బార్క్ శాస్త్రవేత్తల ఘనత:
ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో అద్భుత ఫలితాలనివ్వగల రెండు నూతన ఔషధాలను ‘బాబా అణుపరిశోధక కేంద్రం(బార్క్)’ శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు. ఆహార పదార్థాల్లో ఉపయోగించే జాపత్రి మొక్క ఫలాల గుజ్జును ఉపయోగించి వాటిని తయారుచేయడం విశేషం. ఎలుకలపై ఈ ఔషధాలతో చేసిన ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్, న్యూరోబ్లాస్టోమా(మెడ, వెన్నెముకల్లోని నాడీకణాల్లో క్యాన్సర్ కణాల పెరుగుదల)లను అవి ప్రభావవంతంగా నిరోధించినట్లు తెలిపారు. రేడియేషన్ బయాలజీ, ఆరోగ్యశాస్త్రాల విభాగంలో శాస్త్రవేత్తగా ఉన్న డాక్టర్ బి.శంకర్ పాత్రో ఈ ఔషధాల తయారీలో కీలక పాత్ర పోషించారు. క్యాన్సర్ కణాలను నాశనం చేయడంతోపాటు రేడియేషన్ కారణంగా దెబ్బతిన్న కణాలను పునరుద్ధరించడానికీ తాజా ఔషధాలు దోహదపడుతాయని పాత్రో వెల్లడించారు. మనుషులపై వీటి ప్రయోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు పొందినట్లు తెలిపారు. ముంబయిలోని టాటా మెమోరియల్ సెంటర్ ఈ ఏడాది జూన్ నుంచి తాజా ఔషధాల ప్రయోగ పరీక్షలను మనుషులపై నిర్వహించే అవకాశముందని పేర్కొన్నారు.
