రాజకీయం.. రౌడీయిజం వేరు ‘శశి’

రాజకీయాల్లో చాలా ఓపిక అవసరం.. ఓపిక ఉన్న నాయకులే అత్యున్నత పదవిని అధిరోహిస్తారు. అది అనాదిగా మన రాజకీయాల్లో రుజువవుతోంది.. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా కావడానికి.. తదనంతరం సీఎంగా ఎదగడానికి కాంగ్రెస్ మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా కష్టపడ్డారు. దాదాపు 20ఏళ్లపాటు ఆయన కాంగ్రెస్ నే నమ్ముకొని కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు ఎదిగారు. అందుకే వరుసగా రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఎన్నికయ్యారు. సత్తాచూపించారు. కానీ తండ్రిచూపిన బాటలో నడవని ఆయన కొడుకు వైఎస్ జగన్ ఓపిక లేక చేజేతుతలా అధికారాన్ని వదులుకొని కష్టాలుపడ్డారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ అధిష్టానం రోశయ్యను సీఎంను చేసింది. అప్పుడే కొంచెం ఓపిక పట్టి ఉంటే జగన్ సీఎం అయ్యేవాడే.. కానీ తిరుగుబావుటా ఎగురవేసి వైసీపీ పార్టీ పెట్టి ఇప్పుడు కష్టపడుతున్నారు. అందుకే రాజకీయాల్లో ఓపిక అవసరమని వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్ ను చూస్తే మనకు అర్థం అవుతుంది..
తమిళనాట కూడా రాజకీయం రంగు మారింది. హింసాత్మకంగా మారుతోంది.. తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతున్నప్పటికీ గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పిలవకపోవడం శశికళ మండిపడుతున్నారు. ఇక తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అవున్నారు. గవర్నర్ విద్యాసాగర్ రావు చేస్తున్న జాప్యంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ-గవర్నర్ కలిసి శశికళను సీఎం కాకుండా అడ్డుకున్నారని గ్రహించిన ఆమె ఇప్పుడు స్వరం పెంచి పోరుబాటకు సై అంది. గవర్నర్ ఇంటి ఎదుట ఎమ్మెల్యేలతో ర్యాలీ తీస్తానని.. మరోకోణం (ఆందోళనలకు) చూపిస్తానంటూ హెచ్చరించింది. క్యాంపునకు తరలించిన ఎమ్మెల్యేలతో భేటి అయిన శశికళ ఈ మేరకు గవర్నర్ పై యుద్ధం ప్రకటించారు. రాష్ట్రంలో అల్లర్లకు ప్లాన్ చేశారని నిఘా వర్గాలు కూడా హెచ్చరించడంతో కేంద్రం అలెర్ట్ అయ్యి గవర్నర్, చైన్నై , రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది..
శశికళ ఆదినుంచి అధికారం చేపట్టడమే ధ్యేయంగా దుందుడుకుగా ముందుకు వెళుతోంది. అదే ఆమె కొంప ముంచుతుంది. తీరిగ్గా శాసనసభ్యులతో మీటింగ్ జరిపి వారందరి సమక్షంలో చాలా కూల్ గా గద్దెనెక్కాల్సి ఉండగా.. వ్యూహంలో లోపాలు.. తొందరపాటు.. ప్రత్యర్థులను సరిగ్గా అంచనావేయడంలో పొరపాటు చేసి చేజేతులా ఈ పరిస్థితిని తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా గవర్నర్ జాప్యం చేస్తే ఆయనపై పోరుబాటకు సై అన్నారు. అంతిమంగా రాజకీయాల్లో ఇలాంటి ఆవేశపూరిత నిర్ణయాలు ఆమెకే చేటు తెస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

To Top

Send this to a friend