శివ నుండి వంగవీటి.. రిటైర్ మెంటే వర్మకు బెటర్?

ram-gopal-varma-movies

అప్పుడు ఆయన యువకుడు .. ఉత్సాహవంతుడు.. ఎవరెస్ట్ ను అయినా జయించే సామర్థ్యం అతడిసొంతం.. ఆ ఉత్సాహమే కొత్త దర్శకుడు అయినా హీరో నాగార్జునను మెప్పించి ‘శివ’ సినిమా తీయడానికి ఆస్కారం కల్పించింది. నాగార్జునతో సైకిల్ చైన్ తెప్పించి అప్పటివరకు మూస ధోరణితో నడిచిన తెలుగు సినిమాకు కొత్త మార్గం చూపించాడు రాంగోపాల్ వర్మ.. ఆ తర్వాత క్షణక్షణం.. లాంటి క్లాసిక్ మూవీలు తీసి హిట్ కొట్టాడు.. ఆ క్రియేటివిటీని పెంచుకుంటూ పోతే పెద్దగా నష్టం లేదు.. అదే మూసను కొనసాగించి వర్మ దెబ్బతిన్నాడు.. మధ్యలో దెయ్యాలతో సహవాసం చేశాడు. అనంతరం మాఫియాను ఆశ్రయించాడు. అనంతరం రక్తపాతం లేనిదే సినిమా తీయలేని స్థితికి చేరాడు. వర్మ క్రియేటివిటీ ఏమైంది అన్నది సగటు అభిమానిని వేధిస్తున్న ప్రశ్న..
శివ నుంచి వంగవీటి వరకు రాంగోపాల్ వర్మ పతనం వేగంగా కొనసాగింది.. రాజమౌళి లాంటి దర్శకులు ముందు మాములు హిట్ లు ఇచ్చి పరిశ్రమను, అభిమానుల మనసులను అవగతం చేసుకొని కొత్తగా, క్రియేటివిటీగా నడిచి విజయం సాధించారు. కానీ వర్మ విజయంతో మొదలై.. అపజయాలకు మారుపేరుగా మారిపోయారు. ఇప్పుడు వర్మ సినిమా అంటే అదో పాత చింతకాయ పచ్చడి.. నాలుగు కత్తులు, మూడు తుపాకులు.. పరిగెత్తి చంపుకోవడాలు.. స్క్రీన్ నిండా రక్తం తప్పితే కొత్తదనం లేకుండా పోయింది.. మధ్యలో తీసిన పొగ, ఐస్ క్రీం లాంటి తదితర చిత్రాలు చూసిన వారైతే వర్మను తిట్టకుండా థియేటర్ నుంచి బయటకు రాలేదు.. బాలీవుడ్ కు వెళ్లి అమితాబ్ లాంటి వారితో అక్కడి నాయకుల కథలు తెరకెక్కించినా ఫలితం ఇవ్వలేదు. ఫ్లాప్స్ వెక్కిరించాయి. ఇక తెలుగునాటకు వచ్చి రక్తచరిత్ర, వీరప్పన్ లాంటి సినిమాలు తీశాడు. ఆ వ్యక్తుల చరిత్రను తెలుసుకునేందుకు అభిమానులు చూసారే కానీ సినిమా బాగుందని.. వర్మ అద్భుతంగా తీశాడని చూడలేదు.. కాంట్రవర్సీని నమ్ముకొని రౌడీయిజం, ఫ్యాక్షనిజం, టెర్రరిజం నిజగాథలతో తీస్తున్న సినిమాలపై క్యూరియాసిటీ ఉంటుందంతే.. అది వర్మ సినిమాలు కాదు.. నిజజీవిత గాథలు.. అదే సొంత స్టోరీతో సినిమా తీస్తే అది వర్మ సినిమా.. ఇప్పుడు అలాంటివి వచ్చే పరిస్థితి లేదు.. వర్మకు తీసే ఓపిక లేదు.. అందుకే ఇలాంటి మూస సినిమాలు తీయకుండా ఇక రిటైర్ మెంట్ తీసుకొని ప్రేక్షకులను బతకనిస్తే అందరికీ మంచిది..

To Top

Send this to a friend