చంద్రబాబు దెబ్బైపోయాడు..


కేసీఆర్ చాలా తెలివైనోడు.. ఎక్కడ తగ్గాలో తెలుసు అందుకే అనర్థాలను అంత త్వరగా తెచ్చుకోడు.. అధికారం కోసం కేసీఆర్ దాదాపు 13 ఏళ్లు కొట్లాడాడు. నాయకులు తనతో ఉన్నా వేరేపార్టీలోకి పోయినా అకుంఠిత దీక్షతో తెలంగాణ రాష్ట్రసమితిని కేసీఆర్ బతికించాడు. మధ్యలో తనతో పాటు ప్రయాణం మొదలుపెట్టిన ఆలెనరేంద్ర, విజయశాంతి లాంటి వాళ్లు కాంగ్రెస్ గడపతొక్కినా కూడా కేసీఆర్ అదరలేదు.. బెదరలేదు.. చివరకు పోరాడి తెలంగాణ సాధించుకొని ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాడు. ఆయనకు తెలుసు ఒక్కసారి అధికారంలోకి రావడం ఎంత కష్టమో… అందుకే తొందరపడడం లేదు..

* చంద్రబాబు ఉదంతమే కేసీఆర్ కు స్ఫూర్తి
సెంటిమెంటుకు జనాలు ఎప్పుడూ యాంటిమెంటు పూయరు.. ఆ విషయం చాలా సార్లు నిరూపితమైంది.. 2004కు ముందు వరుస కరువులు, రైతుల ఆత్మహత్యలు.. చంద్రబాబు హైటెక్ పొంగులకు పోయాడు. అప్పట్లో సంవత్సరం అధికారం ఉన్నా కూడా చంద్రబాబు 2003 చివరలోనే ఎన్నికలకు వెళ్లాడు. అప్పుడు తిరుపతి అలిపిరిలో నక్సలైట్లు మందుపాతర పేల్చి చంద్రబాబును హతమర్చాలనుకున్నారు. కానీ బాబు తృటిలో తప్పించుకున్నారు. ఆ సానుభూతి పనిచేస్తుందోనని వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. కానీ చంద్రబాబు పాలనతో విసిగి వేసారిన జనం చీకొట్టారు. ఆయన్ను ఓడించి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గెలిపించారు. అందుకే ఆ గుణపాఠం కళ్లముందే ఉంది. అందుకే కేసీఆర్ ప్రస్తుతం అఖండ మెజార్టీ ఉన్నా ముందస్తు ఎన్నికలకు వెళ్లనని బుధవారం స్పష్టం చేయడం గమనార్హం..

* కాంగ్రెస్ కు కష్టమే..
పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమరోత్సాహంతో ప్రకటించారు..తెలంగాణలో మధ్యంతర ఎన్నికలకు తాము రెడీ అని.. అధికారం కోసం ఎదురుచూస్తున్నామన్నారు.. దీనికి కౌంటర్ గా కేసీఆర్ బదులు ఇచ్చారు.. ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల గడువును సంపూర్ణంగా ఉపయోగించుకొని అభివృద్ధి చేస్తామని.. బాగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. ముందస్తుకు వెళ్లే అవసరం లేదన్నారు. అసెంబ్లీలో బుధవారం సీఎం కేసీఆర్ సుధీర్ఘంగా మాట్లాడారు. అమ్మా పెట్టదు.. అడుక్కు తిననీయదు అన్నట్టు కాంగ్రెసోళ్లు వాళ్ల పాలనలో చేశారు.. మేం పనిచేస్తుంటే విమర్శిస్తారు అని కేసీఆర్ మండిపడ్డారు.

కేసీఆర్ సర్వే కానీ ఇతర సర్వేల్లో కానీ ప్రజల్లో కేసీఆర్ పై.. టీఆర్ఎస్ పై నమ్మకం ఉందని తేలింది. . ముందస్తుకు వెళ్లి చేతులు కాల్చుకోకుండా పూర్తి కాలం పాలించి అభివృద్ధి చేసి ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ప్రస్తుతానికి లేదు. జనంలో కూడా మరో ఐదేళ్లు కేసీఆరేదే అధికారం అనే అభిప్రాయం ఉంది. అందుకే అనవసరంగా తొందరపడవద్దని కేసీఆర్ భావిస్తున్నారు.

To Top

Send this to a friend