క్యాన్సర్ రోగులకు ఉచితంగా చికిత్స.. వసతి, సదుపాయాలు.

అది ఓ ‘కరుణ’ ఉన్న కన్ను..
– క్యాన్సర్ రోగుల పాలిట కల్పతరువు ‘కరుణాశ్రయ’ బెంగళూరు హాస్పిక్ ట్రస్టు..
– క్యాన్సర్ రోగులకు ఉచితంగా చికిత్స.. వసతి, సదుపాయాలు..
– మానసిక కృంగిపోకుండా కౌన్సిలింగ్..
ఒకరు కాదు ఇద్దరు కాదు ఎందరో.. క్యాన్సర్ బారిన పడి జీవితాలను పొగొట్టుకున్నారు. ఇప్పటికీ కాన్సర్ కు మందు లేదు.. చికిత్సతో తగ్గించి జీవితకాలాన్ని పెంచడమే.. క్యాన్సర్ అంటే మరణమే అనుకునే వాళ్లు చాలామంది మన సమాజంలో ఉన్నారు.. క్యాన్సర్ వచ్చిందంటే చావు కళ్లముందే ఉందనుకుంటారు.. ఇక బతకము అని ఆశలు వదులుకున్న వారు ఉన్నారు… విధి వక్రించి క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య ఇటీవల గణనీయం గా పెరిగిపోతోంది. భారత క్రికెటర్ యువరాజ్ కూడా క్యాన్సర్ బారిన పడి అమెరికాలో చికిత్స పొంది కోలుకున్నాడు. ఇప్పటికీ బ్లడ్ క్యాన్సర్ కు మందు లేదు. మరణమే.. అలాంటి క్యాన్సర్ మాయ రోగంపై పోరాడుతోంది ఓ స్వచ్ఛంద సంస్థ.. ‘‘కరుణాశ్రయ బెంగళూరు హాస్పిక్ ట్రస్టు..’’ ఇది క్యాన్సర్ బాధితులకు ఉచితంగా చికిత్స అందిస్తుంది. వారిని కోలుకునే దాకా ఆస్పత్రిలో ఉంచి అమ్మలా సాకుతుంది. పూర్తిగా కోలుకున్నాక పంపిస్తుంది.. తిండి, బట్ట, చికిత్సలు ఆస్పత్రియే చూసుకుంటుంది. రోగులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. మొత్తం ఫ్రీగా క్యాన్సర్ బాధితులకు చికిత్స, సౌకర్యాలు కల్పిస్తూ వారి బతుకుల్లో వెలుగు రేఖలు పూయిస్తున్న కరుణాశ్రయ ట్రస్టుపై ఫోకస్..
ఈ ఆస్పత్రి ఎక్కడుందంటే.. ఏం చేస్తుంది..?
క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు మీకు ఎవరున్నా మేమున్నామని తోడైనీడై కంటిపాపలా చికిత్స, పునరావాసం అందిస్తోంది కరుణాశ్రయ ట్రస్టు సంస్థ.. ఈ సంస్థ జాయింట్ ప్రాజెక్టుగా అవతరించింది.. ఇండియన్ క్యాన్సర్ సొసైటీ(కర్ణాటక చాప్టర్), మరియు రోటరీ క్లబ్ ఆఫ్ బెంగళూరు ఇందిరానగర్ సంస్థలు ఈ ఉచిత క్యాన్సర్ ఆస్పత్రిని సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. బెంగళూరులోని వార్తూర్ మెయిన్ రోడ్ లో మర్తహల్లి, కొండనహల్లి గేట్ లో ఈ ఆస్పత్రి ఉంది.. మాత్యూ జియోర్జ్ క్యాండీ ఈ ఆస్పత్రి సీఈవోగా సేవలందిస్తున్నారు. ఈ ఆస్పత్రి ఫోన్ నంబర్లు 080 42685666, 080 28476133, 28476509, Mobile 09312171599 లో సంప్రదించవచ్చు.. వెబ్ సైట్ అడ్రస్ karunashraya.org. అత్యాధునిక క్యాన్సర్ నివారణ యంత్రాలతో క్యాన్సర్ బారిన పడి చివరి అంచున ఉన్న రోగులను సైతం వీరు బతికిస్తారు.. 17వార్డులతో కర్ణాటక ప్రభుత్వం మార్తహాలీలో ఉచితంగా ఇచ్చిన ఐదు ఎకరాల భూమిలో ఈ కరుణాశ్రయ ఆస్పత్రిని నిర్మించారు. 17వార్డులతో విశాలంగా నిర్మించిన ఆ ఆస్పత్రిలో క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యం చేస్తారు.
ఆస్పత్రి ప్రత్యేకతలు..
ఈ ఆస్పత్రిని ప్రభుత్వ-ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలు కలిసి నడిపిస్తున్నాయి. రోగులకు ఉచితంగా సేవలందిస్తున్నాయి. క్యాన్సర్ రోగులు కుంగిపోకుండా మానసికంగా.. కౌన్సిలింగ్ ఇస్తారు. చికిత్సలో రోగులకు నొప్పి తెలియకుండా పెయిన్ రిలీఫ్ ఇంజక్షన్స్, మార్ఫిన్ టాబ్లెట్లు ఇస్తారు. క్యాన్సర్ రోగులకు అత్యాధునిక చికిత్స ఇచ్చి వారి రోగాన్ని నయం చేస్తారు. తిండి, వసతి సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తారు.. పేరొందిన కార్పొరేట్, ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి కూడా రోగులను ఇక్కడి ఆస్పత్రికి రెఫర్ చేస్తారంటే ఎంత మంచి ఆస్పత్రియో అర్థం చేసుకోవచ్చు.. అంతేకాదు రోగులను ఆనందపరచడానికి ప్రతి సాయంత్రం నర్సులు వారికి ఎంటర్ టైన్ మెంట్ సౌకర్యాలు కల్పిస్తారు. చెస్,క్యారమ్, ఇండోర్ గేమ్స్ ఆడిస్తూ సేదతీరుస్తారు. వీల్ చైర్ తో బయటకు తీసుకెళ్లి నడిపిస్తారు. పార్కుల్లో సేదతీరుస్తారు.. సైకో థెరపిస్టులతో కౌన్సిలింగ్ ఇప్పించి వారికి మనోధైర్యాన్నిస్తారు. ఇలా ఈ ఆస్పత్రి సేవలకు ఇప్పటికి ఎన్నో అవార్డులు వచ్చాయి. వీరు చేస్తున్న సేవను అందరూ వేయినోళ్ల పొగుడుతున్నారు. క్యాన్సర్ బాధితుల కల్పతరువులాంటి ఈ ఆస్పత్రి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని సదుపాయాలను వినియోగించుకుంటే వారి బతుకులు బాగుపడతాయి.

To Top

Send this to a friend