పవన్ పార్టీ పెట్టినప్పుడే చెప్పాడు. ఏ పార్టీలో ఉన్న నాయకులను చేర్చుకోనని.. యువతకు సీట్లు ఇస్తానని.. పోరాట యోధులకే పార్టీలో చోటు అని ప్రకటించారు. అందుకే జనసేన స్థాపించి మూడేళ్లయినా కూడా పవన్ పార్టీలో చెప్పుకోదగ్గ నాయకులు ఇప్పటికీ లేరు..
కానీ తొలిసారి ఓ విప్లవకారుడికి చోటివ్వబోతున్నట్టు తెలిసింది.. కమ్యూనిస్టు భావజాలం మెండుగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలోకి మాజీ మావోయిస్టు, సానుభూతిపరుడు, ప్రజాయుద్ధ నౌక గద్దర్ చేరబోతున్నట్టు సమాచారం.
ఇటీవల కమ్యూనిస్టులు నిర్వహించిన సభలో గద్దర్ ఓ ముఖ్య ప్రకటన చేశారు. ఎన్నికలకు దూరంగా ఉండాలన్న తన నిర్ణయాన్ని మార్చుకున్నానని.. త్వరలోనే తాను ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలుగా ఓటరుగా నమోదు చేసుకున్నానని తెలిపారు. తన భావజాలంతో ఏకీభవించే పార్టీ నుంచి పోటీచేయబోతున్నట్టు ప్రకటించారు.
గద్దర్ ప్రకటన తర్వాత ఆయన పోటీచేయబోయే పార్టీ జనసేనే అని తేలింది. కమ్యునిస్టులతో కలిసి పోటీ చేసేందుకు పవన్ సిద్ధమని గతంలోనే ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పవన్ పోటీచేస్తారనే ఊహాగానాలున్నాయి. ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టులకు అండగా ఉంటున్న గద్దర్ ఎన్నికల్లో బరిలోకి దిగుతానని ప్రకటించారు. దీంతో జనసేన తరఫునే గద్దర్ బరిలోకి దిగడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు
