విలువలు-అనుబంధం, నాన్నకు ప్రేమతో!

రిటైర్మెంటు రోజు ఆఫీసులో భారీగా ఏర్పాట్లు చేశారు. పెద్ద అధికారులు, యూనియన్ నాయకులు సత్కారసభకి వచ్చి సుందరయ్య సేవలను కొనియాడారు. చివర్లో
సుందరయ్యపిల్లలు మాట్లాడుతూ సుందరయ్య సంతానంగా తాము జన్మించటం తమ అదృష్టం అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.తన పిల్లలు ఇంత బాగా మాట్లాడుతారా అని సుందరయ్యే ఆశ్చర్యపోయాడు. తనకి జరిగిన సత్కారానికి కృతఙ్ఞతలు తెలుపుతూ సుందరయ్య “తనకి ఇంత భారీగా సత్కార సభ జరగటం వ్యక్తిగతంగా ఇష్టం లేకపొయినా సరే, పది మందికోసం ఒప్పుకోక తప్పలే దంటు” తన అనుభావాలను ముచ్చటించి కష్టపడి పనిచేసి సంస్ధ అభివృద్ధికి పాటుపడాలనీ, సంస్థ బాగుంటేనే మనం బాగుంటామని హితవు పలికాడు. చివర్లో తనకి రావలసిన పి.ఎఫ్., గ్రాట్యుయిటి, వగైరా అన్నింటికీ సంబంధించిన చెక్కులు సుందరయ్య చేతికి అందించారు. సభ ముగిసిన తర్వాత అక్కడే విందు ఏర్పాటు జరిగింది. కార్యక్రమాలైన తర్వాత కార్లో ఇంటికి సాగనంపారు. రాత్రి ఇంటికి చేరిన తర్వాత పిల్లలు ఆఫీసులో జరిగిన సన్మానం గురించి మాట్లాడుకుంటుండగానే సుందరయ్యకి వెంటనే నిద్ర పట్టేసింది.

మర్నాడు బ్యాంకుకి వెళ్ళి తన అకౌంట్లు అన్నీ సెటిల్ చేసుకున్నాడు. మిగిలిన డబ్బుని అకౌంటులో వేసుకుని, పిల్లల విషయం తేలిన తర్వాత ఏంచెయ్యాలో అప్పుడు అలోచించొచ్చని ఇంటికి తిరిగొచ్చాడు. అలాగే, తానే పిల్లల్ని పిలిచి ఉన్న విషయాన్ని చెప్పి ఓ నిర్ణయానికి రావటం మంచిదని భావించాడు*.
*అటు సుందరయ్య కొడుకూ, కూతురు కూడా తండ్రితో విషయం ఎలా చెప్పాలా? అని ఆలోచిస్తున్నారు. అందరి పిల్లల్లాగే వాళ్ళకీ తండ్రి దగ్గర భయం ఎక్కువే.
ఒకొక్కసారి తండ్రి తీసుకునే నిర్ణయాలను మార్చడం కష్టం. కొన్ని సందర్భాల్లో ఆయన గీసుకున్న గిరిని దాటి వచ్చేవారుకాదు. ఆ విషయంలో మాట్లాడటానికి కూడా అవకాశం ఇచ్చేవారుకాదు. తండ్రి సిద్ధాంతలు చాలా ఉన్నతమైనవే.. కాని ఈ రోజుల్లో వాటిని నిత్యజీవితంలో పాటించడం కష్టం. అందుకే పట్టువిడుపులు ఉండాలి. రోజులతోపాటూ మనం కూడా మారాలి. అంతేకానీ సమాజాన్ని మార్చటం మన తరంకాదు.. అని తండ్రికి చెప్పే ధైర్యం వాళ్ళకి లేదు. అలా అని అయన అభిప్రాయాలు మంచివి కావని కూడా అనలేరు. ఎవరు ఏమడుగుతారనే టెన్షన్ తోనే ఆ రోజు పూర్తిగా గడిచిపోయింది.

