టాప్ -10 క‌ళాఖండాల సృష్టిక‌ర్త .. పూర్ణోద‌య అధినేత ఏడిద నాగేశ్వ‌ర‌రావు

 

img_5984
శంకరాభరణం , సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి.. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎన్న‌టికీ చెక్కుచెద‌ర‌ని కళా ఖండాలు. వీటిని ప్రేక్ష‌క‌లోకానికి అందించి ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోద‌యా సంస్థ‌. అంత‌టి ఉత్త‌మాభిరుచితో సినిమాకి సేవ‌లు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోద‌య అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు. 4, అక్టోబర్ 2015న స్వర్గస్తుల‌య్యారు. ఆయన ప్రథ‌మ వర్ధంతి సంద‌ర్భంగా ఈ స్పెష‌ల్‌….
ఎన్టీఆర్‌.. ఏఎన్నార్‌.. ఎస్వీఆర్‌.. సావిత్రి.. మ‌హామ‌హులంతా లేని లోటు అలానే ఉంది. నాగిరెడ్డి, చక్రపాణి, దుక్కిపాటి మధుసూదనరావు వంటి ఎందరో అత్యుత్త‌మ చిత్రాల నిర్మాత‌లుగా.. ఘ‌నుతికెక్కారు. ఈ దిగ్గ‌జాల నుంచి సినిమా ఎప్పుడొస్తుందా? అని నాటి సినీప్రియులు, ప్రేక్షకులు ఆస‌క్తిగా ఎదురు చూసేవారు. డా.డి. రామానాయుడు ఎన్నో సినిమాలను నిర్మించి చ‌రిత్ర‌కెక్కారు. వీరందరి అడుగుజాడ‌ల్లో వచ్చిన ఏడిద నాగేశ్వరరావు మూడు పదుల సినీజీవితంలో పదే పది సినిమాలను నిర్మించారు. ఈ పది చిత్రాలు కూడా కళాత్మక చిత్రాలుగా, తెలుగువాడి ఆత్మ‌గౌర‌వానికి సింబాలిక్‌గా ఓ అరుదైన సంత‌కంలాగా నిలిచిపోయాయి.
ఏడిద ఓ ప్ర‌యోగ‌శాల‌. ఆయ‌న 1979లో పూర్ణోద‌య సంస్థ‌ను స్థాపించారు. ఆ బ్యాన‌ర్‌లో నిర్మించే సినిమా ఏదైనా.. ఎంతో వైవిధ్యం ఉన్న టైటిల్స్‌ని పెట్టుకునేవారు. పూర్ణోదయ అధినేత స‌క్సెస్ ర‌హ‌స్యం  అక్కడే దాగుంది. ఆయన నిర్మించిన పది చిత్రాలు ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డులను, రివార్డులను అందుకున్నాయి. దర్శకులు గొప్ప కథలు చెబుతారు. కానీ ఆ కథలోని విషయాన్ని అర్థం చేసుకుని చేద్దాం అని ముందుకు వచ్చిన దార్శ‌నికుడు ఏడిద నాగేశ్వరరావు. ప్రేక్షకుల అభిరుచికి త‌గ్గ‌ట్టే, ట్రెండ్‌ కు తగ్గట్టు మారి సినిమాలు చేద్దామని ప్రోత్సహించే నిర్మాత‌గా పేరు తెచ్చుకున్నారాయ‌న.
