శివరాత్రికి అక్కడ శివుడి దర్శనం ఖాయం

బయల్పడిన సంగమేశ్వర గర్భాలయం
సప్తనదీ సంగమక్షేత్రం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధం కానుంది. నాలుగు రోజులుగా శ్రీశైలం జలాశయంలో నీటినిల్వలు తగ్గిపోతుండటంతో సంగమేశ్వరాలయం పూర్తి గా బయల్పడింది. ఈ నెల 14 నాటికి శ్రీశైల జలాశయంలో 845 అడుగుల నీటిమట్టంతో 69 టీఎంసీల వరకు నీటినిల్వలు ఉండేవి. 18వ తేది నాటికి 839 అడుగులకు తగ్గాయి. ప్రస్తుతం 60 టీఎంసీల నీరుంది. క్షేత్రం చుట్టూ నదీజలాలు ఉన్నప్పటికీ నీటిలో నడిచి వెళ్లే వీలు ఏర్పడింది. కొంత ప్రమాదకరమైనప్పటికీ ఈ నెల 24న మహాశివరాత్రి నాటికి నీరు మరింత తగ్గే అవకాశం ఉంది. దీంతో మహాశివరాత్రి పర్వదినానికి సంగమేశ్వరానికి భక్తులు తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. ఆలయ ఇన్‌చార్జ్‌ కార్యనిర్వహణాధికారి నాగప్రసాద్‌ ముందు జాగ్రత్తలు చేపడుతున్నారు.

గత ఏడాది కృష్ణాపుష్కరాలకు మునుపు ఆగష్టు 8న సంగమేశ్వరాలయం పూర్తిగా నీట మునిగింది. సుమారు 192 రోజుల పాటు సప్తనదీ జలాల్లో నిత్యఇషేకం చేయించుకున్న సంగమేశ్వరుడు ఇప్పుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. మహాశివరాత్రి పర్వదినాన క్షేత్ర పరిధిలో వేపదారు శివలింగానికి పూజలు, అభిషేకాలు, అర్చనలు, హోమాలను నిర్వహిచేందుకు దేవాదాయశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సంగమేశ్వరం పుష్కర ఘాట్‌ పూర్తిగా బయటపడింది.

To Top

Send this to a friend