మహేశ్ బాబు, అల్లు అర్జున్.. ఇప్పుడు మంచు విష్ణు

తెలుగు హీరోలు స్టాండ్ మార్చారు.. తమ మార్కెట్ విస్తృత పరుస్తున్నారు.. మొన్నటికి మొన్న మహేశ్ బాబు తెలుగుతో పాటు తమిళంలో మార్కెట్ పెంచుకునేందుకు తమిళ అగ్ర దర్శకుడు మురగదాస్ తో సినిమాకు ఒప్పుకున్నారు. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో తెలుగుతో పాటు తమిళంలో కూడా పాపులర్ అవ్వాలని మహేశ్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ద్విభాషల్లో సినిమా తెరకెక్కుతోంది. మహేశ్ బాల్యం, విద్యాభ్యాసం అంతా చైన్నైలోనే సాగింది. మహేశ్ కు తమిళం బాగా వచ్చు.. అందుకే డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు. గతంలో మహేశ్ నటించి బిజినెస్ మ్యాన్ చిత్రం తమిళంలో విడుదలైంది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మురగదాస్ సినిమాతో నేరుగా తమిళంలో కూడా సెటిల్ అవ్వాలని మహేశ్ యోచిస్తున్నారు..

ఇక అల్లు అర్జున్ ఆదినుంచి తన మార్కెట్ ను పెంచుకుంటూనే పోతున్నాడు. ఇప్పటికే తెలుగుతో పాటు మలయాళం కూడా మార్కెట్ పెంచుకున్నాడు. తెలుగుతో సమానంగా అక్కడ వసూళ్లు సాధించి మలయాళంలో హీరోగా నిలదొక్కుకున్నారు. అందుకే ఇప్పుడు తమిళ మార్కెట్ పై దృష్టి పెట్టిన అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు లింగుస్వామితో సినిమా చేసేందుకు సై అన్నారు. ఇది తెలుగు, తమిళం, మలయాళంలో విడుదలవుతుంది. హిట్ అయితే దక్షిణాది హీరోగా అర్జున్ కు స్టార్ డం వస్తుంది..

ఇప్పుడు తాజాగా హీరో మంచు విష్ణు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విష్ణు కథానాయకుడిగా తెలుగు, తమిళం భాషల్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. జీ.ఎస్ కార్తీక్ దర్శకత్వంలో సుధీర్ పూదోట నిర్మాత.. హైదరాబాద్ లో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఎంఎం కీరవాణి, విజయేంద్రప్రసాద్, మోహన్ బాబులు హాజరై సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. తెలుగుతో పాటు తమిళంలో విడుదలయ్యే సినిమాతో మంచు విష్ణు తన మార్కెట్ ను తమిళంకు విస్తరిస్తున్నాడు.

ఇలా తెలుగు హీరోలందరూ కేవలం ఒక భాషకు పరిమితం కాకుండా ద్వి, త్రిభాషల్లో పేరు పొందేందుకు పాటుపడుతున్నారు. ఈ ప్రయత్నాలు ఫలిస్తే మన తెలుగు హీరోల మార్కెట్ స్థాయి కచ్చితంగా పెరుగుతుంది..

To Top

Send this to a friend