“వాళ్ళు ఏమైనా నీతో అన్నారా?” అంటూ రాత్రి పడుకోబోయేముందు సుందరయ్య భార్యని అడిగాడు. అబ్బే.. నన్నేం అడగలేదు. ఆడిగినా నేనేం మాట్లడతాను? ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఆ మర్నాడు సాయంత్రం పిల్లలు వెళ్ళిపోతారు. ఈలోగా ఏదో ఒకటి తానే చెయ్యాలి. సుందరయ్య ఏదో ఆలోచన స్ఫురించటంతో నిద్ర పట్టేసింది. ఉదయమే ఇంట్లో అందరిని పిలిచాడు సుందరయ్య. “నేను, అమ్మ ప్రస్తుతానికి ఇక్కడే ఉంటాం. పుట్టి పెరిగిన ఊరు వదలి రావాటం కుదరదు. నాకు పెన్షన్ వస్తుంది. అది మాకు సరిపోతుంది. నా రిటైర్మెంటు డబ్బులతో అప్పులు తీర్చగా మిగిలినవి మొత్తం ఇవి! మాకు ఏమైనా అవంతరాలు వస్తే అవసరార్థం కొంచెం డబ్బులు మాకు వుంచి మిగతావి మీరిద్దరు తీసుకోండి. ఇదిగో బ్లాంక్ చెక్కులు. నేనివ్వగలిగింది ఇదే! అంటూ సుందరయ్య ఓ కాగితం మీద లెక్కలు రాసి, చెక్కులు వాళ్ళ చేతిలో పెట్టాడు. వసంతమ్మకి భర్త అలోచన నచ్చింది. నిజమే..అంత్య నిష్టూరం కంటే ఆదినిష్టూరం మంచిది. అయితే ఆయన మాటలు మిగాతావాళ్ళకి ఆశ్చర్యం కలిగించలేదు. అయన ఏ విషయమైన, అంతా సూటిగానే చెప్పేస్తారు. వద్దు నాన్నా. మేం వచ్చింది మీ రిటైర్మెంటు సమయంలో మీతో నాలుగు రోజులు గడపడానికి వచ్చామే గానీ ఆస్తులు పంచుకోడానికి కాదు!! మాకు ఆర్ధిక సమస్యలు గానీ, అవసరాలు గానీ లేవు. నిజంగా మాకు అవసరమైతే మీ దగ్గర తీసుకోడానికి మాకు మొహమాటం ఎందుకుంటుంది నాన్న గారూ! ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండండి” అంటూ అబ్బాయి చెక్కుల్ని తిరిగి తండ్రి చేతితో పెట్టేశాడు. అంతే! ఒక్క నిమిషంలో వాతవరణం చల్లబడిపోయింది. అందరి ఉహాలు ఓరకంగా ఊహలుగానే ఉండిపోయాయి. అన్నట్లు.. నాన్నగారు మనందరం కలిసి ఓసారి మన కోనేరుగట్టుకి వెళ్ళొద్దాం. మన పాతిల్లు, ఆ వీధి చూసి చాలా కాలమయింది” అన్న కొడుకు మాటలు వినేసరికి సుందరయ్యకి ఆనందం వేసింది. నిజమేరా! మేం కుడా ఆ గట్టుకి వెళ్లి చాలా కాలమయింది ” అంటూ అందరు బయలుదేరారు. అబ్బా! మన వీధి చాలా మారిపోయింది. అవున్రా. ఈ వీధిలో అందరి ఇళ్ళు అపార్టుమెంట్సుకి ఇచ్చేసారు. ఒక్క మనం అద్దెకున్న వాళ్ళ ఆ ఇల్లే అలాఉంది. ఈ మధ్య ఆ ఇంటివాళ్ళు అమ్మేస్తే, ఎవరో కొనుక్కొని రీమోడల్ చేయించారట. మొక్కలు, చెట్లు పాడవకుండా అలాగే వున్నాయి! ఎవరో మంచి వాళ్ళలా ఉన్నారు! ఇంటి స్వరూపాన్ని పాడుచేయకుండా, బాగుచేయించారు. బావుంది!” అలా కబుర్లు చెప్పుకుంటూ కోనేరు నాలుగు గట్లూ తిరిగి, ఇంటికొచ్చేసారు. ఆ రోజు సాయంత్రమే పిల్లల ప్రయాణాలు. ఏవిటో! వారం రోజులు ఏడు క్షణాల్లా గడిచిపోయాయి!’ అనుకుంటూ వాళ్ళతోపాటు రైల్వే స్టేషన్ కు వెళ్లి, వీడ్కోలు చెప్పి ఇంటికొచ్చేశారు సుందరయ్య, వసంతమ్మ. ఇంటికొస్తూనే టేబులుమీద కవరు చూసి సుందరయ్య అశ్చర్యపోయాడు.