img_0028 img_0073
మొన్నయినా.. నిన్నయినా.. నేడైనా ఒక సినిమాకు సంబంధించి నిర్మాతే ప్రథముడు, తనకు ఎలాంటి సినిమా కావాలని చెప్పేవాడు నిర్మాతే. డైరెక్టర్‌ చెప్పే కథ బాగుందా? లేదా అని నిర్ణయించుకునే జడ్జి కూడా నిర్మాతనే. అంత ఎనాలసిస్‌ చేసే వారు కాబట్టే ఏడిద నుంచి అన్ని గొప్ప చిత్రాలు వచ్చాయి. బంధు మిత్రుల‌తో కలిసి నాటకాలేస్తూనే మరో వైపు డబ్బింగ్‌ చెబుతూ కాలం గడుపుతున్న ఏడిద నాగేశ్వరరావు `సిరి సిరి మువ్వ`(1976)చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్వవ హరించారు . ఈ సినిమా సమయంలో దర్శకుడు కె.విశ్వనాథ్‌ తో ఏర్పడిన స్నేహం క్లాసిక్ ఫిలిం `ఆపద్భాందవుడు` సినిమా వరకూ కొనసాగింది. `సిరిసిరి మువ్వ` చిత్రానికి ఆయన పది పైసలు వాటా దారుడు కూడా. తర్వాత 1979లో కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో పూర్ణోదయ క్రియేషన్స్‌ పతాకంపై సొంతంగా  నిర్మించిన మొద‌టి సినిమా `తాయారమ్మ బంగారయ్య` ఆరోగ్యకరమైన హాస్య భరిత చిత్రంగా అల‌రించింది. సత్యనారాయణ, షావుకారుజానకి  పధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంతో నాగేశ్వరరావు ఘన విజయాన్ని అందుకున్నారు.
img_0072
పూర్ణోద‌య‌ బ్యానర్‌ నుంచి వచ్చిన మూడవ సినిమా శంకరాభరణం(1980). ఈ సినిమా ఏడిదకు ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టింది. అలాగే అరుదైన `స్వర్ణ కమలం` జాతీయ పుర‌స్కారాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత మ‌ళ్లీ ఇంత‌కాలానికి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కించిన `బాహుబలి` చిత్రానికి మాత్ర‌మే స్వ‌ర్ణ‌క‌మ‌లం ద‌క్కింది.
ఈస్ట్‌ ఫ్రాన్స్‌లో సంగీతం ప్రధాన చిత్రాలు మాత్రమే ప్ర‌ద‌ర్శిస్తారు.  కాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ఈ సినిమాకి ఉత్త‌మ చిత్రంగా అవార్డు వచ్చింది. వాస్త‌వానికి వ్యాపార‌ప‌రంగా చూస్తే ఈ సినిమాను కొనడానికి ఎవ‌రూ ముందుకు రాలేదు. దాదాపు వంద షోలు వేస్తే ఒక ఫ్రింట్‌ పాడైపోయింది. అద్భుతం అంటూ కరచాలనాలే తప్ప కొనుగోళ్లు లేవు. ఈ సినిమాను ఆంధ్రపద్రేశ్‌ లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, తమిళనాడు సీఎం ఎంజీ రామచంద్రన్‌, శివాజీ గణేషన్‌,కేరళలో నాటి సీఎం వీక్షించి ప్రశంస‌ల వ‌ర్షం కురిపించారు.  కమర్శియల్‌ సినిమా హవా నడుస్తోన సమయంలో ఈ సినిమా అప్పట్లో విడుదలై పెద్ద సంచలనం సృష్టించింది. తర్వత దేశ, విదేశాల్లో ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది.
పూర్ణోదయ సినిమా అంటే అవార్డు గ్యారంటీ. అవార్డు సినిమాలకు డబ్బులు రావు అన్న మాటను ఏడిద తిప్పి కొట్టారు. అలా సిరి సిరి మువ్వల‌ సవ్వళ్లు కొన్నైతే  శంకరాభరాణాలుగా మార్మోగిన రాగాలు ఇంకొన్ని. తెలుగు సినిమా వ్యాపార ధో రణి పేరుతో  అదుపుతప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కాపు కాసిన ఆపద్భాందవుడు ఆయన.
img_0030
చిరంజీవి ఏడాదికి ఎనిమిది సినిమాలు చేస్తున్న రోజులవి. ఆ సమయంలో `స్వయం కృషి`లో న‌టించారు. స్టోరీ లైన్‌ విని చిరంజీవి ఏమిటి! చెప్పులు కుట్టేవాడి పాత్రా? అనలేదు. ఈ కథ చిరంజీవిని ఆకట్టుకోవడమే కాదు.. తెలుగోడు త‌లెత్తుకునేలా గొప్ప‌ విజయం సాధించింది. ఈ సినిమా రష్యన్‌ భాషలోకి అనువాదమైంది. తర్వాత ఏడిద నాగేశ్వరరావు తనయుడు శ్రీరామ్‌ హీరోగా నటించిన `స్వరకల్పన` కూడా రష్యన్‌ భాషలోకి అనువాదమైంది. చిరంజీవి నటించిన మరో చిత్రం `ఆపద్భాందవుడు` ఉత్తమ తృతీయ  చిత్రంగా ఎంపిక కాగా, నంది ఉత్తమ నటుడిగా చిరంజీవి రెండవ సారి ఎంపికయ్యారు. కమల్‌హాస‌న్‌ నటించిన `సాగరసంగమం` తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది అందించింది. ఉత్తమ న‌టుడిగా కమల్‌, ఉత్త‌మ గాయనిగా జానకి  నంది అవార్డులు అందుకున్నారు.
