పెళ్లికొడుకుపై కేసు పెట్టిన కలెక్టర్

తమ దాకా వస్తే కానీ సమస్య తీవ్రత ఆ కలెక్టర్ తెలియలేదు. ఇన్నాళ్లు ప్రజల బాధలు అర్థం చేసుకోలేదు. బ్యాండ్ బాజాలతో అర్థరాత్రి చేస్తున్న హంగామాతో చిన్న పిల్లలు, వృద్ధులు ఎంత బాధపడుతారో ఆ కలెక్టర్ అప్పుడు అర్థమైంది. అందుకే స్వయంగా తనే వెళ్లి డీజే సౌండ్ తో ఊరేగింపు చేస్తున్న ఆ పెళ్లికొడుకుపై కేసు పెట్టింది.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అలగు వర్శిణికి కోపం వచ్చింది. ఆరోజే పెళ్లి చేసుకున్న పెళ్లికొడుకు పగలంతా జరిపిన సంబరం చాలదన్నట్టు అర్ధరాత్రి అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో టపాసులు పేలుస్తూ, చెవులు పగిలిపోయేలా డప్పులు కొడుతూ చేస్తున్న ఊరేగింపు ఆమెకు చికాకు కలిగింది. అర్ధరాత్రి బ్యాండ్ చప్పుళ్లతో ఊరేగింపు చేసిన పెళ్లికొడుకు, పెళ్లి పెద్దలపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పెద్దపల్లికి చెందిన శ్రీధర్ వివాహం పగలు జరిగింది. అనంతరం రాత్రి పట్టణంలో పెళ్లి ఊరేగింపు చేశారు. అర్ధ రాత్రి సమయంలో భారీ బ్యాండ్ చప్పుళ్ల నడుమ ఊరేగింపు సాగింది. ఆ చప్పుళ్లతో చికాకు చెందిన కలెక్టర్‌ వర్శిణి స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు వెంటనే వెళ్లి పెళ్లికొడుకు శ్రీధర్‌తో పాటు మరో 9మందిపై కేసు నమోదు చేశారు.

వివాహ వేడుకల సందర్భంగా కానీ, మత కార్యక్రమాల సందర్భంగా కానీ, ఇతర వేడుకల సందర్భంగా కానీ రాత్రి 10 గంటల తరువాత పెద్దగా శబ్దాలు చేయకూడదని, అలా చేయడం నేరం అని సుప్రీం కోర్టు ఎప్పుడో తీర్పు చెప్పింది. ఆ తీర్పును అమలు చేయమని అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కానీ మన ప్రభుత్వాలకు ఇలాంటి ఆదేశాలు దున్నపోతు మీద వాన కురిసినట్టే. ఇప్పుడిప్పుడే పట్టణాలలో మాత్రం పౌరులు డిమాండ్ చేస్తుండడంతో పోలీసులు కాస్త అప్రమత్తమై రాత్రి 10 తరువాత పెద్ద శబ్దాలకు అభ్యంతరం చెబుతున్నారు. దీపావళి పండుగనాడు కూడా కొన్ని ప్రాంతాల్లో రాత్రి 10 తరువాత టపాసులు పేల్చకూడదని ఆంక్షలు విధించారు. ఇలాంటి నిబంధనలను చిన్న పట్టణాల్లో పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదుచేసినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. కలెక్టర్ కాబట్టి పోలీసులు వెంటనే కేసు నమోదుచేశారు. కలెక్టర్ చర్యను అనేకమంది పౌరులు అభినందిస్తున్నారు.

To Top

Send this to a friend