దళిత మహిళ కేసు: ఖాకీ కీచకుడిపై వేటు..

పెద్దపల్లి జిల్లాలోని బొంపల్లిలో దంపతుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ధర్మారం ఎస్సై హరిబాబుపై వేటు పడింది. ఘటనపై ఆగ్రహించిన రామగుండం సీపీ విక్రమ్ జిత్ దుగ్గల్ ఎస్సైపై చర్యలకు ఆదేశించారు.

పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామానికి చెందిన దేవేందర్ తన పొలానికి నీళ్లుపెట్టేందుకు రాత్రిపూట భార్యాబిడ్డలతో కలిసి వెళ్లగా, ధర్మారం ఎస్సై హరిబాబు వారిని అనుమానించి,
‘చూస్తుంటే కేసులా ఉన్నావ్.. దుకాణమేమైనా నడుపుతున్నావా?’ అంటూ దేవేందర్ భార్య శ్యామలను నోటికిష్టమొచ్చినట్లు మాట్లాడడం తెలిసిందే.

ఈ అన్యాయాన్ని నిలదీసిన పాపానికి వారిని అంత రాత్రప్పుడు పోలీసుస్టేషన్ కు తరలించడమేకాక, దేవేందర్ ను చితకబాది, వారిపై తప్పుడు కేసులు బనాయించడం.. దీనిపై పలు ప్రజాసంఘాలు, టీఆర్ఎస్, బీజేపీ, సీఐటీయూ నాయకులు స్థానిక సివిల్ ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించడం విదితమే.

ఈ ఘటనపై స్పందించిన రామగుండం సీపీ విక్రమ్ జిత్ దుగ్గల్ ధర్మారం ఎస్సై హరిబాబును విధుల నుంచి తొలగించి, కేసును కమిషనరేట్ కు అటాచ్ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని పెద్దపల్లి ఏసీపీ సింధు శర్మను సీపీ ఆదేశించారు.

To Top

Send this to a friend