నిర్మాణ రంగంలోకి అభిషేక్‌ పిక్చర్స్‌

Abhishek.nama
‘శ్రీమంతుడు’, ‘రుద్రమదేవి’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సుప్రీమ్‌’, ‘కబాలి’ సినిమాలతో పాటు పలు సినిమాలను పంపిణీ చేసి, విజయవంతమైన సంస్థగా పేరు తెచ్చుకుంది అభిషేక్‌ పిక్చర్స్‌. చిన్నా పెద్ద తేడా లేకుండా మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ అధినేత అభిషేక్‌ నామా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. వస్తూ వస్తూనే.. ఐదు క్రేజీ సినిమాలను ప్రకటించారు. ఇవన్నీ ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్స్‌లో ఉన్నాయి. నాలుగు చిత్రాల్లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ భాగస్వామ్యంలో నిర్మిస్తోన్న చిత్రం ఒకటి. ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. ఈ ఐదు చిత్రాల వివరాలు:
1.    ‘సరైనోడు’తో సూపర్‌ సక్సెస్‌ అందుకున్న ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నారు అభిషేక్‌. ఇందులో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయిక. దేవిశ్రీప్రసాద్‌ పాటలు స్వరపరుస్తారు. ‘సరైనోడు’కి అద్భుతమైన ఛాయాగ్రహణం అందించిన రిషీ పంజాబీ కెమేరామ్యాన్‌గా వ్యవహరిస్తారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం అవుతుంది.
2.    సెప్టెంబర్‌ నెలలోలోనే మరో చిత్రం ప్రారంభం అవుతుంది. ‘స్వామి రారా’తో హిట్‌ కాంబినేషన్‌ అనిపించుకున్న హీరో నిఖిల్, దర్శకుడు సుధీర్‌ వర్మ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కనుంది.
3.     ‘క్షణం’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌లో నటించిన అడవి శేష్, అదా శర్మ జంటగా ‘క్షణం’ దర్శకుడు రవికాంత్‌ పేరేపు దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం షూటింగ్‌ ఆగస్టు ఆఖరి వారంలో ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి ‘గూఢచారి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
4.    ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ జీవితం ఆధారంగా సుధీర్‌బాబు టైటిల్‌ రోల్‌లో తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తయింది.

5.    ఫాంటమ్‌–రిలయన్స్‌ సంస్థలతో కలిసి అభిషేక్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న హిందీ ‘హంటర్‌’ తెలుగు రీమేక్‌ ఆల్రెడీ తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్, ‘లండన్‌ డ్రీమ్స్‌’ దర్శకుడు నవీన్‌ మేడారం దర్శకత్వంలో శ్రీనివాస్‌ అవసరాల హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సునీల్‌ కశ్యప్‌ సంగీత దర్శకుడు.

ఇలా ఒకేసారి ఐదు చిత్రాలు ప్లాన్‌ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇది ఒక రకంగా సాహసమే. ‘‘ఈ ఐదు చిత్రాల నిర్మాణం అనుకున్న విధంగా సాగేట్లు పకడ్బందీగా ప్లాన్‌ చేసుకున్నాం’’ అని అభిషేక్‌ తెలిపారు. ఈ ఐదు చిత్రాలకూ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా కాలి సుధీర్‌ వ్యవహరిస్తారు.

To Top

Send this to a friend