మూడు ముక్కలాట.. మాయ సీఎం అట..


కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని సమాజ్ వాదీ పార్టీ అధినేత, సీఎం అఖిలేష్ యాదవ్ బరిలోకి దిగారు.. ఢిల్లీ గద్దెనెక్కి దేశాన్ని ఏలుతున్న బీజేపీ అధికార బలంతో ఒంటిరిగా పోరులో నిలిచింది.. ఇక వీరందరిని కాలదన్ని.. 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా మొక్కవోని ధైర్యంతో ఒంటరిగా యూపీ ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగారు మాయవతి.. మొదటినుంచి మాయవతి పకడ్బందీగా ముందుకు వెళుతున్నారు. యూపీలో ఏమాత్రం ప్రభావం చూపని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే తనకే నష్టమని.. కాంగ్రెస్ అవసరం లేదని మాయవతి ఆ పార్టీని దూరంపెట్టి ఒంటరిగా బరిలోకి దిగారు. అయితే కాంగ్రెస్ తో జట్టు కట్టిన ఎస్పీ పొత్తు క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రయోజనం చేకూరలేదని విశ్లేషకుల భావన.. తండ్రి కొడుకుల లొల్లితో ఎస్పీపై విశ్వసనీయత ప్రజల్లో పోయిందని అంచనావేస్తున్నారు.

ముస్లింలు, దళితులు మాయవతి వెంటే..
యూపీలో మొత్తం 73 అసెంబ్లీ స్థానాల పరిధిలో 30శాతానికి పైగా , మరో 70 అసెంబ్లీలో 30శాతంలోపు ముస్లిం ఓటర్లున్నారు. అందుకే మాయవతి ఈ నియోజకవర్గాల్లో వ్యూహాత్మకంగా రికార్డు స్థాయిలో 97మంది ముస్లిం అభ్యర్థులను ప్రకటించింది. తర్వాత స్థానంలో 86మంది దళితులను రంగంలో నిలిపి ఆ సామాజికవర్గ ఓట్లను గంపగుత్తగా పడేట్టు చేసుకుంది. అంతేకాదు.. నోటిఫికేషన్ పడేందుకు ముందే ప్రార్థన స్థలాల్లో.. దళిత వాడల్లో ప్రచారం చేస్తూ వారి అభిమానాన్ని చూరగొంది. ఈ ముస్లింలు, దళితుల ఓట్లు బీజేపీకి పడే చాన్స్ లేనే లేదు. గుజరాత్ లోని ఉనాలో దళితులపై దాడి.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య తరువాత యూపీలో దళితుల్లో బీజేపీపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమిత్ షా కూడా యూపీలో ఎక్కువ సీట్లు అగ్రకులాల వారికే ఇవ్వడం కూడా ఆ పార్టీకి దళితులు, ముస్లింలను దూరం చేసినట్టైంది. అయితే బీఎస్పీకి, లేదంటే కాంగ్రెస్-ఎస్పీకి దళితుల ఓట్లు పడే అవకాశం ఉంది.. అందుకే మాయవతి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మోడీ బయటివారు.. ఎస్పీతో అల్లకల్లోలం..
మాయవతి ఎన్నికల ప్రచారంలో రెండే ప్రధాన అంశాలను ఎంచుకున్నారు. అందులో మొదటిది బీజేపీ స్థానిక పార్టీ కాదని.. నోట్ల రద్దు దేశాన్ని ముంచేసిందని.. మోడీ బయటి ప్రధాని ఎప్పుడూ స్థానికంగా ఉండడని మీ కష్టాలు తీర్చడని మాయవతి ప్రచారం చేస్తోంది..
ఇక రెండో అస్త్రం ఎస్పీపై… సమాజ్ వాదీ సీఎం అఖిలేష్ నేతృత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అడుగంటాయని.. దళితులు, ముస్లింలపై దాడులు కొనసాగుతున్నాయన్నారు. అందుకే బీఎస్పీ వస్తేనే యూపీలో శాంతిభద్రతలు బాగుంటాయని ప్రచారం చేస్తోంది. దీనికి ప్రజలు బాగానే కనెక్ట్ అవుతున్నారు. సర్వేలు కూడా ఆమెకే అనుకూలంగా ఉన్నాయి.

హంగ్ వస్తే మాయావతి సీఎం అట..?
ఒకవేళ యూపీలో ఎవ్వరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు రాకపోతే ఎలా అని అందరూ ఆలోచిస్తున్నారు. కొన్ని సర్వేలు కూడా హంగ్ వస్తుందని చెబుతున్నారు. ఎస్పీ-కాంగ్రెస్ కు 33 శాతం, బీజేపీకి 33శాతం, బీఎస్పీకి 30 శాతం ఓట్లు వస్తాయని చెబుతున్నారు. ఇదే జరిగితే ఇప్పటికే యూపీలో సరైనా నాయకుడు లేక..ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించని బీజేపీ.. మాయవతికి మద్దతు ఇస్తుందని సమాచారం అందుతోంది. మాయవతిని సీఎం చేసి వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో లబ్ధి పొందాలని.. బీఎస్పీ సాయంతో రాష్ట్రపతిని నియామకంలో తమ వారిని గెలుపించుకోవాలని ప్రయత్నాలు చేస్తోందట.. మొత్తానికి బీజేపీ కూడా మాయవతికి మద్దతిచ్చి .. కేంద్రంలో మద్దతు తీసుకునే విషయంపై ఆలోచిస్తున్నట్టు సమాచారం.. ఇందులో మాయ ఒంటిరిగా గెలిచినా లేక హంగ్ వచ్చినా సీఎం అవ్వడం గ్యారెంటీ అని తెలుస్తోంది..

To Top

Send this to a friend