జనం ఆశలు జనసేన పైనే..

 

సమాజంలో ప్రశ్నించే గొంతుకలు లేకుండా పోతున్నాయి. కానీ పవర్ కోసం కాదు.. ప్రశ్నించడం కోసం ఒకడొచ్చాడు. జనం కష్టాలు ఎరిగి రాజకీయ కదన క్షేత్రంలో దూకాడు.. జనం సమస్యలే ఎజెండాగా ముందుకెళ్లాడు. ఎక్కడ పేదలు అరుపులు వినపడితే అక్కడికెల్లాడు. అమరవాతి రైతుల గోడును విన్నాడు. ఉద్దానం కిడ్నీ బాధితుల మొరను ప్రపంచానికి వినిపించాడు. అనంతపురం రైతుల కష్టాలను ప్రభుత్వానికి పరిచయం చేశాడు. తిరుపతి లో అన్నార్థుల గొంతుకై ప్రత్యేకహోదా కోసం నినదించాడు. పోరాడితే పోయేదేం లేదని చాటాడు. కానీ దున్నపోతు మీద వాన పడ్డట్టు ఏలికల తీరు సాగింది. జనసేనాని బలం వారి రాజకీయాల ముందు సరిపోవడం లేదు. అమావాస్య పున్నానికి వచ్చే జనసేనాని వల్ల ప్రయోజనం ఉండడం లేదన్నది ప్రజల భావన.. తమ కోసం సమస్యల కోసం పోరాడేలా ఏపీ రాజకీయాల్లో నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నారు. కానీ అది జరిగేదెన్నడు..? జనసేనాని వచ్చేదెప్పుడు.?

* రాజకీయాల్లో జనసేన ప్రకంపనం..
జనసేన మూడేళ్ల క్రితం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతూ అడుగుపెట్టింది. జనసేన పార్టీ నీతి నిజాయితీ, నిబద్ధతతో ముందుకెళ్లింది. మకిలి రాజకీయాలకు దూరంగా నిజాయితీగల రాజకీయాన్ని జనసేన చేసింది. పవన్ నోటి వెంట పలుకులు బుల్లెట్లలా దూసుకొచ్చాయి. జనసేన పార్టీ ఏర్పాటు, ఆయన నిబద్ధత చూశాక అప్పటివరకు ఆయన లోని నటుడిని చూసిన వారు కుల మత వర్గ విభేదాలకు అతీతంగా ఆరాధించారు. మనకూ మంచి రోజులు వచ్చాయని ఆశించారు. ముఖ్యంగా యువత పవన్ కల్యాణ్ ను తమ ఐకాన్ గా ఆరాధించారు. ప్రతిసమస్యను నెత్తిన వేసుకొని ప్రశ్నిస్తున్న జనసేనానికి ప్రజల్లో ఆదరణ లభించింది.

*చంద్రబాబు గెలుపులో కీరోల్..
2014 ఎన్నికలు అవీ. పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించారు. జనసేనాని తనకు బలం చాలదన్నాడు. ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పుడే పుట్టిన జనసేనను ఒంటరిగా దింపడం ఇష్టం లేక ప్రజలు ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే పార్టీకి మద్దతిస్తానని కదిలారు. ఆయనకు కనిపించిన ఎన్డీఏ భాగస్వామ్య టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చారు. వారిని గెలిపించారు. కానీ అంతటిదో అది అయిపోలేదు. వారిచ్చిన హామీలు బుట్టదాఖలయ్యాయి.రెండేళ్లు వేచిచూసినా ప్రజల కోర్కెలు తీరలేదు. బాధితుల తరఫున గళమెత్తాడు. పాలకుల్ని ప్రశ్నించాడు. నిలదీశారు. సమస్య పరిస్కారం అయ్యే వరకు వదిలిపెట్టలేదు. నీతులు చెప్పడం కాదు.. పాటించడమే నాయకుడి లక్ష్యం అని అన్న జనసేనాని హామీ ఇచ్చి మరిచిన వారిపై తిరగబడ్డాడు. వెంకయ్యనాయుడు, చంద్రబాబుల దమననీతిని కడిగేశాడు. పలు సభలు పెట్టి ఎండగట్టారు. చురుగ్గా కార్యక్షేత్రంలోకి దిగుతారనుకున్నారంతా.. కానీ ఉవ్వెత్తున ఎగరడం.. అంతే స్థాయిలో పతనం కావడం జరిగిపోయాయి. ఒక అలలా వచ్చి వెళ్లిపోతున్న పవన్ సునామీలా రావాలని జనం కోరుకుంటున్నారు. కానీ ఆయన సినిమాలు చేస్తూ రాజకీయాలు అప్పుడప్పుడు చేస్తూ మిన్నకుండిపోతున్నారు..

