బెజవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై 108 అడుగుల రామానుజుల విగ్రహం

బెజవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై 108 అడుగుల రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు త్రిదండి రామానుజ చిన జీయర్‌ స్వామి తెలిపారు. అమెరికాలోని కాలిఫోర్నియా ఫోల్పం నగరంలోని విస్టా డీలాగోలో శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రవచనం చేశారు. దేహాన్ని దేవాలయంగా భావించి నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సామాన్యులకు సైతం ఆలయ ప్రవేశం కలిగే విధంగా వేంకటేశ్వర స్వామి ఆరాధన విధానాన్ని క్రమబద్దీకరించి నిత్యం లక్షల మంది భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని సందర్శించుకునేలా చేస్తున్నట్లు తెలిపారు. సమతా మూర్తి శ్రీరామానుజాచార్య ప్రభావాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో రూ.600 కోట్లతో శ్రీమద్రామానుజ స్ఫూర్తి కేంద్రం నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ కేంద్రంలోని 45 ఎకరాల విస్తీర్ణంలో 216 అడుగుల ఎత్తున శ్రీరామానుజుల పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ పేరుతో ఇంత భారీ ఎత్తున నిర్మించే ఆ సమతామూర్తి విగ్రహం ఏర్పాటుకు కనీసం 100 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు వివరించారు. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో 2022 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.

To Top

Send this to a friend