నయనతారతో సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా హారర్ చిత్రం!

nayantara

తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా భాసిల్లుతున్న నయనతార ప్రధాన తారగా ఓ హారర్ చిత్రం రూపొందనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మురగదాసు రామస్వామి దర్శకుడు. తెలుగులో ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై ప్రొడక్షన్ నెం.5గా ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ నయనతార నటించనున్న మరో లేడి ఓరియెంటెడ్ చిత్రమిది. మయూరి తర్వాత ఆమె నటిస్తున్న మరో హారర్ చిత్రమిది. ఇప్పటి వరకు వచ్చిన హారర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రంలో నయనతార పాత్ర ఆసక్తికరంగా వుంటుంది. ఉత్కంఠను కలిగించే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం అందరిలోనూ ఉత్సుకతను కలిగిస్తుంది.  మా సంస్థలో విభిన్నమైన సినిమాలను రూపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాను. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్, సంగీతం: వివేక్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

To Top

Send this to a friend