలకే లేని పర్సెంటేజీ మార్కులు మాకెందుకు పెడుతున్నారు సర్.
ప్రత్యేక ఉద్యమానికి పరీక్షలు ఎగ్గొట్టి వచ్చిన్నప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదు సర్.
మిలియన్ మార్చ్ లో కాళ్లు విరగ్గొట్టుకున్నప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని అడగలేదేంటీ సర్…
సాగరహారంలో లాఠీ దెబ్బలు తిన్నప్పుడు ఎంత పర్సెంటేజీ రావాలో చెప్పలేదేంటీ సర్…
జైల్ భరోలో పాల్గొని కోర్టులు చుట్టూ తిరుగుతున్నప్పుడు నీకున్న అర్హత ఏంటీ అని అడగలేదేంటీ సర్…
ఉద్యమంలో మేం తిన్న లాఠీ దెబ్బలకు ఒక్కో మార్కుకు వేసుకున్న మా మార్కులు 98 శాతం దాటుతాయి సర్.
మేం మీ సీఎం పదవిని అడగటం లేదు సర్…
కనీసం మమల్ని మా పరీక్ష అయినా రాయనివ్వమని వేడుకుంటున్నాం సర్.
బీఎడ్ చేసి… డీఎస్సీ కోసం వేచి చూసి..చూసి.. టెట్ కోసం కోచింగ్ లకు వేల రూపాయిలు ఖర్చు పెట్టి… ఇంటికి వెళ్లలేక… హైదరాబాద్ లో ఖర్చులు భరించలేక ఉద్యోగం కోసం అడిగితే ఉన్న గోచి కూడా ఊడగొట్టకండి సర్. కనీసం మా పరీక్ష అయినా మమ్మల్ని రాయనీయండి సర్.
మీరు వ్యవసాయం చేస్తే కోట్లు వస్తున్నాయి. కానీ, మా నాన్న సాగు చేస్తె అప్పులే మిగులుతున్నాయి. అందుకే ఆయన మమ్మల్ని సర్కారు బళ్లోనే చదివించారు. బ్లాక్ బోర్డులే సరిగా లేని చోట చదవుకున్న మాకు ఫస్టు క్లాస్ మార్కులంటే ఎట్లా వస్తాయి సర్.
పర్సెంటేజీ అంటే మీరు ప్రాజెక్టుల్లో మాట్లాడుకునే పర్సెంటీజే కాదు సర్. పరీక్షలు రాస్తే వచ్చేది… ఉద్యమాల్లో పాల్గొని పర్సెంటేజీలు, పస్టు క్లాసు మార్కులు పట్టించుకోలేదు సర్. తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయనుకున్నాం కానీ, ఉన్న సర్టిఫికేట్ లు కూడా పనికిరాకుండా పోతాయి అనుకోలేదు సర్.
పరాయోడి పాలనలో లేని షరతులు మన పాలనలో ఎందుకు సర్…
పరీక్షలన్నీ బహిష్కరించి ఉద్యమంలో పాల్గొన్నందుకా… ?
వద్దురా కొడుకా అన్నా వినకుండా తెలంగాణ నినాదాలు చేస్తూ లాఠీ దెబ్బలు తిన్నందుకా…? ‘
కారు’కే జై కొట్టి మిమ్నల్నే సీఎం సీటులో కూర్చొబెట్టినందుకా…?
జర సోచాయించండి సర్…
ఇట్లు
ఓ తెలంగాణ నిరుద్యోగి

(ప్రస్తుతం ఆన్ లైన్ లో ఇవి వైరల్ గా మారాయి. వీటిని చూసైనా ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి. )

To Top

Send this to a friend