మంచి చిత్రాలు నిర్మించాలంటూ తరుచూ చెప్పే ప్రభుత్వం ఇన్ని మంచి చిత్రాలు నిర్మించిన ఏడిద నాగేశ్వరరావును ఏ రీతిన గౌరవించింది? అని ప్ర‌శ్నించుకుంటే.. కనీసం పద్మ శ్రీ‌ కూడా ఇవ్వలేదు. తెలుగు సినిమాకు తొలి ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టిన నిర్మాత ఆయన. దాదా సాహెబ్ పాల్కే అవార్డు కు నామినేట్ అయ్యారు , కానీ అవార్డు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన రఘుపతి వెంకయ్య అవార్డు కూడా సినీ రాజకీయాల మూలాన రాలేదు . మంచి చిత్రం కోసం కోట్లాది రూపాయలు పణంగా పెట్టిన ఒక గొప్ప నిర్మాతకు దక్కాల్సిన గౌరవం దక్కిందా? అన్న‌ది ట‌న్ను బ‌రువైన ప్ర‌శ్న‌. ఓర‌కంగా ప్రభుత్వాల కంటే ప్ర‌యివేటు సంస్థ‌లే ఆయ‌న ప్రతిభను బాగా గుర్తించాయి. కళా సాగర్  వారు దశాబ్తపు ఉత్తమ నిర్మాత గా అవార్డునిచ్చి గౌర‌వించారు. సంగం అకాడమీ లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్‌, `సంతోషం` లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డుతో స‌త్క‌రించి గౌర‌వించాయి. ఈ సంవత్సరం శ్రీ ఏడిద నాగేశ్వరరావు స్మారక అవార్డు అభిరుచి గల నిర్మాత కు ఇవ్వడం విశేషం .
పశ్చిమగోదావరి జిల్లా తణు కులో 1934 ఏప్రిల్‌ 24 ఏడిద నాగేశ్వరరావు జన్మించారు. పాపలక్ష్మి, సత్తిరాజు నాయుడు తల్దిదండ్రులు. 1954లో మేనమామ కూతురు జయలక్ష్మిని వివాహ‌మాడారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె.
====
———–
*పూర్ణోదయా సంస్థ స్థాపించింది -1979
*సిరి సిరి మువ్వ – 1976
*మొదటి చిత్రం – తాయారమ్మ బంగారయ్య (1979)
* శంకరాభరణం -(1980) స్వర్ణకమలం అందుకున్న మొట్ట మొదటి తెలుగు చిత్రం – తరువాత ఇన్నేళ్లకు బాహుబలి చిత్రానికి వచ్చింది
*దాదా సాహెబ్ పాల్కే అవార్డు కు నామినేట్ అయ్యారు, కానీ అవార్డు రాలేదు .రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన రఘుపతి వెంకయ్య అవార్డు కూడా సినీ రాజకీయాల మూలాన రాలేదు .
*ప్రభుత్వం కంటే ప్ర‌యివేటు సంస్థ‌లు ఆయన ప్ర‌తిబ‌ను బాగా గుర్తించాయి. కళా సాగర్ వారు దశాబ్ధ‌పు ఉత్తమ నిర్మాత గా అవార్డునిచ్చి స‌త్క‌రించారు. సంగం అకాడమీ లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్‌,  సంతోషం` లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్‌ అవార్డు నిచ్చి గౌర‌వించాయి. ఈ సంవత్సరం శ్రీ ఏడిద నాగేశ్వరరావు స్మారక అవార్డు అభిరుచి గల నిర్మాత కు ఇవ్వడం విశేషం .
To Top

Send this to a friend