పోలవరానికి పగుళ్లు… వైఎస్‌ అదైతే… మీరు పిండారీలే

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరోసారి సంచలన విషయాలను బయటపెట్టారు. పోలవరం స్పిల్‌వేకు పగుళ్లు వచ్చిన విషయాన్ని ఆయన మీడియా సమావేశంలో బయటపెట్టారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేశారు. స్పీల్‌వే మొత్తం బీటలు వారిందని… ఇది చాలా ప్రమాదకరమన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను తాత్కాలిక అసెంబ్లీని కట్టినట్టుగా కడితే కుదరదన్నారు. క్షణాల్లో కోట్ల లీటర్లు నీరు వచ్చి ఒక్కసారిగా పడుతుందన్నారు. ఇక్కడ నాణ్యత పాటించకపోతే పెనుప్రమాదం తప్పదన్నారు. స్పిల్‌వేకు పగుళ్లు వచ్చిన విషయంపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టును ఏదో ఒక రోడ్డు వేసినట్టుగా నిర్లక్ష్యంగా నిర్మిస్తున్నారని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు. కాపర్ డ్యాం విషయంలోనూ ఏమాత్రం ప్రమాణాలు పాటించడం లేదన్నారు. ఈ విషయాలను నిఫుణులే తనతో చెప్పారన్నారు. ప్రాజెక్టుకు పగుళ్లు వచ్చిన ఫొటోలను కూడా చూడవచ్చన్నారు. వైఎస్‌కు తాను చాలా దగ్గరగా ఉన్నానని ఆరోజుల్లో జలయజ్ఞం పేరుతో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. వైఎస్‌ హయాంలో అప్పటి ధరలు, అంచనాలను… ఇప్పుడు ఉన్నధరలు, ప్రాజెక్టు అంచనా వ్యయాలపై చర్చిస్తే ఈజీగా ఆ విషయం అర్థమవుతుందన్నారు. ఒక వేళ అప్పటికీ వైఎస్‌ది దోపిడినే అని టీడీపీ నేతలు వాదిస్తే… ఇప్పుడు జరుగుతున్నది మాత్రం పిండారి పాలనగానే భావించాల్సి ఉంటుందన్నారు. గతంలో బ్రిటిష్‌ పాలన సమయంలో పిండారీలు అనే వారు ఉండేవారని చెప్పారు. వారు ఒక గ్రామం మీద దాడి చేస్తే ఊరినంతా దోచేయడం, ఆడవాళ్లను రేప్‌లు చేయడం చేసేవారని ఉండవల్లి చెప్పారు. కాబట్టి వైఎస్‌ది దోపిడి పాలన అని విమర్శిస్తే… ఇప్పుడు చంద్రబాబు పాలనను పిండారి పాలనగా భావించాల్సి ఉంటుందన్నారు ఉండవల్లి.

To Top

Send this to a friend