పండగల్లో పందేలకు కోడిపుంజులనే ఎందుకు ఎంచుకుంటున్నారు?

దాదాపు ఆరు వేల సంవత్సరాల కిందట పర్షియాలో మొదలైన కోడి పందేలు నేటికీ పండగల పేరిట బరుల్లో కొనసాగుతూనే ఉన్నాయి. సంక్రాంతి వస్తుందంటే చాలు పందేల నిర్వాహకుల దృష్టంతా వీటిపైనే ఉంటుంది. కోడి పందేలు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించినా పండగ మూడు రోజులూ ఎలాగొలా బరిలో కోడిని దించేందుకు పట్టు బిగుస్తోంది. సంక్రాంతి పర్వదినాల్లో సంప్రదాయ జూదాల పేరుతో వీటిని విచ్చలవిడిగా జరిపేందుకు నిర్వాహకులంతా తలమునకలైపోతున్నారు. ఇందులో కోడి గెలుస్తుందా, ఆదేశాలు అమలవుతాయా అన్న అంశాన్ని పక్కన పెడితే పండగల్లో పందేలకు కోడిపుంజులనే ఎందుకు ఎంచుకుంటున్నారు..? వాటిలోనే ఎందుకంత పౌరుషం కనిపిస్తుంది..? కవుల వర్ణనలో వీటికే ఎందుకంత ప్రాధాన్యం సంతరించుకుంది..? తెలుసుకుంటే ఆసక్తికరమైన అంశాలు అవగతమవుతాయి. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కొక్కొరోక్కో అంటూ నిద్రమత్తును వదిలించి అందర్నీ మేల్కొలిపే కోడిపుంజు కథాకమామీషు గురించి తెలుసుకుందాం..
అదే ఆయుధం..
ఆహారం, ఆవాసం, ఆధిపత్యం కోసం ప్రతి జీవి అనునిత్యం ఆరాటపడుతుంటుంది. ప్రధానంగా ప్రాణ రక్షణకు తనలోని అవయవాన్ని ఆయుధంగా మలచుకుంటుంది. సరిసృపాలకు చెందిన మొసళ్లు, ఉడుములు, బల్లులు తోకను ఆయుధంగా చేసుకుంటాయి. ఎగిరే జాతి పక్షులు ముక్కు, కాళ్లను ఉపయోగిస్తాయి. నిప్పుకోడి కాలి ధాటికి వేటకుక్క అమాంతం గాలిలో ఎగిరిపడుతుంది. రెక్కలున్నా పెద్దగా ఎగరలేని కోడి ఆహారానికీ, ప్రాణ రక్షణకు ముక్కు, కాలి గోళ్లను ఆయుధాలుగా ఉపయోగిస్తుంటుంది. ఉపయుక్త, నిరుపయుక్త సూత్రం ప్రకారం ఏదైనా జీవి ఏ అవయవాన్నైతే ఎక్కువగా ఉపయోగిస్తుందో అదే తదుపరి తరానికి బాసటగా నిలుస్తుంది. అందుకే రెక్కలున్నా అది ఎగరడానికి బదులు భూమ్మీద ఆహారానికే అలవాటు పడింది. మనిషి తినడానికి ఇష్టపడిన కోడిలోనే వినోద క్రియను అన్వేషించి పోటీలకు సై అనడంతో కాలక్రమేణా అవి జూదాలుగా మారి వికృత చేష్టలకు దారితీస్తున్నాయి. కోడి కాళ్లకు చురకత్తులు కట్టడం, స్టెరాయిడ్స్‌ ఉపయోగించడం, రెక్కలకు రసాయనాలు పూయడం, కాంటాక్ట్‌ లెన్స్‌ వాడటంతో పందేల తీరు మరిన్ని వెర్రితలలు వేసింది.
ఎన్ని రంగులో.. ఎన్నెన్ని పేర్లో!
కుక్కుటానికి (కోడి) పలు రంగులే కాదు ఎన్నెన్నో పేర్లున్నాయి. వీటిని కీర్తిస్తూ ఎందరో కవులు రాసిన పద్యాలూ ఉన్నాయి. నల్ల కోడిని కాకి అంటారు. ఎరుపు రంగుతో ఉంటే డేగ అని పిలుస్తారు. తెల్లగా ఉంటే సేతువ, మెడ పొడవుగా ఉంటే నెమలి, ఇంకా కొక్కిరాయి, చవల, కౌజు, మైల, పచ్చకాకి, తెలుపు గౌడు, ఎరుపు గౌడు, పింగళి, రసంగి కోడిపుంజు నామధేయాలే. వాటి పదునైన గోళ్లతో ఉన్న కాలి వేళ్లకు రెండేసి కత్తులు కడతారు. కత్తులు లేకుండా జరిపేది డింకీ పందేలు. ఇంకా ఎత్తుడు దించుడు పందెం, చూపుడు పందెం, ముసుగు పందెం, జెట్టీ పందేలున్నాయి. కవిబ్రహ్మ తిక్కన శిష్యుడు కేతన కాలం నుంచి శ్రీనాథుడు వరకు ఎందరో ఉద్దండ కవులు వీటి గురించి వర్ణించారు. పట్నాటి సీమలో బ్రహ్మనాయుడు, నాగమ్మ అంశం ఎక్కడ వచ్చినా కోడి పందేలే అక్కడా ప్రధాన భూమిక పోషించిన సందర్భాలు ప్రస్ఫుటమవుతాయి.
గోళ్లే ఆయుధం.. దువ్వితే పౌరుషం
బలమైన కాళ్లకు ఉన్న పదునైన గోళ్లే కోడిపుంజుకు ఆయుధం. ప్రత్యుత్పత్తి కోసం ఆడ జీవిని ఆకర్షించేందుకు సృష్టిలో ప్రతి మగ జీవికి ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. అందమైన రంగు, పొడవైన శరీరం, ఎర్రని కిరీటం(తురాయి)తో చూడ్డానికి ఎంతో అందంగా కనిపిస్తుంది కోడిపుంజు. వాటిలో ఉండే సహజమైన ఎడ్రనలిన్‌ హార్మోన్లు పౌరుషాన్ని పెంచి పోరాడేందుకు దోహదం చేస్తాయి. వాటి శరీరంలో ఇవి విడుదలైనప్పుడు గుండె వేగం ఉద్ధృతమవుతుంది. జీవక్రియలో వేగం పెరుగుతుంది. కండరాలన్నీ మరింత శక్తిమంతంగా రూపుదిద్దుకుంటాయి. రెక్కల్లో ఉండే ఉడ్డయిక కండరాలు సైతం బలోపేతంగా మారతాయి. మెడను దువ్వడం ద్వారా ఎడ్రినలిన్‌ హార్మోన్ల ప్రభావంతో నాడులన్నీ ఉత్తేజితమవుతాయి. అది పౌరుషాన్ని పెంచడంతోపాటు చురుకుదనాన్ని కలిగిస్తుంది. దీంతో మెడ చుట్టూ ఉన్న వెంట్రుకలు నిటారుగా మొనదేలినట్లు తయారవుతాయి. కంట్లో సునిసితత్వం పెరుగుతుంది. వాడివేడి చూపులతో ప్రత్యర్థిపైనే దృష్టంతా కేంద్రీకరించడానికి అది దారితీస్తుంది.

Thanks to Author: T V Govinda Rao garu

To Top

Send this to a friend