నా గాడ్‌ బ్రదర్‌ భానుచందర్‌ : సుమన్‌

నటుడు భానుచందర్‌ నాకు మిత్రుడు. తెలుగు పరిశ్రమలో ఇంతపేరు తెచ్చుకుని ఈ రోజు నేను ఇంత మంచి పొజిషన్‌లో ఉండటానికి కారణం భానుచందరే. తెలుగులో ఇన్ని చిత్రాల్లో నటిస్తూ రాణిస్తున్నానంటే ఆ క్రెడిట్‌ భానుచందర్‌కే దక్కుతుంది. అతడే నా గాడ్‌ బ్రదర్‌. తెలుగు చిత్ర పరిశ్రమ నీకు బాగా సరిపోతుంది, తెలుగులో నువ్వు ఖచ్చితంగా హిట్‌ అవుతావు, గ్రేట్‌ హీరో అవుతావు అని ప్రోత్సహించి తమ్మారెడ్డి భరద్వాజగారి దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశాడు భానుచందర్‌. ఆ విధంగా ‘ఇద్దరు కిలాడీలు’ చిత్రంలో నటించాను. మేం ఇద్దరం కలిసి కొన్ని సినిమాల్లో నటించాం.
చెన్నై టి.నగర్‌లో జన్మించాను. నా పూర్తిపేరు సుమన్‌ తల్వార్‌. మా నాన్నగారు సుషీల్‌ చందర్‌. అమ్మ కేసరి తల్వార్‌. నా మాతృభాష తుళు. కర్ణాటకలో మంగుళూరు ప్రాంతం ఈ భాషకు ప్రసిద్ధి. ఐశ్వర్యారాయ్‌, దీపికాపదుకొనే, శిల్పాశెట్టి… వీళ్లందరూ తుళు భాషకు చెందినవారే.
చెన్నై చర్చ్‌ పార్క్‌లోని ప్రైమరీ స్కూలులో ఐదవతరగతి వరకు చదివాను. తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత, టి.చిదంబరం చదివింది కూడా ఇక్కడే. పచ్చయప్ప కాలేజీలో పి.యు.సి మొదటి సంవత్సరం చదువుతూ ఉండగానే నాకు సినిమాల్లో అవకాశం వచ్చింది. విద్యార్థిగా ఉన్నప్పటి నుండీ సినిమాలు బాగా చూసేవాణ్ణి.

తరంగిణి
తెలుగులో నేను అంగీకరించిన మొదటిచిత్రం ‘ఇద్దరు కిలాడీలు’. కానీ విడుదలైన నా మొదటి చిత్రం ‘తరంగిణి’. ఇది సూపర్‌హిట్‌ చిత్రం. ఇందులో భానుచందర్‌, పూర్ణిమ, తరంగిని తదితరులున్నారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1982లో విడుదలైంది. ఇక తర్వాత సితార, మెరుపు దాడి, పండంటికాపురానికి పన్నెండు సూత్రాలు, కల్యాణవీణ, కోడలు కావాలి…వంటి చిత్రాల్లో నటించాను.

అన్నమయ్యకు బ్రహ్మరథం
నా సినీ జీవిత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన చిత్రం అన్నమయ్య. వేంకటేశ్వరస్వామి పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ వేంకటేశ్వరుని అవతారమే ఆ పాత్రలో చూశాం అని ఎందరో భక్తులు చెప్పారు. తెలుగులో నేను అంతకుముందు నటించిన 20వ శతాబ్దం, ఖైదీ ఇన్‌స్పెక్టర్‌, బావా బావమరిది, కలెక్టర్‌గారి అల్లుడు, పెద్దింటి అల్లుడు వంటి చిత్రాలన్నీ విజయవంతమైనవే. కలెక్టర్‌గారి అల్లుడు, పెద్దింటి అల్లుడులో కామెడీ పాత్రలు చేశాను. నా చిత్రాల్లో ఫ్లాప్‌ మాటే లేదు. బావ బావమరిది చిత్రంలో నటనకుగాను ఉత్తమ నటుడుగా నాకు నంది అవార్డు లభించింది.

