జేసీ వణుకు, రెడ్లపై కోపం వెనుక ఏం జరిగిందంటే…

నెల రోజులుగా జేసీ దివాకర్ రెడ్డి తీరులో ప్రత్యేకమైన మార్పు కనిపిస్తోంది. అంతకు ముందు జగన్‌ విషయంలో కాస్త సంయమనం పాటించిన జేసీ… ఇప్పుడు మాత్రం పనిగట్టుకుని జగన్‌ , వైసీపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రబాబు ఎక్కడ సభ పెట్టినా అక్కడ జేసీ ప్రత్యేక ప్రసంగం ఉంటోంది. ఆ ప్రసంగంలో జగన్‌ను తిట్టడం, రెడ్డి సామాజికవర్గంపై చులకన వ్యాఖ్యలు చేయడమే జేసీ దివాకర్ రెడ్డి పనిగా మారింది. అయితే సొంత సామాజికవర్గంపైనే జేసీ ఇలా చులకన వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారన్న దానిపై ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయని తెలుస్తోంది.

అనంతపురం జిల్లాలో తొలి నుంచి కూడా జేసీ దివాకర్ రెడ్డికి కమ్మ సామాజికవర్గంతో పొసగదు. పైగా పరిటాల రవి హత్య వెనుక జేసీ హస్తం కూడా ఉందని పరిటాల సునీతయే గతంలో పదేపదే ఆరోపణలు చేయడంతో ఆయనపై కమ్మ సామాజికవర్గం మరింత కోపం పెంచుకుంది. తొలి నుంచి కూడా తాడిపత్రి నియోజవకర్గంలో రెడ్డి సామాజికవర్గం జేసీకి అండగా ఉంటూ వస్తోంది. అయితే మొన్నటి ఎన్నికల్లో జేసీ టీడీపీలోకి వెళ్లడంతో రెడ్లు ఓటేయలేదు. పదేళ్లు అధికారంలో లేకపోవడంతో టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఉద్దేశంతో కమ్మ సామాజికవర్గం ఓటర్లు మాత్రం ఈసారి జేసీకి ఓటేశారు. దీంతో రెడ్లు తనకు ఓటేయలేదని కసిపెంచుకున్న జేసీ… ఇటీవల రెడ్డి సామాజివర్గం వారు ఆయన వద్దకు వెళ్తే కస్సున లేస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయడం సాధ్యం కాదు కాబట్టి వైసీపీ నుంచి తలుపులు పూర్తిగా మూసుకుపోకుండా జేసీ ఇంతకాలం చూస్తూ వచ్చారు.

అయితే జగన్‌ తాడిపత్రి నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా పెద్దారెడ్డిని నియమించడంతో జేసీ వైఖరిలో మార్పు వచ్చింది. ఇప్పుడు తాడిపత్రిలోకి కమ్మేతర సామాజికవర్గాలు పెద్దారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో జేసీ కుటుంబంలో అసహనం పెరిగిందని చెబుతున్నారు. పెద్దారెడ్డి నుంచి తమకు గట్టిపోటి ఖాయమన్న భావన జేసీలో ఉందని అందుకే ఏకంగా కడప జిల్లాకు వెళ్లి కూడా అక్కడి సభలో పెద్దారెడ్డి పేరును జేసీ ప్రస్తావించారని గుర్తు చేస్తున్నారు. ఇక తమకు వైసీపీలోకి వెళ్లే అవకాశం లేదని నిర్దారించుకున్న తర్వాతే జేసీ ఒక స్టాండ్ తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే గత నెల రోజులుగా జగన్‌తో పాటు సొంత సామాజికవర్గాన్ని కూడా దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసేందుకు జేసీ పూనుకున్నారు. తెలివిగా చంద్రబాబు కూడా రెడ్డి సామాజికవర్గాన్ని మానసికంగా కుంగదీసేందుకు జేసీని ప్రయోగిస్తున్నారని అనుమానిస్తున్నారు.

To Top

Send this to a friend