పులి కాస్తా పిల్లి అయ్యిందే..

సీఎం కేసీఆర్, టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు జరిగాయి. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పడంతో అప్పట్లో టీడీపీ సీనియర్ నేత అయిన మోత్కుపల్లి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ను దొంగ, దోపిడిదారు.. కాపలకుక్క సీఎం సీటు ఎక్కిందంటూ పరుష పదజాలతో మోత్కుపల్లి కేసీఆర్ ను కడిగేశాడు. ఆ విమర్శలకు జడిసి ఓ రోజు హరీష్ రావు మోత్కుపల్లిని కలిసి కేసీఆర్ ని అంతలా తిడుతున్నావ్.. జర తగ్గించరాదే.. మా పార్టీలో రా అంటూ ఆహ్వానించాడట.. కానీ మోత్కుపల్లి టీడీపీనే నమ్ముకొని కేసీఆర్ కింద పనిచేయ అంటూ తిరస్కరించాడు.. కానీ అదంతా గతం.. ఇప్పుడు మోత్కుపల్లికి తత్వం బోధపడింది..

మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఇస్తానన్న చంద్రబాబు ఆయన్ను విస్మరించాడు. దీంతో మోత్కుపల్లికి తత్వం బోధపడి కేసీఆర్ ను తిట్టడం మానేశారు. కనీసం ప్రెస్ మీట్ లకు కూడా అందుబాటులో ఉండకుండా సైలెంట్ అయ్యాడు. బాబును నమ్ముకొని కేసీఆర్ ను తిడితే తానే నష్టపోయానని.. చివరకు ఏ పదవి లేకుండా కష్టాలు పడుతున్నానని మోత్కుపల్లికి అర్థమైంది. టీడీపీలో ఉండి కేసీఆర్ పంచన చేరిన తోటి నాయకులు తలసాని, తుమ్మల లు మంత్రిపదవులు కొట్టేశారు. మోత్కుపల్లి మాత్రం కేసీఆర్ ను తిట్టి విభేదాలు కొనితెచ్చుకున్నారు. దీంతో మోత్కుపల్లిలో పశ్చాతాపం వచ్చింది..

సీఎం కేసీఆర్ ను అపాయింట్ మెంట్ అడిగి శుక్రవారం మోత్కుపల్లి కలిశారు. నర్సింహులు ఏకైక కుమార్తె డాక్టర్ నీహారిక వివాహం ఈనెల 15న హైదరాబాద్ లో జరగనుంది. ఈ వేడుకకు ఆహ్వానించడానికి స్వయంగా పాత విభేదాలు పక్కనపెట్టి నర్సింహులు సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లారు. మోత్కుపల్లిని చూసి కేసీఆర్ విభేదాలు పక్కనపెట్టి అప్యాయంగా నర్సాన్న అంటూ పలకరించారట.. పెళ్లికి తప్పక రావాలని కేసీఆర్ ను మోత్కుపల్లి కోరగా కేసీఆర్ వస్తానని హామీ ఇచ్చారట.. ఇద్దరు తాము టీడీపీలో ఉన్పప్పటి విషయాలు గుర్తు చేసుకున్నారు.. ‘ఎన్టీఆర్ గొప్ప నేత.. మనకు లైఫ్ ఇచ్చింది ఆయనే ’ అని మోత్కుపల్లి అనగా అవును నిజం అంటూ కేసీఆర్ ఎన్టీఆర్ ను పొగిడాడట.. మనం ఈ స్థాయికి ఎదగడం ఎన్టీఆర్ దయ అని కేసీఆర్ అన్నారట.. తనకు చంద్రబాబు పట్ల కూడా ఎలాంటి వ్యతిరే్క భావం ఏమీ లేదని కేసీఆర్ చెప్పారట.. అలాగే ‘నీ గవర్నర్ పదవి ఎంత వరకు వచ్చిందని’ మోత్కుపల్లిని కేసీఆర్ అడగగా.. ‘ అంతా దైవాదీనం.. చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుందని’ మోత్కుపల్లి నిరాశగా సమాధానమిచ్చారట..

మొత్తంగా పదవులు , పట్టించుకోవడాలు లేకపోయే సరికి మోత్కుపల్లికి విషయం అర్థమైంది. అందుకే కేసీఆర్ తో దాదాపు గంట పాటు ఏకాంతంగా చర్యలు జరిపారు. త్వరలోనే టీఆర్ఎస్ లో చేరిపోతారనే సంకేతాలు వెలువడుతున్నాయి. పులి కాస్తా పదవుల కోసం కేసీఆర్ ముందట పిల్లి అయ్యిందంటున్నారు విశ్లేషకులు..

To Top

Send this to a friend