తెలంగాణ యాస.. భాష.

‘‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లెపోతవ్ కొడుకో.. నైజాం సర్కరోడా..’’.. అనే కవి గొంతుకలో తెలంగాణ ఆవేదన ఉంది.. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దశరాథి మాటల్లో తెలంగాణ గొప్పతనం ఉంది.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యాసకు, భాషకు జరిగిన అవమానాలకు తెలంగాణ తెరదించింది. ఇప్పుడు తేట తెలంగాణ తేనే లొలుకుతుంది. స్వరాష్ట్రంలో సగర్వంగా తన మనగడను కొనసాగిస్తోంది..

నూతన తెలంగాణలో తెలంగాణ యాస, భాషకు విశేష ఆదరణ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యం గా కేసీఆర్ విశేష శ్రద్ధ చూపుతున్నారు.. కడుపులోంచి వచ్చే ఆవేదనను, పోరుబాటకు సై అన్న తెలంగాణ వాదుల పాటలను, తెలంగాణ మాండలికాన్ని భావితరాలకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. యాస, భాషలను సజీవంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నడుం బిగించింది. మరుగున పడిపోతున్న.. జనం నుంచి దూరమవుతున్న పదాలను శోధించి.. సేకరించి.. లక్షపదాలతో పూర్తిస్థాయి నిఘంటువుగా రూపొందిస్తోంది. ఏడాదిపాటు తెలంగాణ యాసకు సంబంధించి అరుదైన పదాలన్నింటినీ సేకరిస్తారు. దీనిలో భాగంగా ప్రముఖ రచయితలు, భాషాభిమానులను సంపద్రించి, పలు పుస్తకాలను సమగ్రంగా అధ్యయనం చేసి నిఘంటువును రూపొందించనున్నారు. దీనికి విద్యార్థులు, ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని విశ్వవిద్యాలయ అధికారులు ఆశిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ చాలా పదాలు ప్రస్తుతం వాడుకలో లేవు. అలాంటి వాటిని ఆయా ప్రాంతాల్లోని వృద్ధులు, భాషాపండితుల నుంచి సేకరించే భారీ కార్యక్రమాన్ని చేపట్టింది వర్సిటీ. దీనికోసం రవ్వా శ్రీహరి, ఘంటా చక్రపాణి, డాక్టర్‌ నలిమెల భాస్కర్‌లతో ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామన్నారు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎస్వీ సత్యనారాయణ. నిఘంటువులో ఫలానా పదం లేదనే అపవాదు రాకుండా ఉండేలా సుమారు లక్ష పదాలతో దీన్ని రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష లేదా అంతకన్నా ఎక్కువ పదాలను సేకరించి వాటన్నింటినీ భాషా నిపుణులతో చర్చించి ఒకరూపు తీసుకొస్తారు. ముగ్గురు ఆచార్యులతో ఏర్పడిన కమిటీ ఈ పదాలకు తుదిరూపు తెస్తుంది. ఇదంతా ఏడాదిలోపు పూర్తి చేసి వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(జూన్ 2, 2018) నాటికి నిఘంటువును ఆవిష్కరింపజేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

To Top

Send this to a friend