బిజినెస్ మ్యాన్ చిరు.. వెనుక ఆ హీరో!

30ఏళ్లకు పైగా సినీ వినీలాకాశంలో విహరించిన చిరంజీవి.. 149 సినిమాలు తీసి ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించారు. అనంతరం 2009లో సినిమాలకు తాత్కాలికంగా స్వస్తి చెప్పి రాజకీయాల బాటపట్టారు. ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించి రాజకీయాల్లో ప్రయత్నించారు. కానీ కుట్రలు, కుతంత్రాలతో పార్టీ అంతర్థానమైపోయింది. ఆ తర్వాత చిరు రాజకీయాల కాడి వదిలేద్దామనుకున్నారు. కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీని కలిపేసి ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన ఎంచుకున్న రాజకీయాల్లో అనుకున్న పురోగతి సాధించలేకపోవడంతో బాస్ ఈజ్ బ్యాక్ వచ్చారు. మళ్లీ 150 వ సినిమాతో ప్రేక్షకులను అలరించి అద్భుతంగా రీఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నంబర్ 150తో వసూళ్ల సునామీ సృష్టించి తన స్టామినా తగ్గలేదని నిరూపించారు.
చిరంజీవి సినిమాలు, రాజకీయాలే కాదు.. మరో హీరో స్ఫూర్తితో బిజినెస్ మ్యాన్ గా కూడా రాణించారు. సినిమాల్లో ఘన విజయం సాధించిన చిరు రాజకీయాల్లో మాత్రం ఫెయిల్ అయ్యారు. చిరుని బిజినెస్ రంగంలోకి రమ్మని ఆహ్వానించి, ప్రోత్సహించింది మరో అగ్రహీరో నాగార్జున అట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవియే చెప్పారు. తెలుగు ఎంటర్ టైన్ మెంట్ చానల్ మాటీవీలో మొదట పెట్టుబడులు పెట్టేందుకు నాగార్జున, చిరును ఆహ్వానించారట.. మాటీవి విజయవంతం కావడంతో చిరు, నాగ్ కు లాభాలువచ్చాయి. చివరకు 2200 కోట్లకు మాటీవీని స్టార్ గ్రూపుకు అమ్మేసి కోట్లు గడించారు చిరు, నాగార్జునలు.. నాగార్జున ఇచ్చిన ఐడియాతో బిజినెస్ రంగంలోకి అడుగిడిన చిరంజీవి అందులో విశేషంగా రాణించారు.
ఆదివారం స్టార్ గ్రూపు సంస్థ మాటీవీ లోగో మార్చే కార్యక్రమంలో చిరు పాల్గొన్నారు. స్టార్ మా అనే కొత్తలోగోను చిరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాటీవీతో తన అనుబంధాన్ని నాగార్జున ప్రోద్బలాన్ని గుర్తు చేసుకున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడితో మళ్లీ మాటీవీలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు చిరు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగ్, వెంకటేశ్, రాధిక, సుహాసిని, బాలయ్య కూడా పాల్గొంటారని.. మొత్తం 60 ఎపిసోడ్లు కార్యక్రమం ప్రసారమవుతుందని చెప్పారు.

To Top

Send this to a friend