* సమస్యలెన్నో సృశించాడు..
జనసేనాని పవన్ ప్రత్యేక హోదా సమస్యను ప్రధానాస్త్రంగా ఎంచుకొని పోరాడారు. దాంతో పాటు రాజధాని రైతుల భూముల వ్యవహారాన్ని ఎలుగెత్తి చాటారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ సమస్య సహా ఉద్దానం బాధితులు, అక్వా ఫుడ్ పార్క్, పోలవరం నిర్వాసితులు, కొల్లేరు బాధితులు, చేనేత కార్మికులు ఇలా ఎవరు తన తలుపు తట్టినా.. ఇబ్బందుల్లో ఉన్నా వారిని ఆదుకునేందుకు తన వంతు కృషి చేశారు.

* ఇలా ఉంటే కష్టం పవన్
రాజకీయం రంగుమారింది.. కోట్లు ఉంటేనే కానీ రాజకీయాల్లోకి రాణించలేని పరిస్థితి.. జనం గోడు పట్టని పార్టీలు ఎన్నికల ముందు డబ్బులు వెదజల్లి పీఠమెక్కుతున్నాయి. ఏదో చేస్తారని ప్రజలు ఓట్లేస్తే తమ పబ్బం గడుపుకుంటూ ప్రజల ఆశల్ని వమ్ము చేస్తున్నారు. ఇదే జరుగుతోంది. కానీ పవన్ ఆశలు, ఆశయాలు డిఫెరెంట్.. దానికోసం ఆయన ఎంచుకున్న మార్గం పూర్తిగా వ్యతిరేకం.. సమస్యల కోసం గళమెత్తే ఆయన నైజమే ప్రజల చెంతకు చేరింది. కానీ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో పనిచేసేందుకు తన వద్ద డబ్బు లేదని ఆయన చురుగ్గా ఉండడం లేదు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ అమావాస్య, పౌర్ణమికి జనం సమస్యలపై గళమెత్తుతున్నారు. కానీ పవన్ వైఖరిపై ప్రజల్లో ఇప్పటికీ తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రత్యేక హోదాపై జనంలోకి వచ్చిన జగన్ తరహాలో ప్రజల్లో పోరాటం చేయాలని భావిస్తున్నారు. కానీ కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే ఆయన ప్రశ్నలు సంధిస్తున్నారు. జనంలోకి వచ్చి క్షేత్రస్థాయిలో పోరాడడం లేదు..

