‘జానా’లు బాహుబలి.. జనాలు బేజారి బలి


ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో దాదాపు పాతికేళ్లుగా మంత్రిగా కొనసాగిన దిగ్గజ నేత ఎవరు అంటే.. ఠక్కున సమాధానం చెప్తారు. ఆయనే సీనియర్ కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి.. ఇప్పుడున్న అందరు నేతల్లో ఈవెన్ చంద్రబాబు, కేసీఆర్ లను మించి కూడా ఎక్కువ కాలం మంత్రిగా జానారెడ్డి బాధ్యతలు నిర్వహించారు. నాటి ఎన్టీఆర్ హయాం ముందు నుంచే ఆయన మంత్రివర్యులు.. అంతటి సీనియర్ నేత ఎంత బాగా మాట్లాడాలి.. కానీ ఆయన అసెంబ్లీలో మాట్లాడితే ఎవ్వరికీ అర్థం కాదు. అదో మిస్టరీ అని ఇప్పటికీ తెలంగాణ శాసనసభ్యులు చర్చించుకుంటున్నారు.

జానారెడ్డి శుక్రవారం అసెంబ్లీలో అనర్గళంగా మాట్లాడారు. కానీ ఎవ్వరికీ అర్థం కాలేదు. ‘కేసీఆర్ కాంగ్రెస్ కు అధికారం కల్ల అని అంటున్నాడని.. కానీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి బాహుబలి వస్తాడని తెలిపారు… కథకు ముగింపు పలికే బాహుబలి మా కాంగ్రెస్ పార్టీకి ముగింపునిస్తాడన్నాడు. అంతేకాదు.. ఆదర్శ రాజకీయాలకు నేనో విత్తనం.. విత్తానాన్ని కాపాడుకుంటే పంటను ఇస్తా..’ అంటూ జానారెడ్డి స్పీచ్ ఇచ్చారు. కానీ ఇది ఎవరికి అర్థం కాలేదు..

అసలు కాంగ్రెస్ పార్టీని కాపాడే బాహుబలి ఎవరో జానా చెప్పలేదు. కథకు ముంగింపు పలికే బాహుబలి కాంగ్రెస్ కు ముగింపు పలుకుతాడనే రీతిలో జానా మాట్లాడడం వ్యతిరేకార్థాన్ని ఇచ్చింది.. అంతేకాదు.. తాను కాంగ్రెస్ విత్తనం అని వ్యాఖ్యానించారు. మధ్యలో వచ్చిన జానా విత్తనం అయితే మరి సోనియా, రాహుల్ నెహ్రూ, గాంధీలు ఎవరో చెప్పలేదు. ఇలా తన ప్రసంగంలో సభ్యులకీ అర్థం కాక.. తనకీ అర్థమైందో లేదో కానీ ఈ వ్యాఖ్యలతో జానారెడ్డి సభలో నవ్వులు పూయించారు.

To Top

Send this to a friend