ముసలయ్య మరణం..!

ఆ వార్త వినగానే గుండె కలుక్కుమంది.. ఆ ముసలయ్య ఆకలిచావు మమ్మల్ని కలిచివేసింది. రెండు రోజులు కనీసం నీళ్లు, పాలు తాగకుండా కన్నుమూసిన ముసలయ్య రూపం మా కళ్లముందే కనిపించినట్టైంది. నా అనే వాళ్లు లేక.. చందాలు వేసి జనం సాగనంపిన విషయం తెలిసి మనసులో బాధనిపించింది..
చూడగానే దీనమైన రూపం, తెల్లటిపంచె, తెల్లచొక్కాతో నిండైన వృద్ధుడు మా కోసం రోజు ఎదురు చూసేవాడు.. మేము ఆఫీసుకెళ్లాక టీ కోసం బయటకొచ్చే సమయానికి రోజు ఠంచునగా అక్కడే ఉండేవాడు. మేం టీం తాగాక వస్తుండగా డబ్బుల కోసం చేయిచాపేవాడు. కానీ ఎప్పడు ఆ పెద్దాయన మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇస్తే తీసుకునేవాడు.. ఇవ్వకుంటే సైలెంట్ గా వెళ్లేవాడు. కనీసం ఒక్కమాట కూడా ఆయన నోటి నుంచి విన్నది లేదు. ఆయన పేరు ఎంటో ఇప్పటికీ మాకు తెలియదు. మేము ఆ పెద్దాయనను సీనియర్ సబ్ ఎడిటర్ అంటూ పిలిచేవాళ్లం..
రోజు వారీగానే నిన్న టీ కి వెళ్లాం.. కానీ ఆ పెద్దాయన కనిపించలేదు. టీ ఆమె మాతో చెప్పింది. పాపం మీరు డబ్బులిచ్చే ముసలాయన ఇక లేడు అని.. రెండు రోజులుగా మాట బంద్ అయ్యిందని.. నీళ్లు, పాలు కూడా తాగక కూనరిల్లు చనిపోయాడని.. మాలో ఒక్కసారిగా నిశ్చబ్దం… ఆయన అసలు ఎవరు అని ఆమెను అడిగితే వివరాలు చెప్పింది..
ఆయన ఒక అనాథ అని.. ఎవరూ లేక ఆ రైస్ మిల్లులో జీవిస్తున్నాడని.. లారీల వాళ్లు.. అక్కడికి టీ కోసం వచ్చే వాళ్లని అడుక్కుంటూ పొట్టపోసుకుంటుండని.. ఆయన రూపాయి. రెండుతో జీవిస్తాడని మేం అనుకోలేదు… ఆయన రూపం, కట్టుబొట్టు చూస్తే రైస్ మిల్లులో వాచ్ మెన్ అనుకున్నాం. కానీ ఎవరూ లేక రోడ్డున పోయే వాల్లని, లారీ డ్రైవర్లను అడుక్కునేవాడని తెలిసి బాధపడేవాళ్లం. ఆయనకు పిల్లలు ఎవరూ లేరు. ఉన్న ఒక్క కొడుకు చిన్పప్పుడే పాము కుట్టి చనిపోయడట.. అప్పటినుంచి ఒక్కడే జీవిస్తున్నాడట..
అనాథగా చనిపోయిన ఆయన మృతదేహాన్ని దానం చేయడానికి ఎవరూ లేకపోతే అందరూ చందాలు వేసుకొని అంత్యక్రియలు చేశారట.. ఈ వార్త నిజంగా మా అందరినీ కలిచివేసింది. అందుకే రోజులాగానే వెళ్లినా.. ఆ రోజు మాలో ఓ సినియర్ సబ్ ఎడిటర్ ఇక లేరు అన్న వార్త కలిచివేసింది.
ఆయన మాకు ఏమీ కారు.. కానీ ఆ అనుబంధం మాలో ఒకరిని చేసింది. ఆయన పేరు కూడా తెలియకుండా వ్యవహరించిన ఆ ఆత్మీయ బంధం ఎప్పటీకి గుర్తిండిపోతోంది. ముసలాయనా.. నువ్ ఎక్కడున్నా.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా..
-నరేశ్, సీనియర్ జర్నలిస్ట్

To Top

Send this to a friend