రెడ్డి కులం అని నన్ను ఓడగొట్టించాడు — రోజా

‘మహిళలకు ఏపీలో గౌరవం లేదు.. రక్షణ లేదు.. మహిళా సాధికారిత గురించి ఇంత గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు.. మహిళా ఎమ్మెల్యేనైన తనపై ఇంతక్షక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ అణిచివేస్తున్నారని’ వైసీపీ ఎమ్మెల్యే రోజా కన్నీటిపర్యంతం అయ్యారు. అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు ఆహ్వానించి మరీ పోలీసులతో అరెస్ట్ చేయించారని ఆరోపించారు. పోలీసులతో వాగ్వాదంలో కిందపడ్డా.. గాయాలైనా కనికరించకుండా గన్నవరం నుంచి తరలించారని.. చంద్రబాబు తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని రోజా మండిపడ్డారు.
ఎమ్మెల్యే రోజా హైదరాబాద్ లో ఏపీ సీఎం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకదశలో కన్నీటి పర్యంతం అవుతూ శపనార్థాలు పెట్టారు. నన్ను అవమానించిన ఏపీ సీఎంకు తగిన శాస్తి జరుగుతుందని.. ఈ పాపం ఊరికే పోదన్నారు. ఏపీలో మహిళలపై ఆకృత్యాలు జరుగుతున్నా టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్, గవర్నర్ కిరణ్ బేడి తదితర ఫేమస్ మహిళామణులు చంద్రబాబును కీర్తించడం కంటే దారుణం మరోటి లేదన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తాను టీడీపీలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు విమర్శించినా నన్ను టీడీపీ నాయకురాలిగా చూశాడు తప్పితే ఇలా చంద్రబాబులా కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. ‘వైఎస్ నిజంగా మగాడు’ అని రోజా కన్నీరు కారుస్తూ చెప్పారు. చంద్రబాబు మాత్రం ప్రత్యర్థి పార్టీలో ఉన్నందుకు తనను శత్రువులా చూస్తూ నాశనం చేయాలని చూస్తున్నాడన్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడు తన కొడుకు చనిపోయే పరిస్థితి ఉన్నా.. పార్టీ కోసం ఇల్లూ వాకిలి వదిలి కష్టపడ్డానని… టీడీపీ అధినేత చంద్రబాబు తనకు రూపాయి సాయం లేదని.. గెలవడానికి తోడ్పడలేదన్నారు. పైగా రెడ్డి కులం అని ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు ప్రత్యర్థులకే సహకరించాడని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
మొత్తంగా రోజా చంద్రబాబు, ఏపీ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు. హైదరాబాద్ లో విలేకరులతో ఏడుస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. చంద్రబాబు సర్కారు మహిళా ఎమ్మెల్యే పట్ల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
రోజా ఆవేదన… ప్రసంగం వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend