పగలు కూడా లైట్ వేసుకునే బైకులు నడపాలి..

ఇప్పటి వరకు రాత్రి పూట మాత్రమే వాహనాలకు లైట్లు వేసుకోవడం చూశాం. పగటి పూట లైట్ వేసి రోడ్డు మీద వచ్చేవారికి సైగ చేసి మరీ లైట్‌ ఆపుకోవాల్సిందిగా సూచించడం చూశాం. అయితే ఇప్పుడు బైక్‌ లైట్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలు తెచ్చింది. ఇకపై పగలు కూడా ద్విచక్రవాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిందే. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఉత్తర్వులు ఆమలులోకి వస్తున్నాయి. ఏప్రిల్ ఒకటి నుంచి విక్రయించే వాహనాల్లోనూ ఇకపై ఆటోమెటిక్‌ హెడ్‌ల్యాంప్‌ ఆన్‌ టెక్నాలజీని తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ద్విచక్ర వాహన కంపెనీలు కొత్త తరహా వాహనాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇకపై వచ్చే బైక్‌లకు హెడ్‌లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్చ్ ఉండదు. ఇంజిన్ స్టార్టింగ్‌తోనే లైటు కూడా వెలుగుతుంది. బైక్‌ ఆపితేనే లైట్‌ కూడా ఆగుతుంది.

కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. ఎదురుగా వస్తున్న భారీ వాహనాలకు బైకులు దూరం నుంచి కనిపించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పలు నివేదికలు తేల్చాయి. రహదారుల భద్రతపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ కూడా ప్రపంచవ్యాప్తంగా పరిశీలన చేసి పగటి పూట కూడా బైక్‌ లైట్లు వెలిగేలా తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది. యూరప్, మలేషియా వంటి దేశాల్లో 2003 నుంచి ఈ విధానం అమలులో ఉంది. 2017 నుంచి వచ్చే బైకులన్నీ ఇకపై ఆటోమెటిక్‌ హెడ్‌ల్యాంప్‌ ఆన్‌ టెక్నాలజీతోనే వస్తాయని పలు కంపెనీల ప్రతినిధులు ప్రకటించారు. మొత్తం మీద ఏప్రిల్ నుంచి పగలు కూడా లైట్ వేసుకునే బైకులు నడపాల్సి ఉంటుంది.

To Top

Send this to a friend