బాప్ రే.. మావోయిస్టుల బాణం బాంబులు

కాలానుగుణంగా మావోయిస్టులు మారిపోతున్నారు. తమకు ఉన్న అవకాశాలను బేరిజు వేసుకొని అప్ డేట్ అవుతున్నారు. ఆధునిక టెక్నాలజీనే కాదు.. పాత తరం విద్యలను ఉపయోగించుకుంటూ వినాశనం సృష్టిస్తున్నారు. చత్తీస్ ఘడ్ లో జరిపిన దాడుల్లో బాణం బాంబులను పోలీసు దళాలపైకి విసిరి హతమార్చినట్టు తెలియడంతో అంతా అవాక్కయ్యారు. మావోయిస్టులు కొత్త తరహా దాడులకు పాల్పడడం ఇదే తొలిసారి.

రాకెట్‌ లాంచర్ల తరహాలో బాణాలకు ఫ్రెషర్‌ బాంబులను అమర్చి దాడులు చేస్తున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. శనివారం ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై చేసిన దాడిలో వీటిని ఉపయోగించినట్లు గుర్తించారు. 12 మంది జవాన్ల మృతిలో బాణం బాంబుల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మావోయిస్టులు మందుపాతర్లు అమర్చి, పోలీసులు రాగానే వాటిని పేల్చివేయడం, వెంటనే వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడం చేసేవారు. గిరిజనులకు విలువిద్యలో ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటూ తాజాగా కొత్త తరహా దాడులకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు.

దండకారణ్యంలో మావోయిస్టులకు ప్రధానంగా సహకరించే గిరిజనులు బాణాలు వేయడంలో ఆరితేరిన వారు. ఆ విద్యను ఆసరాగా చేసుకుని బాణాలకు బాంబులు అమర్చి దాడులకు దిగుతున్నారు. దూరంగా ఉన్న పోలీసులపైకి వదిలితే లక్ష్యాన్ని చేరుకోకపోయినా కింద పడిన వెంటనే పేలిపోతుంది. దీంతో సమీపంలో దాని ప్రభావం ఉంటుంది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడిలో మందుపాతర్లతోపాటు వీటిని ఉపయోగించారు.

To Top

Send this to a friend