రాష్ట్రపతి మెచ్చిన అన్నమయ్య
ఆనాటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మగారు అన్నమయ్య చిత్రం చూశారు. త్రివిధ దళాధిపతు లందరితో సహా సి.బి.ఐ చీఫ్‌ డైరెక్టర్‌ కార్తికేయగారు వచ్చారు. వీళ్లందరితో కలిసి కూర్చుని ఆ చిత్రం నేనూ చూశాను. వారితో కలిసి భోజనం చేశాను. ఇంతటి అదృష్టం ఎంతమంది నటులకు దక్కుతుంది చెప్పండి? అందుకే అన్నమయ్య నా జీవితంలో మరచిపోలేనిది. రాష్ట్రపతి చేతులమీదుగా ఆరోజు నాకు జరిగిన సన్మానం అదృష్టంగా భావిస్తాను. నా సినీ జీవిత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన చిత్రం.

శివాజీలో ఛాలెంజింగ్‌ పాత్ర
కెరీర్‌లో ఛాలెంజింగ్‌ చిత్రం శివాజీ. ఒక నటుడుగా, ఒక హీరోగా నేను విలన్‌ పాత్రను అంగీకరించి చేయడం, పైగా రజనీకాంత వంటి సీనియర్‌ నటుడికి ప్రతినాయకునిగా చేయడం చాలా కష్టం. ఇది కత్తిమీద సాములాంటిదే. షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులూ రాత్రిపూట రజనీకాంత నాకు ఫోన్‌ చేస్తూ, ఎంతో ఎంకరేజ్‌ చేసేవారు. ఆ చిత్రం విజయవంతం కావడానికి మెయిన్‌ రీజన్‌ ఆయనే.

రజనీకాంత్ గొప్పగుణం
‘శివాజీ’ చేస్తున్నప్పుడు గ్లామర్‌ హీరో విలన్‌ పాత్ర ఎలా చేస్తాడు? అనుకున్నారు. విలన్‌గా నేను ఫెయిల్‌ అవుతాననుకున్నారు. కానీ దర్శకుడు శంకర్‌ విలన్‌గా నా పాత్రను ఎంతోబాగా తీర్చిదిద్దాడు. ఈ చిత్రం సంచలనం సృష్టించింది. రజనీకాంత్‌ను డామినేట్‌ చేసేవిధంగా నా పాత్ర ఉన్నప్పటికీ ఆయన ఎలాంటి రియాక్షన్‌ లేకుండా ఎంతో సంతోషంతో నాతో నటించారు. ఆయన స్థానంలో మరో హీరో ఉండి ఉంటే, విలన్‌పాత్ర నన్ను డామినేట్‌ చేస్తోంది, కట్‌ చెయ్యండి అనేవారు. రజనీ అలా చేయలేదు. అదీ ఆయన గొప్పగుణం.

కరుణానిధి సన్మానం
శివాజీ చిత్రంలో ఉత్తమ ప్రతినాయకునిగా తమిళనాడు ప్రభుత్వ అవార్డు అందుకున్నాను. ఆనాటి ముఖ్యమంత్రి కరుణానిధి చేతులమీదుగా రజనీకాంత, కమల్‌హాసన్‌ల సమక్షంలో అవార్డు అందుకోవడం నాకు గర్వకారణం. ఇంత కంటే గొప్ప విషయం ఏదైనా ఉంటుందా?

గొప్ప నటులతొ
మూడు తరాల నటులతో నటించడం మరో గొప్ప అదృష్టం. ‘రావుగారింట్లో రౌడీ’ చిత్రంలో అక్కినేనితో నటించాను. ఆయన సెట్‌లో ఎంతో చమత్కారంగా, సంతోషంగా మాట్లాడేవారు. ఆయన తీరుతో షూటింగ్‌లో అలసటే ఉండేదికాదు. శోభన్‌బాబుగారితో ‘దోషి నిర్దోషి’లో నటించాను. కానీ ఎన్టీఆర్‌గారితో, సావిత్రిగారితో నటించలేకపోయాను. అది నా దురదృష్టం. ఇక తమిళంలో ఎంజీఆర్‌, శివాజీగణేశన్‌ నాకు రెండు కళ్లులాంటివారు. వాళ్లని చూసే నేను నటనలో ఇన్‌వాల్వ్‌ అయ్యాను. డైలాగ్‌ డెలివరీ నేర్చుకున్నాను. మనదేశంలో నటుడుగా రాణించి రాజకీయపార్టీపెట్టి ముఖ్యమంత్రిగా పాలించి పదవిలోనే మరణించింది ఎం.జి.ఆరే. తమిళనాట ఆ తర్వాత జయలలిత తెరమీదకు వచ్చారు. ఇవన్నీ నాకు బాగా నచ్చాయి.

