జియో దెబ్బకు టెలినార్ కుదేలు!

దేశంలో జియో దెబ్బకు అన్ని టెలికాం ఆపరేటర్లు కుదేలవుతున్నారు. తాజాగా భారత టెలికాం రంగంలో తొమ్మిదేళ్లుగా సేవలందిస్తున్న నార్వేకు చెందిన టెలినార్ కంపెనీ మూట ముల్లె సర్దుకుని ఎయిర్ టెల్ కు ఆస్తులన్నీ అమ్మేసింది. మొత్తంగా ఇండియాన్ మార్కెట్ ను వదిలేసి నార్వేకు వెళ్లిపోయింది. టెలినార్ టెలికాం కమ్యూనికేషన్ ను స్వాధీనం చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్టు ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, టెలినార్ గ్రూప్ సీఈవో సీవ్ బ్రెకే శుక్రవారం ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. ఎయిర్ టెల్ లో టెలినార్ విలీనంతో కస్టమర్ల సంఖ్య మరింత పెరిగి ఎయిర్ టెల్ దూసుకుపోతోంది. ఇప్పుడు దేశంలో టెలినార్ కు 4.4 కోట్ల మంది వినియోగదారులున్నారు. ఎయిర్ టెల్ కు దేశంలోనే అధికంగా 26.90 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. దీంతో ఎయిర్ టెల్ కస్టమర్లు సంఖ్య 32 కోట్లకు చేరి
ఎయిర్ టెల్ వాటా దేశంలో 35.6 శాతానికి చేరుతుంది. అంతేకాదు.. టెలినార్ కు చెందిన 7 సర్కిళ్లలోని 1800 మెగాహెర్జ్ బ్యాండ్ కూడా ఎయిర్ టెల్ చేతికి చిక్కుతుంది. కాగా జియో దెబ్బకు దేశటెలికాం రంగమే కుదలేవుతోంది. చిన్న కంపెనీ అయిన టెలినార్ కు ఇది ఆశనిపాతం అయ్యింది. అందుకే జియోను ఎదుర్కోవడం కష్టమని భావించి ఎయిర్ టెల్ లో విలీనానికి ఒప్పందం చేసుకుంది. పెరుగుతున్న ఖర్చులు, నిర్వహణ భారాన్ని భరించలేక ఎయిర్ టెల్ లో కలిసిపోయింది. జియో దెబ్బకు ఇప్పటికే ఐడియా-వోడాఫోన్లు కలిసిపోవాలనుకోవడం.. ఇప్పుడు ఏకంగా ఓ టెలికాం కంపెనీ టెలినార్ దుకాణం సర్దుకోవడంతో ఆసక్తి నెలకొంది.

To Top

Send this to a friend