* పిచ్చిమాలలు వేసుకొని పెద్దమాంసం మానేయొద్దు
* జయశంకర్ జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి వ్యాఖ్యలు
* ఖండించిన బ్రాహ్మణులు.. బీజేపీ, వీహెచ్పీ నేతల ధర్నా
* తర్వాత క్షమాపణలు చెప్పిన కలెక్టర్
‘‘మాంసం తింటే ఆరోగ్యంగా ఉంటాం. కానీ.. బ్రాహ్మణిజం మాత్రం పెద్దకూర (ఎద్దుమాంసం)తినొద్దంటూ దరిద్రపు కల్చర్ని నేర్పింది. ఆ దేవుడు.. ఈ దేవుడి పేరిట ఏవేవో పిచ్చి మాలలు వేసుకుని.. మాంసం తినడం మానేయొద్దు..’’ అని జయశంకర్ జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాంసం తింటే ఆరోగ్యంగా ఉంటామని, అందులోనూ పెద్దకూర (గొడ్డు మాంసం, పందిమాంసం) తింటే మంచి పోషకాలు లభిస్తాయని చెప్పారు.
ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవంలో భాగంగా శుక్రవారం ఏటూరునాగారంలో జరిగిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్సీలు, ఎస్టీలంతా అడవిపందిని స్వేచ్ఛగా వేటాడొచ్చన్నారు. ఆశాలు, ఏఎన్ఎంలు ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. తాను ములుగు మండలం అంకన్నగూడెం గ్రామానికి వెళ్లిన క్రమంలో అక్కడివారు పెద్దకూర తినే విషయంలో ఆంక్షలపై ఆవేదన చెందారని చెప్పారు. ఆ దేవుడి పేరున.. ఈ దేవుడి పేరున ఏవో పిచ్చిమాలలు వేసుకొని మాంసం తిననీయకుండా చేస్తున్నారని కలెక్టర్ వాపోయారన్నారు.
కాగా కలెక్టర్ వ్యాఖ్యలపై పలువురు నిరసన వ్యక్తం చేశారు. మహదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ, వీహెచ్పీ, బ్రాహ్మణులు ధర్నా చేశారు. కలెక్టర్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ క్షమాపణలు చెప్పారు. తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని ఒక ప్రకటనలో కోరారు.
