తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణమే ఓ మిస్టరీ.. దాదాపు 3 నెలల పాటు ఆమె.. అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందింది. ఎవ్వరూ ఆమె దగ్గరకు వెళ్లలేదు. ఆమె ఫొటోలు బయటకు రాలేదు. అమ్మ మాట్లాడిన వీడియోలు చిక్కలేదు. అమ్మను చూసినవారు కొందరు అమ్మ ఆరోగ్యం కుదుటపడిందని..త్వరలో బయటకొస్తారని చెప్పారు. కానీ హఠాత్తుగా ఓ రోజు రాత్రి గుండెపోటు రావడం ఆమె చనిపోయవడం జరిగిపోయాయి.. ఇంతకీ అపోలో ఆస్పత్రిలో ఏం జరిగిందో ఎవ్వరికి తెలియకుండా పోయింది. అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డికి మాత్రమే ఈ విషయం తెలుసు.. ఎందుకంటే ఆయనే దగ్గరుండి జయలలితకు చికిత్స అందించారు.
చైన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో మాట్లాడిన ప్రతాప్ సి రెడ్డి అమ్మ మరణం.. పరిణామాలపై మాట్లాడారు. జయలలిత చికిత్స మరణం విషయంలో ఎలాంటి అపోహలు లేవని.. సీబీఐ విచారణ చేస్తే అన్ని రిపోర్టులు అందజేస్తామన్నారు. జయలలిత ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని.. అవి బాగై కోలుకుంటున్న సమయంలోనే తీవ్ర గుండెపోటు రావడంతో జయలలిత మృతిచెందారని చెప్పారు. జయలలిత అస్వస్థత వల్ల కాళ్లు చెడిపోయి తొలగించారన్న వార్తల్లో నిజం లేదని.. అమ్మ నుంచి ఎలాంటి శరీర భాగాలను తొలగించలేదని అపోల్ చైర్మన్ వివరణ ఇచ్చారు. దీంతో జయలలిత మృతిపై వస్తున్న ఆరోపణలు ఉత్తవేనని తేటతెల్లమైంది
