తల్లిదండ్రుల ఆలనా పాలన చూడకపోతే జీతం కట్..!

నిజంగా ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రస్తుతం పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని వారు ఎందరో ఉన్నారు. దానికి అనేక కారణాలు ఉన్నా అప్పుడప్పుడు అయినా చాటు మాటుగా కూడా వారి ఆలనా పాలనా చూసుకొని వారు ఎందరో ఉన్నారు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు అస్సాం ప్రభుత్వం బాసటగా నిలిచింది. పెంచి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులపై కొరడా ఝుళిపించనుంది. వయసు పైబడిన వారి బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి అందించనుంది. ఈ మేరకు అస్సాం ఆర్థికశాఖ మంత్రి హిమంత బిశ్వాసర్మా బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేశారు.
2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుని సదరు ఉద్యోగి వేతనం నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి అతని తల్లిదండ్రులకు ఇస్తుందని తెలిపారు. అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి బిడ్డ బాధ్యత అని చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రైవేట్ కంపెనీలు కూడా ఇలాంటి నిభందన పెడితే చాలా బాగుంటుంది. కనీసం భయంతో అయినా తల్లిదండ్రుల ఆలనా పాలన చూసుకునే అవకాశం ఉంది. దేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి సాహసం చేస్తున్న అస్సాం ప్రభుత్వానికి అభినందనలు చెప్పి తీరాల్సిందే.

To Top

Send this to a friend