రైతు సంకెళ్లు.. కేసీఆర్ సమాధానం..

ఖమ్మంలో మిర్చియార్డుపై దాడి చేసిన రైతులకు సంకెళ్లు వేసి కోర్టులో హాజరుపర్చిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. ప్రతిపక్షాలు, జేఏసీ నాయకులు, ప్రజలు.. కేసీఆర్ సర్కారును తిట్టిన తిట్టు తిట్టకుండా కడిగేశారు.. రచ్చ రచ్చ చేశారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్ ఈ రైతు సంకెళ్లపై సమాధానమిచ్చారు.

హైదరాబాద్ లో కవులు, రచయితలు, వివిధ సంఘాల నేతలతో సమాలోచనలు జరిపారు. రైతులు ఇలా కష్టాలు పాలు కావడానికి అసలు కారణం వారికి మద్దతు ధర లేకపోవడమేనన్నారు. దళారులు కుమ్మక్కై రైతు కష్టాన్ని చీప్ గా దక్కించుకుంటున్నారని.. కడుపు మండిన రైతులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ వాపోయారు. అందుకే ఇక నుంచి మద్దతు ధర విషయంలో రైతు సంఘాలను ఏర్పాటు చేసి వారు నిర్ణయించిన ధరకే వ్యాపారులు, ప్రభుత్వం కొనేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అంతేకాదు ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లడం తనను కలిచివేసిందన్నారు. తాను రైతు బిడ్డనేనని.. సీఎంగా కాదు రైతు బిడ్డగా చెప్తున్న బేడీలు వేసినవాడు మొగోడే కాదు అని స్పష్టం చేశారు. రైతులకు బేడీలు వేయమని సీఎం, డీజీపీ , సీఎస్ లు ఆదేశించరని.. అక్కడి లోకల్ పోలీసులు చేసిన తలతిక్క పనికి ప్రభుత్వం అభాసుపాలైందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే బేడీలు వేసిన పోలీసులను సస్పెండ్ చేశామని తెలిపారు. ప్రతిపక్షాలకు రాష్ట్రంలో సమస్యలు లేక దీనిపై నానాయాగీ చేస్తున్నాయని మండిపడ్డారు.

To Top

Send this to a friend