తెలుగు నేర్పిన రేలంగి నరసింహారావు
ఈ రోజు ఇంత చక్కగా నేను తెలుగు మాట్లాడటానికి కారణం రేలంగి నరసింహారావుగారే. నా అభివృద్ధికి కృషి చేసిన దర్శకుల్లో ఆయన ఒకరు. ప్రత్యేక శ్రద్ధతీసుకుని ఒక కో డైరెక్టర్‌ను నియమించి నాకు తెలుగు నేర్పించారు. ఎలాంటి కోపం, చిరాకు లేకుండా ఎంతో మర్యాదగా ఉండేవారు. రైటర్‌ డైలాగ్‌ కష్టంగా ఉన్నాసరే మార్పులేకుండా యాజిటీజ్‌గా చెప్పించడం ఆయన గొప్పతనం. నో కాంప్రమైజ్‌ అనేవారు.

అభివృద్ధిపథంలో తెలుగు రాష్ర్టాలు
రామ్మూర్తినాయుడుగారు నాకు క్లోజ్‌ఫ్రెండ్‌. అప్పట్లో టీడీపీలో చురుగ్గా పాల్గొన్నాను. చంద్రబాబుగారు మంచి పాలనాదక్షుడు. దార్శనికుడు. హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధిచేశారు. కేసీఆర్‌గారు ముఖ్యమంత్రిగా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు.
సినిమారంగంలో మొదట జై తెలంగాణ అని నినదించింది నేనే. రెండు రాష్ర్టాలూ అభివృద్ధి చెందాలని నేను కోరుకున్నాను. ఇప్పుడు రెండూ అభివృద్ధి చెందుతున్నాయి.

నా తుది శ్వాస సినిమా
సినిమా పవర్‌ఫుల్‌ మీడియా. ఏ సందేశమైనా ఫాస్ట్‌గా ప్రజలకు చేరుతుంది. ఏ మెసేజ్‌ అందించాలన్నా సినిమాకు మించిందిలేదు. దీనికి తిరుగులేదు. నా తుదిశ్వాస వరకు సినిమా రంగాన్ని వదలను. సినిమా నా జీవితం, సర్వస్వం. 38 సంవత్సరాల సినీజీవితం పూర్తిచేశాను. ఇంగ్లీషుతో పాటు పలు భాషల్లో నటించాను. ఇంకా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వచ్చినా పూర్తికాలం కేటాయించలేను. ఫుల్‌టైమ్‌ పాలిటిక్స్‌లోకి వస్తే ప్రజాజీవితంలో పూర్తిగా మమేకం కావాలి. పేదలకోసం, అట్టడుగు వర్గాలకోసం పనిచేయాలి. ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చినా మరో రెండేళ్లు పడుతుంది. ప్రజల రక్షణ, ప్రయోజనాలకు ఉద్దేశించిన ఆకాంక్షలు నాకున్నాయి. నాకున్న ఉద్దేశాలు, అభిప్రాయాల్ని అంగీకరించిన పార్టీలోనే జేరతాను.

తీర్చిదిద్దిన దర్శకులు
ఎంతోమంది దర్శకులు నన్ను తీర్చిదిద్దారు. ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేయగలనన్న ఆత్మవిశ్వాసం ఉండటం, అందుకు తగ్గట్టు దర్శకులు అండగా నిలబడటం గొప్ప విషయం. ఆ విధంగా దర్శకుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాత్రలకు న్యాయం చేశాను. నవరసాలొలికే విభిన్న పాత్రలు చేశాను. అది దేవుడు నాకిచ్చిన వరం. అభిమానుల కోరిక మేరకు చాలా చిత్రాల్లో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలు చేశాను.
నా భార్య పేరు శిరీష. డి.వి.నరసరాజుగారి మనవరాలు. మాకు ఒక కుమార్తె. పేరు ప్రత్యూష.

To Top

Send this to a friend