చరిత్ర దాచిన తొలి స్వాతంత్ర సంగ్రామం:చిరంజీవి

చిరంజీవి తీస్తున్న ‘ఉయ్యాలవాడ’ కథ ఇదీ..
అది 1857.. భారతదేశంలో బ్రిటీష్ వారిపై జరిగిన తొలి తిరుగుబాటు.. .. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో మంగళ్ సింగ్ అనే భారత సైనికుడు తొలిసారి తిరగబడి దేశంలో తొలి స్వాతంత్ర్యకాంక్షను రగిల్చారు. మనకందరికి స్వాంతంత్ర్యానికి పూర్వం బ్రిటీష్ వారిపై జరిగిన తొలి తిరుగుబాటు ఇదేనని తెలుసు.. కానీ చరిత్ర దాచిన తొలి స్వాతంత్ర సంగ్రామం మన తెలుగు రాష్ట్రంలో జరిగిందని ఎవ్వరికీ తెలీదు.. ఉత్తరభారతంలో జరిగిన స్వాతంత్ర్య సంగ్రామం 1857కంటే ముందే 1846లో రాయలసీమలో బ్రిటీష్ వారిపై తిరుగుబాటు జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ వారిపై తిరుగుబావుటా ఎగురవేసి 8 నెలల పాటు వారిని ముప్పుతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు తాగించాడు. బ్రిటీష్ వారి ఈ రాయలసీమ పోరాటయోధుణి ఏమీ చేయలేక అతడి కుటుంబ సభ్యుల్ని బంధించి బ్లాక్ మెయిల్ చేసి అతడిని పట్టుకున్నారు. చివరకు ఉరి తీసి అతడి తలను కోటగుమ్మాలకు కట్టి తమ రాక్షసత్వాన్ని చాటుకున్నారు. చరిత్ర దాచిన తెలుగు స్వాతంత్ర్య వీరుడి కథ ఇప్పుడు తెరపై రాబోతోంది. చిరంజీవి తన 151 వ చిత్రంగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ’ కథను ఎంచుకున్నారు. కొన్నేళ్లుగా పరుచూరి బ్రదర్స్ ఈ సినిమా కథ ను సిద్ధం చేస్తున్నాడు. కమర్షియల్ చిత్రాలు తీసి హిట్ దర్శకుడిగా పేరుగాంచిన సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్వకత్వం వహిస్తున్నారు.
1846లో ఉయ్యాలవాడ నరిసింహారెడ్డి చరిత్ర.
అది 18వ శతాబ్ధం.. తెలంగాణలో జమీందారి వ్యవస్థలాగే.. రాయలసీమలో పాలెగాళ్ల వ్యవస్థ ఉండేది. పాలెగాళ్లు అంటే.. ఒక ఊరు కానీ.. రెండు మూడు ఊళ్లు కానీ వీరి ఆధీనంలో ఉండేవి. వీరు పన్ను వసూలు, శిస్తులు వసూలు చేసి బ్రిటీష్, నైజాం ప్రభువులకు కట్టేవాళ్లు.. ఆ ఊళ్లకు వారే ప్రభువులన్నమాట.. నైజాం నవాబు బ్రిటీష్ వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం కర్నూలు, కడప, అనంతపురంలోని ప్రాంతాలను బ్రిటీష్ వారికి ధారదత్తం చేశారు. దీంతో అప్పటివరకు పాలెగాళ్లుగా చెలామణి అయిన వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసిన బ్రిటీష్ వారు అధికారం బలంతో వాటిని కొల్లగొట్టడం మొదలు పెట్టారు. పాలెగాళ్ల అధికారాలకు కోతలు విధించడం.. వ్యవస్థను రద్దు చేయడం.. పిల్లలు లేని వారి పాలెగాళ్ల ఊళ్లను హస్తగతం చేసుకోవడం.. పాలెగాళ్లకు చెల్లించే నెలవారీ భరణాలను రద్దు చేయడం చేశారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామ పాలెగాడుగా ఉన్నారు పెదమల్లారెడ్డి.. ఆయన కుమారుడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. వీరి చేతిలో కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి జిల్లాల్లోని 66 గ్రామాలు ఉండేవి. అయితే పెద్దమల్లారెడ్డి కుటుంబానికి కూడా బ్రిటీష్ వారు భరణం రద్దు చేయడం.. హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించడంతో నరసింహారెడ్డిలో బ్రిటీష్ వారిపై పగను పెంచింది.. 