విలన్‌గా యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌!

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.9గా నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ విలన్‌గా నటిస్తున్న నేపథ్యంలో జనవరి 16న హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను తెలిపేందుకు విలేరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాతలు గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర పాల్గొన్నారు.
అనీల్‌ సుంకర మాట్లాడుతూ – ”మా బేనర్‌లో ప్రొడక్షన్‌ నెం.9గా నితిన్‌ హీరోగా నిర్మిస్తున్న చిత్రంలో అర్జున్‌గారు ఒక స్పెషల్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. అందుకోసమే ఈ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశాం. హను ఈ స్టోరీ చెప్పగానే ఈ క్యారెక్టర్‌ ఎవరు చేస్తే బాగుంటుంది అనే విషయంలో మూడు నెలలు డిస్కస్‌ చేశాం. అయితే ఈ క్యారెక్టర్‌ అర్జున్‌గారు చేస్తే బాగుంటుంది అనుకున్నాం. మరి ఈ క్యారెక్టర్‌ ఆయన చేస్తారా లేదా అనే డౌట్‌ వచ్చింది. అయితే అర్జున్‌గారు స్టోరీ వినగానే వెంటనే ఓకే చెప్పారు. ఇందులో అర్జున్‌గారి క్యారెక్టర్‌ చాలా స్టైలిష్‌గా వుంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్‌ ఆయనకు కొత్త కాదు. అయితే ఇది ఆయన కెరీర్‌లో మరో మంచి క్యారెక్టర్‌ అవుతుంది” అన్నారు.
దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ – ”నాలుగు నెలల క్రితం ఈ కథ డిస్కషన్‌ స్టేజ్‌లో వున్నప్పుడు ఇందులోని స్పెషల్‌ క్యారెక్టర్‌ ఎవరు చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఫస్ట్‌ స్ట్రైక్‌ అయింది అర్జున్‌గారు. దానికి ఓ కారణం వుంది. నేను చిన్నతనం నుంచి యాక్షన్‌ మూవీస్‌ బాగా చూసేవాడిని. తెలుగులో రిలీజ్‌ అయిన అర్జున్‌గారి సినిమాలన్నీ నేను చూశాను. ఆ సినిమాలన్నీ స్టోరీతో సహా ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఈ సినిమాలో అర్జున్‌గారు విలన్‌గా చేస్తున్నారు. ఆయనది చాలా స్పెషల్‌ క్యారెక్టర్‌. ఆయనతోనే స్టార్ట్‌ అయ్యే కథ. ఇది ఒక టెర్రిఫిక్‌ రోల్‌. అర్జున్‌గారు తప్ప ఈ క్యారెక్టర్‌ని ఎవరూ చెయ్యలేరు అనిపించేలా వుంటుంది. ఈ క్యారెక్టర్‌ గురించి అర్జున్‌గారికి ఎలా చెప్పాలి అని చాలా స్ట్రగుల్‌ అయ్యాం. ఒక ఫైన్‌ డే ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడాను. జనవరి 4న కలిసి క్యారెక్టర్‌ గురించి చెప్పాను. ఆయన ఈ క్యారెక్టర్‌ చేస్తానని చెప్పగానే సచిన్‌ టెండూల్కర్‌ వరల్డ్‌ కప్‌ గెలిచినపుడు ఎంత ఆనందపడ్డాడో నేనూ అంత హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. ఆరోజు నాకు చాలా స్పెషల్‌. ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నందుకు అర్జున్‌గారికి థాంక్స్‌ చెప్తున్నాను” అన్నారు.
యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ మాట్లాడుతూ – ”ఈ స్టోరీ గురించి, ఇందులో నా క్యారెక్టర్‌ గురించి చెప్పడానికి చాలా కష్టపడ్డానని డైరెక్టర్‌ చెప్పారు. అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే మేం యాక్టర్స్‌. పెర్‌ఫార్మెన్స్‌కి స్కోప్‌ వున్న రోల్‌ దొరికినపుడు డెఫినెట్‌గా ఎక్సైట్‌ అవుతాం. హను చెప్పిన స్టోరీలో నా క్యారెక్టర్‌ చాలా నైస్‌గా వుంటుంది. నేను చాలా ఎక్సైట్‌ అయ్యాను. నటుడిగా స్టార్ట్‌ అయి 30 సంవత్సరాలు దాటిపోయింది. ప్రతి సినిమా ఒక లెర్నింగ్‌ ప్రాసెస్‌లా వుంటుంది. నా కెరీర్‌లో మంచి మంచి క్యారెక్టర్స్‌ నాకు వచ్చాయి. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రెండు నెలల్లో తెలుగు, తమిళ్‌, కన్నడకి సంబంధించి 25 కథలు విని వుంటాను. కానీ, దేనికీ ఎక్సైట్‌ అవ్వలేదు. ఈ కథ విన్నప్పుడు మాత్రం నిజంగా ఎక్సైట్‌ అయ్యాను. ఈ క్యారెక్టర్‌ గురించి చెప్పాలంటే ది హైట్‌ అఫ్‌ సొఫెస్టికేషన్‌, ది హైట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌… ఇవన్నీ వున్నాయి” అన్నారు.
నిర్మాత గోపీచంద్‌ ఆచంట మాట్లాడుతూ – ”ఈ సినిమా షూటింగ్‌ జనవరి 6న స్టార్ట్‌ చేశాం. రేపటి నుంచి కంటిన్యూస్‌గా షెడ్యూల్‌ వుంది. జనవరి, ఫిబ్రవరిలో ఇక్కడ జరుగుతుంది. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో 60 రోజులపాటు అమెరికాలో షెడ్యూల్‌ వుంటుంది. దాంతో షూటింగ్‌ కంప్లీట్‌ అవుతుంది. ఈ సినిమాలో అర్జున్‌గారు చేస్తే బాగుంటుందని మేం ఎలా ఎక్సైట్‌ అయ్యామో, కథ విని ఆయన కూడా అంతే ఎక్సైట్‌ అయ్యారు. ఈ క్యారెక్టర్‌ చేస్తున్నందుకు ఆనందంగా వుంది. ఈ సినిమాలో అర్జున్‌గారు విలన్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. ఈ క్యారెక్టర్‌ చెయ్యడానికి అర్జున్‌గారు ఒప్పుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు” అన్నారు.
యూత్‌స్టార్‌ నితిన్‌, మేఘా ఆకాష్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: మణిశర్మ, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయినపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

To Top

Send this to a friend