తమిళనాట హై అలర్ట్

శశికళను బలిపశువును చేశారని ఆమె వర్గం ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శశికళ వర్గం సిద్ధమైంది. అయితే ఈ పరిస్థితిని ముందే ఊహించిన హోం శాఖ పోలీసు శాఖను సమాయత్తపరిచింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.

కోర్టు తీర్పు నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచే చెన్నైలో పోలీసులు భారీగా మోహరించారు. ఇదిలా ఉంటే, కోర్టు వెల్లడించిన తీర్పుపై పన్నీరు సెల్వం వర్గం హర్షం వ్యక్తం చేసింది. ధర్మ యుద్ధంలో అన్యాయం ఎన్నటికీ పైచేయి సాధించడనడానికి సుప్రీం కోర్టు తీర్పే నిదర్శనమని పన్నీరు పంచన చేరిన నేతలు చెప్పుకొస్తున్నారు. శశికళ జైలుపాలు కావడంతో ఇన్నాళ్లు గవర్నర్‌పై వచ్చిన అనేక సందేహాలు మరింత బలపడ్డాయి.

గవర్నర్‌ కోర్టు తీర్పు ఆమెకు ప్రతికూలంగా ఉంటుందనే ముందే ఊహించి, ఎమ్మెల్యేల మద్దతున్న ఆమెను సీఎం కాకుండా అడ్డుకున్నారని శశికళ అనుచరులు ఆరోపిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో గోల్డెన్ బే రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. కోర్టు ఆదేశాల మేరకు శశికళకు చెందిన అనేక అక్రమాస్తులను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమైంది. జయ టీవీకి ప్రస్తుతం శశికళ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
సుప్రీం కోర్టు తీర్పుతో ఈ ఛానల్ భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారింది.

To Top

Send this to a friend