14 ఏళ్లుగా సినీవినీలాకాశంలో వెలుగులు విరజిమ్ముతున్న సినీవారపత్రిక `సంతోషం`. ప్రతియేటా ఆగష్టులో `సంతోషం అవార్డ్స్` పేరిట టాలీవుడ్‌కి కొంగొత్త వెలుగులు తెస్తోంది. ఈ ఆగస్టు 2 నాటికి `సంతోషం` సినీవారపత్రిక 14 వసంతాలు పూర్తి చేసుకుని, దిగ్విజయంగా 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ శుభవేళ `సంతోషం` 14వ వార్షికోత్సవ సంబరాలు, `సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్` వేడుకలు 14 ఆగస్టు 2016 న గచ్చిబౌళి ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుంచి జరగనున్నాయి.
ఈ సందర్భంగా `సంతోషం` అధినేత, ఎడిటర్ & పబ్లిషర్ సురేష్ కొండేటి మాట్లాడుతూ -“సంతోషం .. 15వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభవేళ 14వ వార్షికోత్సవ వేడుకలు, `సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్` వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. తెలుగు సినీపరిశ్రమతో పాటు తమిళం, కన్నడం, మలయాళం కలుపుకుని దక్షిణాది నాలుగు పరిశ్రమల ప్రముఖులు.. ఒకేచోట కొలువుదీరనున్నారు. అన్ని భాషల్లో కోట్లాది ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అరుదైన ఈ వేడుక ఈ ఏడాది ఆగస్టు 14న గచ్చిబౌళి ఇండోర్ స్టేడియంలో కన్నుల పండువగా నిర్వహిస్తున్నాం. నాటి- నేటి మేటి నటీనటులు, టెక్నీషియన్లు .. ఇలా అందరూ ఈ వేడుకలకు విచ్చేస్తున్నారు. గత 13 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం సినిమా పరిశ్రమలోని ప్రతిభావంతులకు అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తున్న `సంతోషం` పుట్టినరోజు ఆగస్టు 2. ప్రతి పుట్టినరోజునూ ఇండస్ట్రీ పండగగా జరుపుతూ ప్రశంసలందుకుంటున్నాం. ఈసారి అంతకు మించి.. `సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్` 14వ వార్షికోవత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాం. మునుపటి కంటే కొత్తగా.. అవార్డుల హిస్టరీలో ఎన్నడూ చూడని స్కిట్లు, వెరైటీ డ్యాన్సులతో వేదికను సరికొత్తగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోట్లాదిగా ఉన్న వీక్షకుల్ని, అభిమానుల్ని రంజింపజేసేలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాం.తెలుగు సినీపరిశ్రమ సహా అన్ని భాషల నుంచి టాప్ సెలబ్రిటీస్ ఈ ఈవెంట్‌కి హాజరవుతున్నారు“ అని తెలిపారు.
