వాట్సాప్ అడ్మిన్ లు బాధ్యులు కారు..

వాట్సాప్‌లో ఇతరులు పోస్ట్ చేసే కంటెంట్‌కు వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లు బాధ్యులు కాదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లకు ఆ మాధ్యమాల అడ్మినిస్ట్రేటర్లను బాధ్యులను చేసేందుకు దేశవ్యాప్తంగా సంవత్సరం నుంచి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. అభ్యంతరకరమైన పోస్టులు ఆన్‌లైన్‌లో ప్రచురితం కావడంతో గతంలో కొందరు అడ్మినిస్ట్రేటర్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

అశిష్ భల్లా వర్సెస్ సురేశ్ చౌదరి కేసులో వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులు పెట్టిన స్టేట్‌మెంట్లు పరువు నష్టం కలిగిస్తున్నాయని అశిష్ భల్లా ఆరోపించారు. దీనికి వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్‌ను బాధ్యుడిగా చేయాలని, తనకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లా పరువు నష్టం దావాను తోసిపుచ్చారు. అడ్మినిస్ట్రేటర్ అనుమతి లేకుండా సభ్యులు ఈ గ్రూప్‌లో పోస్టులు చేయరాదనే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఇటువంటి కంటెంట్‌కు అడ్మినిస్ట్రేటర్‌ను బాధ్యుడిగా చేయడమంటే పరువు నష్టం కలిగించే స్టేట్‌మెంట్‌ ప్రచురితమైన న్యూస్‌ప్రింట్ తయారీదారును పరువు నష్టానికి బాధ్యుడిని చేయడంతో సమానమని తెలిపింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారంను ఏర్పాటు చేసినపుడు, దానిలోని సభ్యులు పరువు నష్టం కలిగించే స్టేట్‌మెంట్లను పోస్ట్ చేస్తారని ఆ ప్లాట్‌ఫారాన్ని ఏర్పాటు చేసినవారు ఊహించరని పేర్కొంది. అందువల్ల అడ్మినిస్ట్రేటర్లను బాద్యులుగా చేయలేమని పేర్కొంది. సభ్యులు పోస్ట్ చేసే ప్రతి స్టేట్‌మెంట్‌కు అడ్మినిస్ట్రేటర్ అనుమతి ఉండాలని, అటువంటి అనుమతి లేనపుడు పోస్ట్ చేయడానికి వీలు ఉండదనే పరిస్థితులు లేవని ఇచ్చిన తాత్కాలిక ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాకుండా, వివాదంలో ఉన్న పోస్ట్ పరువు నష్టం కలిగించేది కాదని, వాదిని (ప్లెయింటిఫ్‌ను) అభినందిస్తున్నట్లుగానే ఉందని తెలిపింది..

To Top

Send this to a friend