1846 జూన్ లో నరసింహారెడ్డికి నెలసరి భరణం ఇచ్చేందుకు బ్రిటీష్ వారు నిరాకరించారు. దీంతో నరసింహారెడ్డి తిరుగుబావుట ఎగురవేశారు. మాన్యాలు పొగొట్టుకున్న ఇతర గ్రామాల పాలెగాళ్లు.. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదరాబాద్ కు చెందిన సలాంఖాన్, కర్నూలు కు చెందిన పాపాఖాన్ కొందరు బోయలు, చెంచులు.. కలిసి నరసింహారెడ్డి నాయకత్వంలో దాదాపు 500 మంది బ్రిటీష్ వారి కోయిలకుంట్ల ఖజానాపై తొలిదాడి చేశారు. సిబ్బందిని చంపి.. ఖజానాలోని ధనం, బంగారాన్ని దోచుకున్నారు. అలా మొదలైన నరసింహారెడ్డి స్వాతంత్ర్యఉద్యమం కొనసాగింది. ఖజానాలపై దాడులు చేసి కొల్లగొట్టడం.. ప్రజలకు పంచడం చేసేవారు. దీనిపై ఆగ్రహించిన బ్రిటీష్ సైన్యం కెప్టెన్ నాట్, వాట్సన్ ల నాయకత్వంలో నరసింహారెడ్డిని పట్టుకోవడానికి ప్రయత్నించాయి. రెడ్డిని పట్టిచ్చినవారికి అప్పట్లో 1000 రూపాయల నజరానాను బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇలా తనకోసం వచ్చిన బ్రిటీష్ సేనల్ని మాటువేసి తరిమితరిమి కొట్టారు నరసింహారెడ్డి.. అతడి ఆగడాలు ఎక్కువ కావడం విస్తరిస్తుండడంతో బ్రిటీష్ వారు కుటిల నీతికి పాల్పడ్డారు. నరసింహారెడ్డి కుటుంబ సభ్యుల్ని ఖైదు చేసి నరసింహారెడ్డి బ్లాక్ మెయిల్ చేసింది. నల్లమల కొండల్లోని పేరుసోమల జగన్నాథాలయంలో నరసింహారెడ్డి ఉన్నాడని తెలుసుకొని బ్రిటీష్ సేనలు అతడిని చుట్టుముట్టి బంధించి పాశవికంగా ఉరితీశారు. అతడి తలను కోట గుమ్మానికి కట్టి ఉద్యమకారులకు కఠిన హెచ్చరికలు పంపింది బ్రిటీష్ సర్కారు..
ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి
ఎప్పుడో 1846లో రాయలసీమలో జరిగిన ఈ స్వాతంత్ర్య ఉద్యమాన్ని తెరపైకి చూపించాలని చిరంజీవి నడుంబిగించారు. కొన్నేళ్లుగా దీనిపై పరుచూరి బ్రదర్స్ తో కథగా మలచడానికి ప్రయత్నిస్తున్నారు. దేశం చూడని తెలుగు స్వాతంత్ర్య కారుడిని పరిచయం చేయాలని చిరు ఈ ప్రయత్నానికి పూనుకున్నారు. బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసి ఖజానాలు కొల్లగొట్టి ప్రజలకు పంచిన ఉద్యమకారుడి చరిత్రను బావితరాలకు అందించేందుకు చిరు ఈ కథను ఎంచుకున్నారు. కుటుంబ సభ్యుల కోసం తన ప్రాణాలను బలిచ్చిన అద్బుత చరిత్రకారుడి సినిమాగా మలిచేందుకు పూనుకున్నారు. రేసుగుర్రం, కిక్ లాంటి మాంచి మాస్ మసలా.. కమర్షియల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డిని దర్శకుడిగా చిరంజీవి ఎంచుకున్నారు. మరి కమర్సియల్ చిత్రాల అనుభవంతో సురేందర్ రెడ్డి ఈ చారిత్రక చిత్ర కథను తెరకెక్కించేదుకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారట.. పరుచూరి వారి కథ, మాటలు, సురేందర్ రెడ్డి దర్శకత్వం ప్రతిభ.. చిరంజీవి అద్బుత నటనతో 151 వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని చూపించబోతున్నారు. తెలుగువీరుడి కథ కోసం అందరిలోనూ సర్వత్రా ఆసక్తి నెలకొంది.

To Top

Send this to a friend