ఖైదీ కోసం శత్రువులందరూ చిరుకు మిత్రులయ్యారు..

చిరంజీవి 150వ సినిమా ఖైదీనంబర్ 150 ఆయనకు ఎన్నో మధుర సృతులను మిగిల్చింది.. అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా ఈ సినిమా మిగిలిపోవడం ఖాయంగా తోస్తోంది.. అంతేకాదు.. చిరు సినిమాల్లోకీ రీఎంట్రీ ఇవ్వడంతో ఆయనపై ఇది వరకు విమర్శలు చేసిన శత్రువులు కూడా మిత్రులుగా మారి ఆయన విజయంలో పాలుపంచుకున్నారు..

మొదట్లో చిరు ఖైదీ నంబర్ 150 మూవీ ప్రి రిలీజ్ ఆడియో ఫంక్షన్ కు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గతంలో దాసరి వర్సెస్ చిరు, రాంచరణ్ పెద్ద యుద్ధమే నడించింది.. దాసరి వ్యాఖ్యలకు రాంచరణ్, చిరు కౌంటర్ లు కూడా ఇచ్చారు. కానీ చివరకు చిరంజీవి 150వ సినిమాకు దాసరియే ముఖ్య అతిథిగా రావడం అందరినీ సంభ్రమాశ్చార్యాలకు గురిచేసింది..

ఖైదీ నంబర్ 150 చిత్రం ప్రమోషన్ లో భాగంగా సాక్షి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుకోని అతిథి చిరుకు ఎదురైంది.. అప్పటివరకు రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా ఉన్న రోజా చిరంజీవిలు ఇంటర్వ్యూ సాక్షిగా కలవడంతో తమ పగలను పక్కకు పెట్టి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. చిరంజీవి అసలు రోజా వస్తుందని ఊహించలేకపోయానని సంతోషానికి గురయ్యారు. రాజకీయంగా తీవ్ర విమర్శలు చేసిన రోజానే ఇంటర్వ్యూ చేయడం.. వారిద్దరు కుశల ప్రశ్నలు వేసుకోవడం.. తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ఇంటర్వ్యూను బాగా హిట్ చేసింది.. చిరు, ఆయన భార్య సురేఖ, రోజా కలిసి దొంగచాటుగా ప్యారడైజ్ బిర్యానీ తిన్న అనుభవాలను చిరు, రోజా గుర్తు చేసుకొని ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు..

ఇలా రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరును దుమ్మెత్తిపోసిన వారే ఇప్పుడు ఆయన సినీరంగంలోకి వచ్చాక సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. పాత విభేధాలు పక్కన పెట్టి శత్రువులు సైతం చిరును చూసి మిత్రులవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోజా, దాసరి, తదితరులు చిరు రాక ఘనంగా స్వాగతించడం సినిమా రంగంలో మంచి సంప్రదాయాన్ని సృష్టిస్తోంది..

To Top

Send this to a friend