మోహన్ బాబు కలను బాబు తీరుస్తాడా…?

విలక్షణ నటుడు మోహన్ బాబుకు ఎప్పటినుంచో ఉన్న కోరిక అస్సలు తీరడం లేదు.. ఇటు సినిమాల్లో కథానాయకుడిగా ఉంటూనే.. అటు రాజకీయాల్లో ప్రజాప్రతినిధిగా ఉండాలన్న ఆయన ఆశయం నెరవేరట్లేదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు ఆయన బంధువుల ఇంట్లోంచి అమ్మాయిని తీసుకొచ్చి కొడుకు మంచు మనోజ్ కు ఇచ్చి వివాహం జరిపించారు మోహన్ బాబు.. అలా వైఎస్ కు, మోహన్ బాబుకు మధ్య సన్నిహిత్యం పెరిగింది. అప్పట్లోనే మోహన్ బాబు రాజకీయ అరంగేట్రం చేసి ఎంపీగా ఎన్నికవుతారని ఊహాగానాలు వెలువడ్డాయి.కానీ వైఎస్ మరణంతో మోహన్ బాబు కల .. కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి వైఎస్ కొడుకు జగన్ వైదొలగడం.. ఆయన స్టామినాపై మోహన్ బాబుకు నమ్మకం లేకపోవడంతో రాజకీయ అరంగేట్రం అటే ఆగిపోయింది..

కానీ ఇప్పుడు ఎలాగైనా తన వాంఛను తీర్చుకోవాలని మోహన్ బాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.. తెలుగు దేశం పార్టీలోకి చేరి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎన్నికవ్వాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకే సంక్రాంతి పండుగ నాడు ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలనో సీఎం చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెకు తరలివచ్చి మోహన్ బాబు , ఏపీ సీఎంతో గంటపాటు రహస్య చర్చలు జరిపినట్టు తెలిసింది.. పార్టీలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి కీలకంగా మారుతానని బాబుతో చర్చలు జరిపారట..

ఎన్టీఆర్ హయాంలో ఆయనతో సన్నిహితంగా ఉంటూ టీడీపీతో కలిసి పనిచేసిన మోహన్ బాబు.. చంద్రబాబు పగ్గాలు చేపట్టాక పార్టీకి దూరంగా ఉన్నారు. బాబుతో విభేదాలు కొన్ని శక్తుల వల్ల తాను పార్టీని వీడానని అప్పట్లో ఆయన చెప్పారు. ఆ తర్వాత వైకాపాలో చేరుతారనే ప్రచారం జరిగినా ఆయన ఎటూ చేరలేదు.. చివరకు తాను విమర్శించిన బాబు పంచనే చేరి తన కలను నెరవేర్చుకునే పనిలో పడ్డారు.మరి బాబు కరుణిస్తాడా.. లేదా అన్నది తేలాల్సి ఉంది.

To Top

Send this to a friend