ట్రంప్.. వలసల నివారణకు సాహసం చేస్తున్నాడు..

ఫస్ట్ అమెరికా నినాదం తో అధికారంలో వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అనుకున్నట్టే అమెరికా ప్రథమ ప్రయోజనాల దిశగా పాలన సాగిస్తున్నారు.. దేశంలోకి పక్కదేశం మెక్సికో నుంచి వచ్చిపడుతున్న శరణార్థులు, నిరుద్యోగులు, వలసలు, డ్రగ్స్, మాఫియాను అరికట్టడానికి దేశ సరిహద్దుల్లో దాదాపు 3201 కి.మీ గోడ కట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అమెరికా-మెక్సికో దేశాల సరిహద్దుల్లో గోడ కట్టే ఫైలుపై ఈరోజు సంతకం చేశారు. అనంతరం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘జాతీయ భద్రతకు సంబంధించి అమెరికాలో అతిపెద్ద నిర్ణయానికి నేడు శ్రీకారం చుట్టాను. అందులో భాగంగానే అమెరికా-మెక్సికోల మధ్య గోడను కట్టబోతున్నాం..’ అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాకుముందు ట్రంప్ ఎన్నికల వాగ్ధానం చేశాడు. మెక్సికో నుంచి అమెరికాకు విచ్చలవిడిగా వచ్చిపడుతున్న డ్రగ్స్, వలసలను అరికట్టేందుకు సరిహద్దుల్లో గోడ కడుతానని హామీ ఇచ్చారు. అనంతరం గద్దెనెక్కగానే ఈరోజు దాన్ని అమలు చేశారు. నిజానికి అమెరికా గత ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 2006లో అమెరికన్ కాంగ్రెస్ లో మెక్సికో సరిహద్దు గోడ బిల్ పాస్ అయ్యింది. కొంత మేరకు నిర్మాణ పనులు జరిగి గోడను, కొన్ని చోట్ల కంచెను నిర్మించారు. దాదాపు 1050 కి.మీ మేర ఇప్పటికే ఇనుప కంచె, గోడ నిర్మాణం పూర్తయ్యింది. మిగిలిన గోడ నిర్మాణాన్ని ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం పూర్తి చేయబోతోందన్నమాట.. కాలిఫోర్నియా ఫసిఫిక్ తీరం నుంచి టెక్సాస్ రాష్ట్రంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరందాకా ఉన్న అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించనున్నారు. దాదాపు 3201 కి.మీ పొడవున ఉండే ఈ గోడ పూర్తి అయితే పూర్తి స్థాయిలో అమెరికాకు వలసలు తగ్గుతాయి. కాగా గోడ, కంచె లేకపోవడంతో ప్రస్తుతం యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ విభాగం ఈ సరిహద్దుకు అత్యాధునిక రాడర్ సిస్టం ద్వారా కాపాలా కాస్తూ సరిహద్దుల్ని రక్షిస్తోంది.

To Top

Send this to a friend