నాన్నగారికి అన్న అక్షరాలు చూసి ఆత్రుతగా కవరు చింపి చదవసాగారు.
నాన్నగారికి,
మీ దగ్గర మాట్లాడే ధైర్యం లేక ఈ ఉత్తరం రాస్తున్నా౦. మరోలా భావించకండి. మీరు పడ్డ కష్టాలు మేం పడకూడదని, మమ్మల్ని చాలా అపురూపంగా పెంచారు!
దానికితోడు మారిన రోజులతోపాటు మేం కూడా మారిపోయాం. యాంత్రికయుగంలో ఎన్నో సదుపాయాలను ఏర్పాటు చేసుకుని జీవితాన్ని చాలా సుఖమయం చేసుకున్నాం. కాలంతోపాటు పరుగులు తీస్తున్నాం! కానీ మేం చాలా కోల్పోయాం నాన్నగారూ! బాల్యం మాకు తెలియదు. యవ్వనంలో మాకు మంచి అనుభూతులు లేవు. అనుబంధాలు, ఆత్మీయతలు అంటే మాకర్ధం తెలియదు. మేం పరిగెత్తుకుంటూ పాలు తాగుతున్నాం, కానీ నీళ్ల రుచి తెలియదు! మీ తరం వాళ్ళు గుర్రంస్వారీ చేసేవారు. మేం పులిస్వారీ చేస్తున్నాం. మీరు జీవితాన్ని కాచివడపోసారు. మేం జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. మీరు పెద్దల మాటలు వినేవారు. మేం కంప్యూటర్ చెప్పినట్లు నడుచుకుంటున్నాం! అమ్మ ఎప్పుడూ అంటుందే.. అలా మేం గోరీలు కట్టుకుని జీవిస్తున్నాం* నాన్నగారూ!!
ఒక్క విషయం చెప్పగలంనాన్నగారు! మీ పెంపకంలో లోపం లేదు. మేం పెరిగిన వాతవరణంలో లోపం ఉంది! మా దగ్గర సముద్రమంత మేధస్సు ఉంది. కానీ ఆ
మేధస్సుతో గుక్కెడు నీళ్ళు కూడా తాగలేం! మీ మేధస్సు కోనేరంతే .. అయితే నేం .. అదంతా మంచినీరు!!. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని ఈ
రొంపిలోకి లాగదలచుకోలేదు! మీరు ఎప్పుడూ స్వప్నాలలో జీవించలేదు.వాస్తవాలతో జీవనం సాగించారు! మీకు మనుషులతోనేకాదు, మీ పుట్టి పెరిగిన నేలతో కూడా బంధాలున్నాయి. చెట్లూ, పశువులూ,పక్షులూ అన్నిటితో మీకు అనుబంధాలున్నాయి! వీటితోపాటు చివరికి మనం పాతికేళ్ళు అద్దెకున్న ఇంటిమీద కూడా మీకు మమకారం ఉంది!! వీటిని వదులుకోలేక, ఉద్యోగంలో ప్రమోషన్లు తీసుకోకుండా ఉన్నదాంట్లో చాలా సంతృప్తిగా జీవిస్తున్నారు! అందుకే మమ్మల్ని మీవాస్తవ జీవితాల్నుంచి దూరం చేయటం ఇష్టంలేక, మీ అనుబంధాలను త్రుంచటం ఇష్టం లేక, మీకు తెలియకుండా ఓపని చేశాం! అక్కా, నేను కలసి మన కోనేరు గట్టులో మన గతంలో ఉన్న ఇంటిని మీ గురించి కొన్నాం. ఈ ఉత్తరంతో పాటున్న తాళంచెవి ఆఇంటిదే! మీరు ఆఇంటిలోకి మారి, స్వేచ్ఛగా, హాయిగా ఉండాలనేదే మాకోరిక!

అన్నట్లు, ఇంకో అభ్యర్ధన కూడా ఉంది నాన్నా! త్వరలో మాకు పుట్టే పిల్లల్ని మమ్మల్ని పెంచినట్లు కాకుండా, మీరు పెరిగినట్లు పెంచి, పెద్దచేసే బాధ్యతని మీకే అప్పగిస్తున్నాం. మన గట్టు మీద పెంచండి. అంటే మాకు తీరిక లేక, పెంచలేక కానేకాదు! మా స్వార్థం అంతకంటే కాదు! వాళ్ళు మేం పెరిగినట్లు పెరగకూడదు. మీరు పెరిగినట్లు పెరగాలనే మా ఆశ! వాళ్ళు యంత్రాలు కాకూడదు, వాళ్ళు మనుషులలాగానే ఎదగాలి! ఓ విషయం చెప్పనా నాన్నా? మీలాంటి వాళ్ళ చేతులలో పిల్లలు పెరగడం, భవిష్యత్తులో మనిషి మనుగడకి చాలా అవసరం నాన్నా! కాదనరుగా!
ఇట్లు
మీ అమ్మాయి, అబ్బాయి.

ఉత్తరం చదివిన సుందరయ్య కళ్ళు కోనేరుతో నిండిపోయింది! ఆ కళ్ళతోనే వసంతమ్మ కళ్ళల్లో వసంతాన్ని చూశాడు. వంటింట్లో కాకులు, పెరట్లో కోయిలలు
హడావిడిగా కనిపించేయి. *అయ్యకోనేరు మాత్రం ఆనందబాష్పాలు రాల్చింది!

కొత్త కొత్త సానుకూల ఆలోచనలని రేకెత్తించే ఇలాంటి కథలే ఇప్పుడు మనుషులని నిజమైన మనుషులుగా మార్చటానికి పనికొస్తాయి!

To Top

Send this to a friend