*అందివచ్చిన అవకాశం అందిపుచ్చుకో..
చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎన్నో స్కాంలు, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి భూముల దందా, రైతు రుణమాఫీ, గోదావరి మెగా అక్వాఫుడ్ ఫ్యాక్టరీ నిర్మాణం, తాజా హోదా, కాల్ మనీ ఇలా ఎన్నో సమస్యలున్నాయి. ప్రజల తరఫున ప్రత్యక్షంగా పోరాడడానికి సిద్ధం కావాలి.. జగన్ ఎప్పుడూ ఏదో సమస్యపై వస్తున్నాడు. పవన్ అయితే అమావాస్య పౌర్ణమికి అలా వచ్చి టచ్ చేస్తున్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబును ఏనాడు పవన్ డైరెక్టుగా ప్రశ్నించిది లేదు.బీజేపీని, వెంకయ్యను తిడుతాడే తప్ప గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లింది లేదు. ఎంతసేపు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై మండిపడతాడే తప్ప అన్నిటికి కర్తకర్మక్రియలైనా చంద్రబాబును, హామీ ఇచ్చి మరిచిన మోడీని పల్లెత్తు మాట అనని పవన్ వైఖరి ఎవ్వరికీ నచ్చడం లేదు. అంతేకాదు చంద్రబాబు కష్టాల్లో పడ్డ ప్రతిసారీ ఏదో అంశాన్ని లేవనెత్తి ఆయనకు లాభం చేకూర్చడానే అపవాదు పవన్ పై ఉన్నది. దాన్ని తొలిగించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జగన్ కేసులతో, అవగాహన లేమితో ప్రతిపక్షంగా బలమైన నాయకుడిగా ఎదగలేకపోతున్న ఈ తరుణంలో అందివచ్చిన అవకాశాన్ని పవన్ అందిపుచ్చుకొని ఏపీలో బలమైన నేతగా.. వీలుంటే సీఎంగా ఎదిగే చాన్స్ ఆయనముందే ఉంది. ఉపయోగించుకుంటే ఆయనకు, ప్రజలకు మంచింది.

* బలం లేదు.. బలగం లేదు..

రాజకీయాలంటే సినిమాల్లో రాసిచ్చిన స్క్రిప్టును అపజెప్పినట్టు కాదు.. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. ఇప్పటికీ పవన్ పార్టీకి తగినంత బలం లేదు. కార్యకర్తల సపోర్ట్ లేదు. నాయకులు తోడుగా లేరు. అసలు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీకి బలం లేదు. అందుకే ముందు పార్టీనిర్మాణం కావాలి. రాబోయే ఎన్నికలకు రెండేళ్లే సమయం ఉంది. ఇప్పటినుంచే వ్యూహాలు రచించాలి. మనపై ప్రజాభిమానం ఉంటే సరిపోదు. అది ఓట్లుగా మార్చుకోగలిగే నేర్పు ఉండాలి. సలహాలిచ్చే దిగ్గజాలు మన పక్కన ఉండాలి. అన్నింటికి మించి ఆర్థికంగా బలంగా ఉండాలి. పవన్ ప్రసంగాల్లో ఆవేశం తప్పితే ఆచరణ లేకపోవడం ప్రజలను బాధిస్తోంది. ప్రభుత్వ చేతకానితనాన్ని లెక్కల్లో చెప్పడానికి జగన్ తరహాలో ప్రయత్నించాలి. ఎంతసేపు పూనకం వచ్చినవాడిలా లడేంగే లడేంగే అంటూ ఊగిపోతే లాభం ఉండదు. సంయమనంతో ముందుచూపుతో సాగితేనే 2019 ఎన్నికల్లో విజయం వరిస్తుంది. తాను గెలుస్తానని ముందు నమ్మాలి.. బలాన్ని పెంచుకోవాలి. అభిమానాన్ని నాయకుల సపోర్టును ఓట్ల రూపంలో పార్చితేనే నాయకుడిగా పవన్ విజయం సాధిస్తాడు..

* చివరగా..
జనసేనను ఏపీలో ప్రత్యామ్మాయ రాజకీయ పార్టీగా ప్రజలు భావిస్తున్నారు. నీతి నిజాయితీ గల పవన్ ను నమ్ముతున్నారు. కానీ ఆయన ఇలా నెలకో రెండు నెలలో అలా వచ్చి సమస్యలు ప్రస్తావించి ట్విట్టర్ గూట్లో అప్పుడప్పుడు సందడి చేస్తున్నారు. జనసేన సిద్ధాంతం, భవిష్యత్ వ్యూహాంతో రాజకీయాల్లోకి రావాలి. ఎన్నో కలలు కన్న ప్రజలు, అభిమానుల ఆశలు తీర్చాలి. అప్పుడే 2019 ఎన్నికల్లో రాజకీయాల్లో విజయం సాధిస్తాడు. ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక పవనాలను ఉపయోగించుకొని జనసేనాని జనంలో కలిసి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపి ఏపీ ప్రజల ఆకాంక్షలకు నిలువుటద్దం కావాలి. అదే జనం ఆశ..

To Top

Send this to a friend