కోడిగుడ్డు పెంకుల‌ను తింటే ఎన్నో లాభాలు..

కోడిగుడ్లంటే ఇష్టం ఉండ‌నిది ఎవ‌రికి చెప్పండి. చాలా మంది వీటిని ఆమ్లెట్ లేదా బాయిల్డ్ ఎగ్ రూపంలో తింటారు. కొంద‌రు కూర చేసుకు తింటారు. చికెన్‌, మ‌ట‌న్ తిన‌ని వారు కూడా కోడిగుడ్ల‌ను తింటారు. అయితే కోడిగుడ్ల‌లో ఉండే తెల్ల‌ని, ప‌చ్చ‌ని సొనే కాదు. కోడిగుడ్డు పెంకుల‌ను కూడా తిన‌వ‌చ్చ‌ట తెలుసా! అవును మీరు విన్న‌ది నిజ‌మే. కోడిగుడ్డు పెంకుల‌ను నిర‌భ్యంత‌రంగా తిన‌వ‌చ్చు. వాటిని ఎలా తినాలో, దాంతో మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కోడిగుడ్డు పెంకుల‌ను నిరభ్యంత‌రంగా తిన‌వ‌చ్చు. వాటిని మ‌న శ‌రీరం సుల‌భంగా జీర్ణం చేసుకోగ‌లుగుతుంద‌ట‌. అయితే వాటిని అలాగే డైరెక్ట్‌గా తిన‌కూడ‌దు. ముందుగా కావ‌ల్సిన‌న్ని కోడిగుడ్డు పెంకుల‌ను తీసుకుని వాటిని శుభ్రంగా క‌డిగి నీటిలో మ‌రిగించాలి. 10 నిమిషాల పాటు వాటిని బాగా నీటిలో మ‌రిగించాక ఆ నీటి నుంచి పెంకుల‌ను తీసి ఆర‌నివ్వాలి. అనంత‌రం అవి పొడిగా అయ్యాక మిక్సీలో వేసి పౌడ‌ర్‌లా ప‌ట్టాలి. మిక్సీకి రావ‌నుకుంటే కాఫీ బ్లెండ‌ర్‌ను కూడా వాడ‌వ‌చ్చు. అలా తయారు చేసిన పౌడ‌ర్‌ను నిత్యం అర టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. దీని వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే…

1. పైన చెప్పిన విధంగా కోడిగుడ్డు పెంకుల‌ను తిన‌డం వ‌ల్ల రోజులో మ‌న‌కు కావ‌ల్సిన కాల్షియంలో దాదాపు 90 శాతం వ‌ర‌కు అందుతుంది. ఇది మ‌న ఎముక‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. ప్ర‌ధానంగా మ‌హిళ‌ల‌కు, పిల్ల‌ల‌కు ఇది ఎంతో అవ‌స‌రం కూడా. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి.

2. కోడిగుడ్డు పెంకుల పొడిలో ఉండే కాల్షియం అత్యంత స‌హ‌జ సిద్ధ‌మైన‌ద‌ని వైద్యులు చెబుతున్నారు. దీన్ని మ‌న శ‌రీరం సులభంగా అరిగించుకుంటుంద‌ట‌. దంతాలు, ఎముక‌లు, కండ‌రాలు, న‌రాల‌కు ఈ కాల్షియం ఎంత‌గానో అవ‌స‌ర‌మ‌ని వారు చెబుతున్నారు.

3. కోడిగుడ్డు పెంకుల పౌడ‌ర్‌లో ఉండే ఔష‌ధ కార‌కాలు బీపీని, ర‌క్తంలోని చెడు కొలెస్ట‌రాల్‌ను త‌గ్గిస్తాయి. ఈ పౌడ‌ర్‌ను ఫేస్‌ప్యాక్‌లా వేసుకుంటే ముఖం ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

4. కోడిగుడ్డు పెంకుల్లో ఉండే కాల్షియం మొక్క‌ల‌కు కూడా అవ‌స‌ర‌మే. ఇంట్లో మొక్క‌ల‌ను ఎక్కువ‌గా పెంచేవారు ఆ పెంకుల్ని ప‌డేయ‌కుండా మొక్క‌ల‌కు ఎరువుగా వేస్తే అవి ఏపుగా పెరుగుతాయి.

5. ఎగ్ షెల్ పౌడ‌ర్‌ను ఇంట్లో పెంచుకునే కుక్క‌ల‌కు కూడా తినిపించ‌వ‌చ్చ‌ట‌. దీని వ‌ల్ల వాటికి కూడా కాల్షియం బాగా అందుతుంది. అయితే ఈ పౌడ‌ర్‌ను నేరుగా కాకుండా అవి తినే ఆహారంలో క‌లిపితే బాగుంటుంది.

6. కాఫీని మ‌ర‌గ‌బెట్టే స‌మ‌యంలో కొద్దిగా ఎగ్ షెల్ పౌడ‌ర్‌ను క‌లిపితే కాఫీ ఎక్కువ చేదుగా అనిపించ‌ద‌ట‌. దీంతోపాటు ఆ పౌడ‌ర్ ద్వారా మ‌న‌కు ఎలాగూ పోష‌కాలు అందుతాయి కూడా.

To Top

Send this to a friend