బాహుబలి2, రోబో 2.. విజేతలెవరో?

దేశంలో అయితే హిందీ పరిశ్రమ.. లేదంటే తమిళ పరిశ్రమ.. ఈ రెండింటి పేరే కొన్నేళ్ల క్రితం వరకు వినిపించేది. వాళ్ల సినిమాలు కూడా అంత స్టాండర్డ్ గా ఉండేవి.. కానీ ఒక్కడు.. ఒకే ఒక్కడు తెలుగు సినిమా స్థాయిని పెంచాడు.. బాహుబలితో చరిత్ర సృష్టించాడు. తెలుగు సినిమా స్టామినాను దేశంతో పాటు ప్రపంచానికి పరిచయం చేశాడు. బాహుబలి సంచలన విజయం సాధించి దేశ చరిత్రలోనే గొప్ప చిత్రంగా అవతరించింది. ఇక అప్పటివరకు సాగిన తమిళ తంబీల హవాకు చెక్ పెట్టి తెలుగువారి స్టామినా దేశానికి తెలిసివచ్చింది.. అదే సమయంలో దిగ్గజ దర్శకుడు.. తమిళ చిత్రాల్లో ప్లాపులు ఎరగని శంకర్ చిత్రం ‘ఐ’ కూడా విడుదలైంది. అప్పటివరకు దాదాపు రెండు దశాబ్దాలుగా ఓటమెరుగని శంకర్ కు ఐ నిరాశపరిచింది. తొలిసారి ప్లాప్ అయ్యింది.. దీంతో ఆయన తన తరువాతి సినిమాగా మళ్లీ రోబోనే ఎంచుకున్నాడు. దాని స్వీకెల్ తీసేందుకు సై అన్నాడు. ఇటు బాహుబలి కొనసాగింపు, అటు రోబో సీక్వెల్ ఇలా రెండు గొప్పచిత్రాలు.. ఇద్దరు గొప్ప దర్శకులు ఒకేసారి పోటీపడుతున్నారు. ఈ సంవత్సరమే వీరిద్దరి చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో మరి విజయం ఎవరికి వరిస్తుంది. ఎవరి క్రెడిట్ ఎంత? ఎక్కువ మార్కులు ఎవ్వరికీ అని ఉత్కంఠ సర్వత్రా ఉంది..
బాహుబలి.. ఒక హిస్టారిక్ ఫిలిం.. రాజులు, రాజ్యాలు, యుద్ధాలు, నాటి కుతంత్రాలు, రాజనీతి.. ఇది ఆసక్తికర చిత్రమే.. పైగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే సస్పెన్స్ ను వదిలి రాజమౌళి ఎంజాయ్ చేస్తున్నాడు.. దీంతో ఆ విషయం తెలుసుకునేందుకైనా జనం తప్పకుండా బాహుబలి సినిమా చూడాల్సిందే..
ఇక రోబో సినిమా టెక్నాలజీ సంచలనం.. ఆధునిక పోకడలు.. కనీసం 30 ఏళ్ల తర్వాత రోబోల ఫైట్ ఎలా ఉంటుందో ముందే ఊహించి తీసిన చిత్రం.. అది రాబోయే తరం సినిమా.. అందుకే రోబో అంత హిట్ అయ్యింది. ఇప్పుడు తీస్తున్న రోబో2 కూడా అంతే.. టెక్నాలజీ.. సైన్స్ వండర్ గా రాబోతోంది..
ఒకటి హిస్టారికల్.. ఇంకోటి సైన్స్ వండర్.. ఈ రెండు దేనికదే ప్రత్యేకం.. డైరెక్షన్ పరంగా శంకర్ కున్న అనుభవం రాజమౌళికి లేదు. కానీ శంకర్ కంటే ఎక్కువ కసే రాజమౌళిలో ఉంది. ఒక దెబ్బతిన్న పులి.. మరొకరు చరిత్ర సృష్టించిన దర్శకుడు ఇలా ఇద్దరు దిగ్గజ దర్శకుల చిత్రాలు ఈ ఏడాది మనల్ని అలరించబోతున్నాయి. రెండు వేరువేరు కథాంశాలు.. వేరు వేరు అభిరుచులు ఉన్న ప్రేక్షకులకు ఈ రెండు చిత్రాలు ప్రత్యేకమే.. మరి వాటికోసం ఆతృతగా ఎదురుచూడడం .. విజేతలను నిర్ణయించడం మనముందున్న కర్తవ్యం.. ప్రేక్షకుల చేతిలోనే ఈ రెండు చిత్రాల భవిత ఉంది.. విజేతలెవరో తేల్చడానికి సినిమాల విడుదల వరకు ఆగాల్సిందే..

To Top

Send this to a friend